జగన్ ప్రతిష్టతో పందెం కడుతున్నారా?

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. అనూహ్యంగా అకారణంగా వచ్చిన ఎన్నిక ఇది. గట్టిగా ఏడాదిన్నర కూడా కాకుండానే వైసీపీ సిట్టింగ్ ఎంపీ బల్లి [more]

Update: 2021-04-05 08:00 GMT

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. అనూహ్యంగా అకారణంగా వచ్చిన ఎన్నిక ఇది. గట్టిగా ఏడాదిన్నర కూడా కాకుండానే వైసీపీ సిట్టింగ్ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కరోనా కాటుకు బలి కావడంతో ఉప ఎన్నిక అనివార్యం అయింది. న్యాయంగా అయితే ఈ సీటు వైసీపీది, పైగా పోయిన వారు కూడా ఆయువు తీరి కాదు, ప్రారబ్దం బాగాలేకనే లోకాన్ని వీడారు. అటువంటి చోట కూడా రాజకీయ రచ్చకు ఢీ కొడుతున్నారు అంటే నిజంగా ఏపీ రాజకీయాలు ఇలాగే ఉంటాయా అనిపించకమానదు.

పట్టున్న సీటు ….

ఇక ఏపీలో వైసీపీకి కొన్ని సీట్లు గట్టిగా పట్టు గలిగినవి. కళ్ళు మూసుకుని గెలుపు మాదేనని చెప్పేసే సీట్లలో తిరుపతి కూడా ఒకటి. ఇక్కడ మూడు నియోజకవర్గాల్లో దళితుల ప్రాబల్యం ఉంది. వారంతా వైసీపీకి స్ట్రాంగ్ సపోర్టర్లు. ఇక ట్రాక్ రికార్డు చూసినా రెండు సార్లు ఇక్కడ వైసీపీ గెలిచింది. ఇపుడు చూస్తే స్థానిక ఎన్నికల్లోనూ గెలిచి చెక్కు చెదరని బలంతో ఉంది. అటువంటి వైసీపీని విపక్షాలు ఢీ కొట్టడం అంటే నిజంగా దుస్సాహసమే. కానీ ఏ మాత్రం బలం లేని బీజేపీ కూడా తొడకొడుతోంది. చిత్తూరులో లోకల్ బాడీస్ లో చిత్తు అయినా టీడీపీ కూడా సమరమే అంటోంది.

అలా చేసి ఉంటే ..?

ఇక తిరుపతి ఉప ఎన్నిక విషయంలో చంద్రబాబు సానుభూతి పేరిట సీటుని వదిలేసి ఉంటే బాగుండేది అన్న మాట కూడా ఉంది. అది ఒక మంచి సంప్రదాయంగా కూడా కొనసాగేది. కానీ ఆయన బస్తీమే సవాల్ అంటున్నారు. ఇప్పటికే జేసీ దివాకరరెడ్డి లాంటి వారు తిరుపతి వైసీపీదే అని జోస్యం చెప్పేశారు. పైగా పంచాయతీ ఎన్నికలను బాబు బాయ్ కాట్ చేసి ఉంటే పరువు మిగిలేది అని కూడా అన్నారు. మరి ఇపుడు తిరుపతి విషయంలో కూడా బాబు తెగించి బరిలోకి దూకుతున్నారు. ఫలితం ముందే తెలిసినా ఎందుకో ఎదురు వెళ్తున్నారు.

అదే సవాల్….

ఇపుడు చూసుకుంటే తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక అన్నది అటు వైసీపీకి కూడా ప్రతిష్టే. ఎందుకంటే గతసారి మొత్తం పోల్ అయిన 14 లక్షలలో 7 లక్షల పై చిలుకు ఓట్లు తెచ్చుకుని రెండు లక్షల పై చిలుకు మెజారిటీ తెచ్చిన వైసెపీ ఇపుడు అంతకు మించి ఓట్లు సాధించాలి. అపుడే వైసీపీ పరువు నిలబడుతుంది. మరో వైపు 2019 ఎన్నికల్లో అయిదు లక్షల దాకా ఓట్లు సాధించిన టీడీపీ అందులో ఏ ఒక్క దాన్నీ కూడా పొల్లుపోకుండా నిలబెట్టుకోవాలి. లేకపోతే టీడీపీ ఖేల్ ఖతం అవుతుంది. బాబు నిప్పుతో చెలగాటమాడుతున్నారు. జగన్ ప్రతిష్టతో పందెం కడుతున్నారు. చివరికి ఎవరి పరువు నిలుస్తుందో వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News