ఎవరు దేవతలు… ఎవరు రాక్షసులు…?

పురాణాల కాలంలో దేవతలు ఉండేవారు. వారు హీరోలు అయితే విలన్లుగా రాక్షసులు ఉండేవారు. దేవతలు యజ్ఞ యాగాదులు చేస్తే రాక్షసులు వాటిని భ్రష్టు పట్టించేలా వినాశనాలు చేస్తూ [more]

Update: 2021-09-26 00:30 GMT

పురాణాల కాలంలో దేవతలు ఉండేవారు. వారు హీరోలు అయితే విలన్లుగా రాక్షసులు ఉండేవారు. దేవతలు యజ్ఞ యాగాదులు చేస్తే రాక్షసులు వాటిని భ్రష్టు పట్టించేలా వినాశనాలు చేస్తూ ఉండేవారు. మరి కలియుగంలో ఆధునిక కాలంలో కూడా రాక్షసులు ఉన్నారా. అంటే ఉన్నారని అధికార పక్షం అంటోంది. అది ఏ పార్టీకి చెందినది అని ప్రశ్న ఇక్కడ లేదు. అధికార పార్టీ అంటే హీరో, వారే దేవతలు, వారు చేసే పనులను అడ్డుకునే వారంతా రాక్షసులు. ఈ మాటను కనిపెట్టింది. రాక్షసులకు సరైన డెఫినిషన్ ఇచ్చినది తెలుగుదేశం పార్టీ. అప్పట్లో మాటకొస్తే చాలు టీడీపీ నేతలు వైసీపీ వారి మీద గట్టిగా విరుచుకుపడేవారు. తాము మంచి పనులు చేస్తూంటే చూసి ఓర్వలేక దానవుల మాదిరిగా ప్రవర్తిస్తున్నారని ఘాటుగా మాట్లాడేవారు.

సీన్ కట్ చేస్తే….?

ఇక ఇపుడు సర్కార్ మారింది. అధికారం కూడా వారి నుంచి వీరి వైపునకు వచ్చింది. నాడు రాక్షసులుగా టీడీపీ వారి చేత తిట్లు తిన్న వైసీపీ వారు దేవతలు ఒక్కసారిగా అయిపోయారు. ఇక విపక్షంలో వచ్చిన టీడీపీ వారు రాక్షసులుగా రోల్ మార్చేశారుట. అవును మరి ఇపుడు వైసీపీ నేతలు తరచూ ఇదే మాట అంటున్నారు. సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ దగ్గర నుంచి మొదలుపెడితే వైసీపీ సాధారణ నాయకుడి వరకూ అందరూ టీడీపీ చేష్టలను రాక్షులతో పోలుస్తూ తెగ విమర్శలు చేస్తున్నారు. వైసీపీ సర్కార్ చేసే ప్రతి మంచి పనినీ అడ్డుకోవడమే తెలుగుదేశం పని అని కూడా వారు అంటున్నారు.

ఇంతకీ ప్రజలేంటి …?

సరే టీడీపీ, వైసీపీ నేతలు రాజకీయాలకు అనుగుణంగా పాత్రలు మార్చుకుంటున్నారు. దేవ దానవ సంగ్రామం గత ఏడేళ్ళుగా ఏపీలో రంజుగా సాగుతోంది. ఎవరు గెలిచారో ఓడారో కానీ మధ్యన నలిగిపోతున్నది మాత్రం అచ్చంగా ప్రజలే. అయిదు కోట్ల మంది ప్రజలు ఇంతకీ ఏ పాత్ర పోషిస్తున్నారు అన్నదే ప్రశ్న. అలాగే వారు ఏ పాపం చేశారని ఇలా అభివృద్ధి ఫలాలు దక్కకుండా అడ్డుకుంటున్నారు అన్నది కూడా పాయింటే. మరి జగన్ అయినా చంద్రబాబు అయినా ప్రజలకే జవాబుదారిగా ఉండాలి. అంతిమంగా వారే ఫలాలను, ఫలితాలను పొందలసిన వారు. ద్వేషముంటే అది రాజకీయ పార్టీలకే పరిమితం కావాలి తప్ప ప్రజల పొట్ట కొట్టకూడదు. కానీ ఏపీలో జరుగుతున్నది మాత్రం కంప్లీట్ డిఫరెంట్ గానే ఉంది అంటున్నారు.

సయోధ్య మిధ్య …

దేశంలో ఏ రాష్ట్రంలో లేని విచిత్ర పరిస్థితి ఏపీలో ఉంది. ఇక్కడ అధికార, ప్రతిపక్షాలైన వైసీపీ, టీడీపీ ప్రజాస్వామ్యంలో ఉన్నట్లుగా తమ పాత్రలను పోషించడంలేదు అంటున్నారు. ఏకంగా రాక్షసులు, దేవతలు అన్నట్లుగా భారీ విభజన గీసేసుకుని మరీ పురాణ కాలం నాటి రాజకీయమే చేస్తున్నారు. రెండు పక్షాలు కలసి ప్రజలకు మేలు చేయాలని ఏ కోశానా ఆలోచించకపోవడం వల్లనే ఏపీలొ ఈ రాక్షస సంగ్రామం ఇలా నిర్విరామంగా సాగుతోంది అని మేధావులు అంటున్నారు. ఇప్పటికైనా రాష్ట్రాభివృద్ధి కోసం ఒక్కటి అయితేనే జనాలు ఈ రాజకీయాన్ని హర్షిస్తారు అని కూడా అంటున్నారు. మార్పు కొరకు ఎదురుచూడాలి మరి.

Tags:    

Similar News