Ysrcp : అసమ్మతి ఎక్కడ….? అవి మామూలే?

అధికార పార్టీ అన్నాక పదవుల విషయంలో అసమ్మతి సహజంగానే చెలరేగుతుంది. జెండా పట్టుకున్న ప్రతి ఒక్కరూ పదవిని ఆశిస్తారు. అయితే ఉన్న పదవులకు, ఆశావహుల సంఖ్యకు మధ్య [more]

Update: 2021-09-25 05:00 GMT

అధికార పార్టీ అన్నాక పదవుల విషయంలో అసమ్మతి సహజంగానే చెలరేగుతుంది. జెండా పట్టుకున్న ప్రతి ఒక్కరూ పదవిని ఆశిస్తారు. అయితే ఉన్న పదవులకు, ఆశావహుల సంఖ్యకు మధ్య భారీ వ్యత్యాసం ఉంటుంది. అందువల్ల అందరికీ పదవులు ఇవ్వడం సాధ్యం కాని పని. కానీ ఇటీవల జరిగిన పరిషత్ ఎన్నికల్లో పదవుల పంపిణీలో వైసీపీలో అసంతృప్తులంటూ పెద్దయెత్తున ప్రచారం జరుగుతోంది. కానీ చూస్తే చాలా తక్కువ శాతంలో మాత్రమే అసంతృప్తులు బయటపడ్డారని చెప్పొచ్చు.

ఇంత పెద్ద సంఖ్యలో….

దాదాపు ఏడువేలకు పైగా ఎంపీటీసీలు, ఐదు వందలకు పైగా జడ్పీటీసీలు ఏపీలో ఉన్నాయి. ఇందులో 90 శాతం అధికార పార్టీ వైసీపీ గెలుచుకుంది. దీంతో సహజంగానే అందరూ పదవులు ఆశించారు. ఎన్నికలకు ముందు స్థానిక ఎమ్మెల్యేలు సయితం కొందరికి హామీలు ఇచ్చారు. తీరా ఫలితాలు వచ్చాక సామాజిక సమీకరణాల ఆధారంగా వారికి ఇవ్వలేకపోయారు. దీంతో కొన్ని చోట్ల అసంతృప్తుల చెలరేగిన మాట వాస్తవమే.

నష్టమేమీ లేదని….

కానీ మొత్తంగా చూసుకుంటే ఈ అసంతృప్తులు పార్టీకి తీవ్ర స్థాయిలో నష్టం కల్గించేవి కాదంటున్నారు వైసీపీ నేతలు. 90 శాతం స్థానాల్లో గెలిస్తే కేవలం ఒక శాతం చోట మాత్రమే ఈ అసంతృప్తులు బయటపడ్డాయి. శ్రీకాకుళం, గుంటూరు, కర్నూలు, అనంతపురం కదిరి లాంటి ప్రాంతాల్లోనే కొందరు ఎంపీటీసీలు అసంతృప్తులు వ్యక్తం చేశారు. దీనికి మీడియా ప్రచారం లభించడంతో వైసీపీలో ఏదో జరిగిపోతుందన్న ప్రచారం జరిగింది.

కేవలం ఒక శాతమే….

వాస్తవానికి ఎంపీపీ ఎన్నికలు నిన్న ప్రశాంతంగానే జరిగిపోయాయి. అన్ని ఎంపీపీ స్థానాల్లో ఎన్నికలు సజావుగానే జరిగాయి. కొన్ని చోట్ల కోరం లేక వాయిదా పడిన సంఘటనలే తప్పించి అధినాయకత్వం సూచించిన వారే ఎంపీపీ పదవులు చేపట్టారు. ఇంత పెద్దయెత్తున పదవుల పంపిణీ జరుగుతున్నప్పుడు అసమ్మతి, అసంతృప్తి సహజమేనని, త్వరలోనే అవి సర్దుకుంటాయని వైసీపీ నేతలు చెబుతున్నారు.

Tags:    

Similar News