ఆపరేషన్… కార్పోరేషన్…?
విశాఖ కార్పోరేషన్ ఏపీలోనే అతి పెద్దది. దాదాపు వంద వార్డులు కలిగిన ఈ కార్పోరేషన్ మెగా సిటీకి గుండె కాయ లాంటిది. విశాఖ సిటీలో అభివృద్ధి కార్యక్రమాలు [more]
విశాఖ కార్పోరేషన్ ఏపీలోనే అతి పెద్దది. దాదాపు వంద వార్డులు కలిగిన ఈ కార్పోరేషన్ మెగా సిటీకి గుండె కాయ లాంటిది. విశాఖ సిటీలో అభివృద్ధి కార్యక్రమాలు [more]
విశాఖ కార్పోరేషన్ ఏపీలోనే అతి పెద్దది. దాదాపు వంద వార్డులు కలిగిన ఈ కార్పోరేషన్ మెగా సిటీకి గుండె కాయ లాంటిది. విశాఖ సిటీలో అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి అంటే కార్పోరేషన్ ఆమోద ముద్ర పడాల్సిందే. మూడు నెలల క్రితం జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో వైసీపీ విజయాన్ని సాధించి కార్పోరేషన్ మీద జెండా ఎగరేసింది. అంతే కాదు, విశాఖ పాలనను తన స్వాధీనంలోకి తెచ్చుకుంది. వైసీపీకి ఇది అవసరం. ఎందుకంటే విశాఖ పరిపాలనా రాజధానిగా త్వరలో మారబోతోంది. దాంతో జీవీఎంసీ లో పవర్ లో ఉండడం అన్నది కలసి వస్తున్న విషయం.
మోకాలడ్డుతున్నారుగా….?
ఇదిలా ఉంటే విశాఖ కార్పోరేషన్ లో వైసీపీ మొత్తం 98 వార్డులకు గానూ 80కి పైగా గెలుచుకోవాలని టార్గెట్ పెట్టుకుంది. టీడీపీని డజన్ సీట్లకు మాత్రమే పరిమితం చేయాలని కూడా ప్లాన్ వేసింది. కానీ అనూహ్యంగా ముందుకు వచ్చిన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం టీడీపీకి లాభించింది. దాంతో ముప్పయి వార్డులు దాకా టీడీపీ పరం అయ్యాయి. వైసీపీకి చూస్తే 58 వార్డులతో బొటాబొటీ మెజారిటీ దక్కింది. దాంతో ఇపుడు జీవీఎంసీలో బలమైన ప్రతిపక్షంగా టీడీపీ ప్రతీ దానికీ మోకాలడ్డే పరిస్థితి ఉంది.
లాగేయడమేనా…?
విశాఖలో ముడసర్లోవ ప్రాంతంలో ఖాళీ స్థలంలో అద్భుతమైన పార్కుని నిర్మించాలని వైసీపీ ప్రణాళికలు రచిస్తోంది. అయితే కౌన్సిల్ లో దీని మీద తీర్మానం చేయనీయకుండా టీడీపీ అడ్డుకుంది. పార్క్ నిర్మాణం వెనక వైసీపీ స్వార్ధం ఉందంటూ టీడీపీ దుమ్మెత్తిపోస్తోంది. ఈ నేపధ్యంలో తమ దూకుడు సాగాలంటే ఆపరేషన్ అపోజిషన్ కి రెడీ కావాల్సిందే అన్న ఆలోచనలో వైసీపీ ఉందని టాక్. ఇందులో భాగంగా ఇప్పటికే ఇండిపెండెంట్ల మీద వైసీపీ కన్నేసింది. తాజాగా ముగ్గురు ఇండిపెండెంట్ కార్పోరేటర్లు విల్లూరి భాస్కరరావు, కందుల నాగరాజు, సాధిక్ విజయసాయిరెడ్డి సమక్షంలో వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. దీంతో వైసీపీ బలం 61కి చేరుకుంది.
నిలువునా చీల్చుడే…?
ఇక టీడీపీ మీదనే వైసీపీ చూపు ఉందని అంటున్నారు. ఇప్పటికే పారిశ్రామిక ప్రాంతంలోని కొందరు కార్పోరేటర్లు వైసీపీ అధినాయకులకు టచ్ లోకి వచ్చారని అంటున్నారు. వారితో పాటు విశాఖ సిటీలో ఉన్న మరికొందరిని కలుపుకు వైసీపీ కండువా కప్పేయడానికి స్కెచ్ గీస్తున్నారు అంటున్నారు. అంటే 30 మంది టీడీపీ కార్పోరేటర్లలో కనీసంగా 15 మంది దాకా ఫ్యాన్ నీడకు చేరిపోయేలా అధికార పార్టీ భారీ ప్లాన్ రెడీ చేసి పెట్టిందని అంటున్నారు. విశాఖకు రాజధాని షిఫ్ట్ అయ్యేలోగా ఈ ఆపరేషన్ పూర్తి అవుతుంది అంటున్నారు. మొత్తానికి విశాఖ రాజధాని అయ్యేవేళకు తమ్ముళ్ల గొంతు ఎక్కడా వినిపించకూడదన్న పట్టుదల అయితే వైసీపీలో కనిపిస్తోంది. మరి ఇది ఎంతమేరకు వర్కౌట్ అవుతుందో చూడాల్సిందే.