ysrcp : ఇద్దరికీ చెక్…. కొత్త ఆలోచన దిశగా?

రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు ఎప్పుడు వస్తాయో తెలీదు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండాలని జగన్ ఇప్పటికే నేతలను ఆదేశించారు. అయితే వైసీపీలో నేతల మధ్య విభేదాలు [more]

Update: 2021-10-16 08:00 GMT

రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు ఎప్పుడు వస్తాయో తెలీదు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండాలని జగన్ ఇప్పటికే నేతలను ఆదేశించారు. అయితే వైసీపీలో నేతల మధ్య విభేదాలు తీవ్ర రూపం దాల్చాయి. ముఖ్యంగా ఎంపీ మార్గాని భరత్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజాలు బహిరంగ విమర్శలు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరిని జగన్ పిలిపించి క్లాస్ తీసుకున్న తర్వాత అంతా సద్దుమణుగుతుందని భావించారు. కానీ విభేదాలకు తెరపడలేదు.

ఎవరి వర్గాలు వారివే….

బహిరంగ ఆరోపణలు అయితే లేవు కాని లోలోపల ఎంపీ, ఎమ్మెల్యేల వర్గాలు విడివిడిగానే ఉంటున్నాయి. కలసి కార్యక్రమాలను నిర్వహించడం లేదు. దీంతోపాటు మరింత తమ వర్గాలకు ప్రయోజనం చేకూర్చేలా ఇద్దరూ పనిచేస్తుండటం రాజమండ్రిలో చర్చనీయాంశమైంది. రాజమండ్రి కార్పొరేషన్ పరిధిలో టీడీపీ బలంగా ఉంది. జనసేన ఓటు బ్యాంకు కూడా అధికంగానే ఉంది. ఈ సంగతి తెలిసి కూడా నేతలు తమ ప్రయోజనాలను మాత్రమే చూసుకుంటున్నారన్న విమర్శలున్నాయి.

బలంగా టీడీపీ, జనసేన….

గత అసెంబ్లీ ఎన్నికల్లోనే రాజమండ్రిలో రెండు స్థానాలను టీడీపీ గెలుచుకుంది. రాజమండ్రి అర్బన్ పరిధిలో జనసేన అభ్యర్థులకు కూడా ఓట్లు అధికంగానే వచ్చాయి. కార్పొరేషన్ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు ప్రభావం చూపే అవకాశముంది. దీంతో రాజమండ్రి పంచాయతీ తెగేది కాదని భావించిన వైసీపీ అధిష్టానం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అన్ని కార్పొరేషన్లను రాష్ట్రంలో వైసీపీ కైవసం చేసుకుంది.

సమన్వయ కమిటీని….

రాజమండ్రిని నేతల మధ్య విభేదాల కారణంగా కోల్పోతే పార్టీపై ప్రభావం పడుతుంది. మార్గాని భరత్, జక్కంపూడి రాజాలు కలిసే అవకాశం లేదని భావించిన వైసీపీ నాయకత్వం మధ్యేమార్గంగా రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలకు ఒక కమిటీ వేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. పేరుకు దీనిని సమన్వయ కమిటీ అని పెట్టి కార్పొరేషన్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి ప్రచారం వరకూ అంతా కమిటీలో నేతలే చూసుకుంటారు. కమిటీకి మంత్రిని ఒకరు ఛైర్మన్ గా నియమిస్తారన్న ప్రచారం జరుగుతుంది.

Tags:    

Similar News