బీజేపీని దెబ్బకొట్టడానికి వైసీపీ స్కెచ్..?
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల్లో ఆసక్తికర రాజకీయం తెరమీదికి వచ్చింది. ఏపీకి చెందిన పార్టీలు కూడా ఈ ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యాయి. టీడీపీ కూడా పోటీకి దిగింది. [more]
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల్లో ఆసక్తికర రాజకీయం తెరమీదికి వచ్చింది. ఏపీకి చెందిన పార్టీలు కూడా ఈ ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యాయి. టీడీపీ కూడా పోటీకి దిగింది. [more]
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల్లో ఆసక్తికర రాజకీయం తెరమీదికి వచ్చింది. ఏపీకి చెందిన పార్టీలు కూడా ఈ ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యాయి. టీడీపీ కూడా పోటీకి దిగింది. ఇక, జనసేన.. నిన్న మొన్నటి వరకు పోటీ చేస్తానని చెప్పి.. తర్వాత అనూహ్యంగా నిర్ణయం మార్చుకుని బీజేపీకి మద్దతు పలికింది. ఇంత వరకు బాగానే ఉన్నా.. మరో కీలకమైన పార్టీ వైసీపీ మాత్రం ఈ పోటీకి దూరంగా ఉండడం ఆసక్తికర చర్చకు దారితీసింది. వాస్తవానికి.. ఇక్కడ ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ బరిలో నిలిచినా.. బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ మధ్య ప్రధాన పోరు సాగనుంది.
వ్యూహ ప్రతివ్యూహాలతో…..
దీంతో రాజకీయంగా వ్యూహ ప్రతివ్యూహాలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే తాను ఎన్నికల్లో పోటీకి సిద్ధమని.. కనీసం 50 వార్డుల్లో అయినా.. పోటీ చేస్తానని చెప్పిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీకి మద్దతు ప్రకటించారు. అంటే.. బీజేపీ ఇక్కడ టీఆర్ఎస్‌ను ఓడించి.. ఆధిపత్యం సాధించాలనే వ్యూహంతో ముందుకు సాగుతోంది. ఇటీవల దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ అనూహ్యంగా పుంజుకోవడం కూడా ఆ పార్టీకి కలిసి వచ్చింది. మరి ఇప్పుడు టీఆర్ఎస్ ఒంటరి పోరేనా ? ఆ పార్టీ ఎదురీదాల్సిందేనా ? ఇటీవల తుఫాను కారణంగా కురిసిన వర్షాలతో హైదరాబాద్ మునిగిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
రెండు విధాలుగా లాభం….
ఈ నేపథ్యంలో సహజంగానే అధికార పార్టీపై ఆగ్రహంతో కొన్ని ఇబ్బందులు తప్పేలా లేవు. మరోవైపు.. టీడీపీ కూడా ఒంటరిగా బరిలో దిగింది. ఈ పరిణామాలు టీఆర్ఎస్‌కు ఇబ్బందేననే విశ్లేషణలు వచ్చాయి. అయితే.. ఇప్పుడు అనూహ్యంగా బీజేపీని చావుదెబ్బకొట్టేలా.. వైసీపీ వ్యూహాత్మకంగా ఇక్కడ పోటీకి దూరంగా ఉంది. ఏపీకి చెందిన టీడీపీ నేరుగా పోటీ చేయడం, జనసేన పార్టీ బీజేపీకి మద్దతివ్వడం వంటివి జరుగుతుంటే.. వైసీపీ మాత్రం పోటీకి దూరంగా ఉంది. అయితే, ఇది రెండు విధాలా వైసీపీకి లాభం చేకూరుస్తుందని అంటున్నారు పరిశీలకులు.
బీజేపీకి దెబ్బ….
ఒకటి.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఇప్పుడు అందివచ్చే పార్టీలు, అందివచ్చే నాయకులు కావాలి. ఈ క్రమంలో వైసీపీ ఆయనకు ఇప్పుడు అందివచ్చిన అవకాశంగా మారింది. ఇక్కడ రెడ్డి సామాజికవర్గం పైగా ఏపీ నుంచి వచ్చిన సెటిలర్లలో ఎక్కువ మంది జగన్‌పై అభిమానం చూపించేవారు ఉన్నారు. ఈ క్రమంలో వారి ఓట్లు చీలకుండా ఉండేందుకు అవకాశం ఏర్పడింది. రెండోది.. బీజేపీకి ప్రధానంగా బుద్ది చెప్పాలని జగన్ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి లోక్‌సభ, రాజ్యసభల్లో ఎంతో సపోర్ట్ చేస్తున్నా బీజేపీ జగన్‌ను తెలివిగా వాడుకుంటూ ఏపీకి వీసమొత్తు సాయం చేయట్లేదు సరికదా ? ఏపీ ప్రభుత్వంపై అనేక రకాలుగా విషం చిమ్ముతోంది.
ఇక్కడే కట్టడి చేయాలని……
ఏపీలో తమ ప్రభుత్వాన్ని ఎలాంటి ఓటు బ్యాంకు లేని సమయంలోనే బీజేపీ ఇబ్బందులు పెడుతోందని ఆయన అనుకుంటున్నారు. ఈ క్రమంలో గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ గెలిచి బలపడితే.. అంతిమంగా అది తర్వాత లక్ష్యం ఏపీని చేసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ ఓటమిని వైసీపీ గట్టిగా కోరుకుంటోంది. సో.. ఇటు టీఆర్ఎస్‌కు చేరువ కావడంతోపాటు.. బీజేపీకి గట్టి దెబ్బకొట్టినట్టు కూడా ఉంటుందని భావించిన జగన్.. గ్రేటర్‌కు దూరంగా ఉన్నారని అంటున్నారు పరిశీలకులు. అయితే జగన్‌కు కేసీఆర్‌తోనూ చిన్నపాటి పొరాపొచ్చాలు ఉన్నా జగన్ బీజేపీనే పెద్ద శత్రువుగా భావిస్తోన్న పరిస్థితి కనిపిస్తోంది. మరి ఈ వ్యూహం ఏమేరకు ఫలిస్తుందో ? చూడాలి.