బ్యాలన్స్ తప్పుతున్న విజయసాయి ?

అవును మరి అన్ని సమస్యలూ ఒక్కసారిగా తరుముకువస్తున్నాయి. పైగా అవతల వారు విసిరే సవాళ్ళు తట్టుకోలేనివిగా ఉన్నాయి. దాంతో వైసీపీ అధినాయకత్వంలో అసహనం కట్టలు తెంచుకుంటోందా అన్న [more]

Update: 2021-07-10 12:30 GMT

అవును మరి అన్ని సమస్యలూ ఒక్కసారిగా తరుముకువస్తున్నాయి. పైగా అవతల వారు విసిరే సవాళ్ళు తట్టుకోలేనివిగా ఉన్నాయి. దాంతో వైసీపీ అధినాయకత్వంలో అసహనం కట్టలు తెంచుకుంటోందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వైసీపీ రెబెల్ ఎంపీ రఘురమ కృష్ణరాజు విషయం తీసుకుంటే ఏడాదిగా ఆయన మీద వేటు వేయాలని వైసీపీ డిమాండ్ చేస్తూ వస్తోంది. కానీ ఇప్పటిదాకా ఆ పని జరగలేదు సరికదా క్లరికల్ మిస్టేక్స్ అంటూ మళ్లీ ఫిర్యాదు చేయమనడం సాగదీత కోసమే అని ఎవరికైనా అర్ధమైపొతోంది. ఇక స్పీకర్ ఆఫీస్ కోరినట్లుగానే వైసీపీ ఎంపీలు రఘురామ మీద మళ్ళీ ఫిర్యాదు చేశారు. అనర్హత వేటు త్వరగా వేయాలని కోరారు. అయితే దీన్ని ప్రివిలేజ్ కమిటీ పరిశీలనకు పంపుతాను అంటూ స్పీకర్ కొత్త మెలిక పెట్టడంతో ఇపుడు వైసీపీ పెద్దలకు సహనం నశిస్తోంది.

స్పీకరే టార్గెట్…?

నిజానికి రాష్ట్రాలలో ఈ తరహా రచ్చ చూస్తూంటారు. స్పీకర్లు ఏకపక్షంగా ఉంటారని, అధికార పార్టీ కొమ్ము కాస్తారని విపక్షలు ఆరోపిస్తాయి. గత అయిదేళ్లలో వైసీపీ ఇలాగే అప్పటి స్పీకర్ కోడెల మీద కామెంట్స్ చేసేది. కానీ ఇపుడు ఏకంగా లోక్ సభ స్పీకర్ మీదనే విజయ‌సాయిరెడ్డి గట్టిగానే మాట్లాడుతున్నారు. ఇదే విషయం మీద విజయ‌సాయిరెడ్డి ఆ మధ్యన ఒక లేఖను స్పీకర్ ఆఫీస్ ని పంపినపుడే అందులో ఘాటైన పదజాలం ఉపయోగించారు. ఇపుడు స్పీకర్ ని కలసి వచ్చిన తరువాత మీడియాతో మాట్లాడుతూ స్పీకర్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు అంటూ హాట్ కామెంట్స్ చేశారు. అంటే వైసీపీ వార్ కి రెడీ అయిపోతోంది అన్న సంకేతాలు ఇచ్చేశారు అన్న మాట.

అదీ అసలు భయం….?

నిజానికి ఇంత తొందర వైసీపీకి ఎందుకు వచ్చింది అంటే వర్షాకాల సమావేశాల్లో రఘురామరాజు తన పైన ఏపీ సీఐడీ విభాగం చేసిన దాడిని ప్రస్థావించడానికి తయారుగా ఉన్నారు. అది కనుక సభలో చర్చకు వస్తే వైసీపీ పరువు జాతీయ స్థాయిలో పోవడం ఖాయం. జగన్ ఇమేజ్ డ్యామేజ్ అవడమూ ఖాయమే. మరో వైపు చూస్తే అనర్హత పిటిషన్ మీద సాచివేత ధోరణితో కేంద్ర పెద్దలు ఉన్నారు అంటేనే రాజుకు మద్దతుగా నిలుస్తున్నారు అని అర్ధం చేసుకోవాలి. పేరుకు స్పీకర్ మీద వైసీపీ బాణాలు వేస్తున్నా అసలు యుద్ధం బీజేపీ పెద్దలతోనే అన్నది అందరికీ తెలిసిందే. ఈసారి సభలోకి రఘురామరాజు రానీయకుండా చేయాలన్న వైసీపీ పట్టుదలకు కూడా ఇపుడు అగ్ని పరీక్ష ఎదురవుతోంది.

చెడ్డ కావడం తప్ప …?

ఏ ప్రత్యేక హోదా విషయంలోనో విభజన హామీల మీదనో పార్లమెంట్ ని స్థంభింపచేస్తే వైసీపీకి ఒక విలువ గౌరవం పెరుగుతాయి. అలాగే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అశం మీద చర్చ జరిపి కేంద్రాన్ని నిలదీసినా జనం మద్దతుగా నిలుస్తారు. కానీ వైసీపీ ఒక రెబెల్ ఎంపీ మీద వేటు వేయాలంటూ పార్లమెంట్ ని స్టాల్ చేస్తామని అంటోంది. దీని వల్ల బీజేపీ పెద్దల కన్నెర్రకు గురి కావడం తప్ప మరోటి జరగదు. అంతే కాదు జనాలకు కూడా ఇది పట్టే విషయం కాదు. ఇవన్నీ వైసీపీ ఎందుకు చేస్తోంది అంటే తీవ్రమైన వత్తిడితో పాటు నిండా అసహనం నింపుకోవడం వల్లనే అంటున్నారు. మొత్తానికి రాజు విషయంలో ఏమీ జరగదు అని గత ఏడాది పరిణామాలు సామాన్యుడికి కూడా అర్ధమవుతున్నా వైసీపీ దూకుడు చేస్తోంది అంటే ఫ్రస్ట్రేషన్ తప్ప‌ మరోటి కాదన్న మాటేగా.

Tags:    

Similar News