ఆప‌రేష‌న్ చీరాల‌.. వైసీపీలో తెగని పంచాయితీ

అధికార పార్టీ వైసీపీలో నేత‌ల మ‌ధ్య ఆధిప‌త్య రాజ‌కీయాలు పెరుగుతున్నాయి. త‌మ‌దే పైచేయి కావాలంటే .. త‌మ‌దే పైచేయి కావాలంటూ.. పెద్ద ఎత్తున అధికార పార్టీలో నేత‌లు [more]

Update: 2020-05-27 02:00 GMT

అధికార పార్టీ వైసీపీలో నేత‌ల మ‌ధ్య ఆధిప‌త్య రాజ‌కీయాలు పెరుగుతున్నాయి. త‌మ‌దే పైచేయి కావాలంటే .. త‌మ‌దే పైచేయి కావాలంటూ.. పెద్ద ఎత్తున అధికార పార్టీలో నేత‌లు పోటీ ప‌డుతున్నారు. దీంతో పూట‌కో పంచాయి‌తీ తెర‌మీదికి వ‌స్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. తాజాగా అంద‌రూ ఎక్స్‌పెక్ట్ చేసిన‌ట్టే ప్రకాశం జిల్లా చీరాల రాజ‌కీయాలు తెర‌మీదికి వ‌చ్చాయి. ఇక్కడ రాజ‌కీయంగా నిన్న మొన్నటి వ‌ర‌కు క‌త్తులు దూసు కున్న నాయ‌కులు.. ఇప్పుడు ఒకే పార్టీలో ఉన్నారు. అయినా ఇక్కడ కూడా కారాలు మిరియాలు నూర‌డం గ‌మ‌నార్హం. ఒక‌రిపై ఒక‌రు పైచేయి సాధించేందుకు ప్రయ‌త్నిస్తున్నారు.

అగ్రిమెంటు ఇదీ….

చీరాల నియోజ‌క‌వ‌ర్గంలో గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌ఫున పోటీ చేసిన ఆమంచి కృష్ణమోహ‌న్‌.. ఓడిపోయారు. టీడీపీ నుంచి గెలిచిన క‌ర‌ణం బ‌లరాం అనూహ్యంగా వైసీపీకిమ‌ద్దతు ప‌లికారు. నేరుగా వ‌చ్చి వైసీపీ కండువా క‌ప్పుకోక పోయినా.. త‌న కుమారుడు క‌ర‌ణం వెంక‌టేష్‌ను వైసీపీలో చేర్పించారు. క‌ర‌ణం త‌న‌యుడికి ప్రస్తుతం డీసీసీబీ చైర్మన్ లేదా జ‌డ్పీ చైర్మన్‌ల‌లో ఏదో ఒక ప‌ద‌వి క‌ట్టబెట్టడంతో పాటు ఆ త‌ర్వాత అద్దంకి సీటు ఖాయం చేసేలా వైసీపీ పెద్దల‌తో ఒప్పందం కుదిరింద‌ని అంటున్నారు. దీంతో ఇప్పుడు చీరాల‌ వైసీపీలో రెండు రాజ‌కీయ కేంద్రాలు ఏర్పడ్డాయి.

అధికారుల బదిలీల విషయంలో….

ఆమంచి వ‌ర్సెస్ క‌ర‌ణం బలరాంలు ఎవ‌రికి వారే త‌మ‌దే పైచే యి కావాలంటే.. త‌మ‌దే కావాలంటూ.. ప‌ట్టుబ‌డుతున్నారు. ఇప్పటికే ఒక సారి స్థానిక ఎన్నిక‌ల సీట్ల విష‌యంలో పంచాయితీ జ‌రిగింది. దానిని మంత్రి బాలినేని శ్రీనివాస‌రావు.. ఏదో తిప్పలు ప‌డి మ‌రీ ప‌రిష్క రించారు. నియోజ‌క‌వ‌ర్గంలో బీ ఫాంలు ముందుగా ఆమంచికి ఇచ్చాక త‌ర్వాత ఆమంచిని వెన‌క్కి పిలిపించి మ‌రీ ఆ బీఫాంలు రెండు వ‌ర్గాల‌కు పంపిణీ చేశార‌ని వార్తలు వ‌చ్చాయి. ఇక ఇప్పుడు అధికారుల బ‌దిలీల విష‌యం తెర‌మీదికి వ‌చ్చేస‌రికి క‌ర‌ణం బలరాం పెద్ద ఎత్తున ఓ జాబితా ప‌ట్టుకుని బ‌య‌ల్దేరారు. దీనిలో ఆమంచి కృష్ణమోహ‌న్ గ‌తంలో పంపేసిన అధికారుల‌ను తిరిగి చీరాల నియోజ‌క‌వ‌ర్గంలో వేసేలా ప్రతిపాద‌న‌లు ఉన్నాయి.

బాలినేని వద్దకు మళ్లీ…..

గ‌త టీడీపీ ప్రభుత్వ హ‌యాంలో క‌ర‌ణంకు స‌పోర్ట్ చేసిన వారి లిస్ట్ కూడా ఇందులో ఉంద‌ట‌. దీంతో ఈ విష‌యం ఇరు ప‌క్షాల మ‌ధ్య అగ్గి రాజేసింది. నియోజకవర్గంలోని అనుచరులతో కలిసి కొద్ది రోజుల క్రితం బాలినేనిని ఆయన కలిశారు. ఎమ్మె ల్యే బలరాం, ఆయన కుమారుడిపై వారు ఫిర్యాదులు చేసినట్లు తెలిసింది. ఏ విషయంలోనైనా తమ సిఫార్సులకే ప్రాధాన్యం ఇవ్వాలని కోరినట్లు కూడా సమాచారం. ఇప్పుడు ఈ విష‌యం తీవ్ర చ‌ర్చకు దారితీసింది. అయితే, దీనిపై ఏదో ఒక‌టి తేల్చేయాల‌ని ఆమంచి వ‌ర్గం ప‌ట్టుబ‌డుతుంటే.. బాలినేని మాత్రం ఇరు ప‌క్షాల‌ను స‌ముదాయించే ప్రయ‌త్నం చేస్తున్నారు. బాలినేని మాత్రం క‌ర్ర విర‌గ‌దు.. పాము చావ‌దు అన్నట్టుగా రెండు వ‌ర్గాలు త‌మ‌కు కావాల్సిన‌వే అని వ్యవ‌హ‌రిస్తున్నారు. ఏదేమైనా ఈ నాలుగేళ్లు చీరాల‌లో ఈ పంచాయితీ తెగేలా లేదు.

Tags:    

Similar News