తిరుపతిలో ఇదేంది గోవిందా? ఇలా అయితే ఎలా?

ప‌విత్ర పుణ్యక్షేత్రమైన తిరుప‌తి రాజ‌కీయంగా వార్తల్లో నిలుస్తూ వ‌స్తోంది. త్వర‌లోనే తిరుప‌తి పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. క‌రోనాతో తిరుప‌తి ఎంపీ బ‌ల్లి దుర్గాప్రసాద్ ఆక‌స్మికంగా [more]

Update: 2021-03-01 15:30 GMT

ప‌విత్ర పుణ్యక్షేత్రమైన తిరుప‌తి రాజ‌కీయంగా వార్తల్లో నిలుస్తూ వ‌స్తోంది. త్వర‌లోనే తిరుప‌తి పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. క‌రోనాతో తిరుప‌తి ఎంపీ బ‌ల్లి దుర్గాప్రసాద్ ఆక‌స్మికంగా మృతి చెంద‌డంతో ఈ లోక్‌స‌భ సీటుకు ఉప ఎన్నిక అనివార్యం కానుంది. ఇదిలా ఉంటే తిరుప‌తి నియోజ‌క‌వ‌ర్గంలో అధికార పార్టీలో మూడు ముక్కలాట న‌డుస్తోంద‌ట‌. ఇందులో ఇద్దరు ప్రజా ప్రతినిధుల‌తో పాటు పొరుగు జిల్లాకు చెందిన ఓ బ‌డా రెడ్డి కూడా ఇన్వాల్ కావ‌డంతో ఈ ముగ్గురు రెడ్ల మ‌ధ్య కోల్డ్‌వార్ చాప‌కింద నీరులా విస్తరిస్తోంద‌ని స్థానికంగా… ఇంకా చెప్పాలంటే వైసీపీ వ‌ర్గాల్లోనే వినిపిస్తోన్న మాట‌. జ‌గ‌న్‌కు అత్యంత న‌మ్మిన‌బంటు అయిన ఓ నేత తిరుప‌తి నియోజ‌క‌వ‌ర్గాన్ని త‌న అడ్డాగా చేసుకున్నారు. జ‌గ‌న్ గ‌తంలో ఆయ‌న‌కు ఎంత ప్రయార్టీ ఇచ్చినా త‌ర్వాత ఎక్కడో తేడా కొట్టడంతో చిన్న గ్యాప్ వ‌చ్చింద‌న్న ప్రచారం ఉంది.

ఆయనకే ఎక్కువ ప్రాధాన్యత…..

అయితే ఈ నియోజ‌క‌వ‌ర్గాన్ని ఆనుకునే ఉన్న మ‌రో నియోజ‌క‌వ‌ర్గ నేత‌కు ఇటీవ‌ల జ‌గ‌న్ ద‌గ్గర ప్రయార్టీ ఎక్కువైంది. ఆయ‌న త‌న నియోజ‌క‌వ‌ర్గంలోనే కాకుండా.. తిరుప‌తిలోనూ కాళ్లు, వేళ్లు పెట్టేస్తూ నానా హ‌డావిడి చేస్తున్నార‌ట‌. తిరుప‌తి న‌గ‌రం అంతా పొరుగు నియోజ‌క‌వ‌ర్గ ప్రజాప్రతినిధి ఫ్లెక్సీలు, క‌టౌట్లతోనే ఎక్కువుగా ద‌ర్శన‌మిస్తోంది. చివ‌ర‌కు ఆయ‌న‌కు తిరుప‌తి న‌గ‌రంలోనూ బ‌ల‌మైన వ‌ర్గం ఏర్పడ‌డంతో తిరుప‌తి నేత స‌హించ‌లేని ప‌రిస్థితి. అదేమని గొడ‌వ‌కు దిగుదామంటే పొరుగు నియోజ‌క‌వ‌ర్గ నేత‌కే ఇప్పుడు జ‌గ‌న్ ఎక్కువ ప్రయార్టీ ఇస్తున్నారు.

పొరుగు జిల్లా నేత కూడా….

ఇక తిరుప‌తి కార్పొరేష‌న్ కావ‌డంతో ఇక్కడ ప్రతి రోజు అనేకానేక పంచాయ‌తీలు న‌డుస్తుంటాయి. వీటిల్లోనూ పొరుగు నియోజ‌క‌వ‌ర్గ ప్రజా ప్రతినిధి జోక్యం బాగా ఎక్కువ అవుతోంద‌ట‌. అదేమ‌ని అడిగితే వాళ్లు నా వ‌ర్గం వాళ్లు అని ఖ‌రాఖండీగా స‌మాధానం వ‌స్తుందంటున్నారు. ఈ ఇద్దరు నేత‌లు కీల‌క‌మే కావ‌డంతో పాటు అధిష్టానానికి ద‌గ్గర‌గా ఉండ‌డంతో అధికారులు, పోలీసులకు సైతం వీరికి స‌ర్దిచెప్పడం క‌త్తిమీద సాములా మారింద‌ట‌. ఇక పొరుగునే ఉండే జ‌గ‌న్ సొంత జిల్లాకు చెందిన మ‌రో రెడ్డి నేత సైతం తిరుప‌తినే త‌న అడ్డాగా చేసుకుని రాజ‌కీయాలు న‌డుపుతున్నారు.

ఆ నియోజకవర్గంలో ఆధిపత్యం కూడా….

క‌డ‌ప జిల్లాలోని రైల్వేకోడూరు ఎస్సీ రిజ‌ర్వ్‌డ్ నియోజ‌క‌వ‌ర్గం కావ‌డంతో అక్కడ అధికార పార్టీ కార్యక‌లాపాలు అన్నీ ఈ రెడ్డి నేత క‌నుస‌న్నల్లోనే న‌డుస్తుంటాయి. స‌ద‌రు రెడ్డి నేత గ‌తంలో గంధ‌పు చెక్కల స్మగ్లింగ్‌లో ప్రధాన సూత్రధారి. ఇప్పుడు ఆయ‌న తిరుప‌తినే త‌న అడ్డాగా చేసుకున్నార‌ట‌. ఆయ‌న కూడా ఇక్కడ ఓ వ‌ర్గం మెయింటైన్ చేస్తుండ‌డంతో స్థానిక ప్రజాప్రతినిధికి గోరుచుట్టపై రోక‌టి పోటు మాదిరిగా మారింది. ఈ క‌డ‌ప జిల్లా రెడ్డి నేత ఇక్క‌డ పంచాయ‌తీల పెద‌రాయుడుగా మారిపోయార‌ట‌.

వార్నింగ్ ఇచ్చినా…?

దీంతో చిర్రెత్తుకొచ్చిన స్థానిక ప్రజా ప్రతినిధి ఆ పొరుగు జిల్లా నేత‌కు వార్నింగ్ ఇచ్చినా చివ‌ర‌కు ఆయ‌న సీఎం సొంత జిల్లా నేత కావ‌డంతో పాటు సీఎం బంధువుల అండ‌దండ‌లు పుష్కలంగా ఉండ‌డంతో స్థానిక నేతే వెన‌క్కు త‌గ్గడంతో పాటు కాంప్రమైజ్ కావాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింద‌ట‌. ఏదేమైనా ఈ ముగ్గురు రెడ్డి నేత‌ల పంచాయ‌తీలే ఇప్పుడు తిరుప‌తి అధికార పార్టీలో హాట్ టాపిక్‌గా మారాయి.

Tags:    

Similar News