అటు కోలాహలం.. ఇటు హాలాహలం… ?

కడుపు నిండిన వాడు ఒక వైపు ఉంటే కడుపు ఎండిన వారు మరో వైపు. ఇపుడు విశాఖ రాజకీయాల్లో ఇదే సీన్ కనిపిస్తోంది. ఈ ఆకలి రాజకీయ [more]

Update: 2021-09-04 13:30 GMT

కడుపు నిండిన వాడు ఒక వైపు ఉంటే కడుపు ఎండిన వారు మరో వైపు. ఇపుడు విశాఖ రాజకీయాల్లో ఇదే సీన్ కనిపిస్తోంది. ఈ ఆకలి రాజకీయ నేతల పదవులది. రెండేళ్ల తరువాత అయినా జగన్ తన వారిని పిలిచి మృష్టాన్న భోజనం పెట్టారు. దాంతో వారు ప్రతీ రోజూ పండుగ చేసుకుంటున్నారు. మరో వైపు చూస్తే టీడీపీ జెండాను పట్టుకుని మోస్తున్న క్యాడర్ ది రెండు దశాబ్దాలుగా తీరని ఆకలిగా ఉంది. ఎపుడైతే 2004లో పార్టీ ఓడిందో నాటి నుంచి వారికి పదవులు దక్కితే ఒట్టు. మధ్యలో 2014 నుంచి 2019 దాకా అధికారంలో టీడీపీ ఉన్నా ఒరిగింది ఏమీ లేదు. దాంతో తమ్ముళ్ళు తెగ కుములుతున్నారు.

మంచి రోజులే….

శ్రావణ మాసం, మంచి ముహూర్తం అనుకుంటూ నామినేటెడ్ పదవులు దక్కిన వారంతా రోజుకు ఒకరుగా విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తూ రాజకీయ కోలాహలాన్నే సృష్టించారు. వారి ప్రమాణ స్వీకారానికి మంత్రులు ఎమ్మెల్యేలు, ఇతర కీలక నేతలు హాజరై హడావుడి చేస్తున్నారు. దాంతో ఎటు చూసిన ఆ సందడితో అంతా ఉత్సాభరితంగా ఉంది. ఇలా పదవులు వచ్చిన వారి విలాసాన్ని చూడలేక టీడీపీ నేతు తమలో తామే కుళ్ళుకుంటున్నారు. అయినా ఏం చేయని పరిస్థితి వారిది. నామినేటెడ్ పదవుల జాతరతో అధినాయకత్వం పందేరం చేస్తే రోజుల తరబడి ప్రమాణాలు చేస్తూ వైసీపీ నేతలు పార్టీ యాక్టివిటీని ఒక్కసారిగా పెంచేశారు.

లోటు తీరినట్లే …?

ఈ ఏడాదిలోనే లోకల్ బాడీ ఎన్నికలు జరిగాయి. దాంతో అక్కడ పదవులు వైసీపీ వారికి దండీగా దక్కాయి. ఇపుడు నామినేటెడ్ తో మిగిలిన వారి కరవు కూడా తీరిపోయింది. దీంతో వైసీపీ శిబిరంలో ఏ వంక చూసిన అధికార దర్పం కనిపిస్తోంది. నాయకుల ముఖాలలో రాజసం తొణికిసలాడుతోంది. ఒక విధంగా హై కమాండ్ మంచి పనే చేసింది అంటున్నారు. ఈ ఏడాది మొదటి వరకూ దాదాపుగా నిద్రావస్థలో వైసీపీ ఉంది. వారిని తట్టి లేపాయి ఈ పదవులు. జగన్ సీఎం అయితే తమకేంటి అనుకున్న వారదందికీ తలా ఓ కుర్చీ దక్కింది.

జోష కంటిన్యూ అయితే…?

మరో రెండున్నరేళ్ళలో ఎన్నికలు ఉన్నాయి. అప్పటిదాకా ఈ నామినేటెడ్ పదవులకు కూడా గడువు ఉంది. దాంతో వైసీపీలో జోష్ కంటిన్యూ అయితే రాజకీయంగా మేలు జరుగుతుందని అంటున్నారు. ఇక టీడీపీ విపక్షంలో ఉండడం వల్ల హామీలే తప్ప మరేమీ ఇవ్వలేని పరిస్థితి. ఒకవేళ వారికి పదవులు దక్కాలన్నా కూడా వచ్చే ఎన్నికల్లో పార్టీ పవర్ లోకి రావాలి. అది రావాలి అంటే క్యాడరే సత్తువ సమకూర్చుకుని రంగంలోకి దిగాలి. ఒక విధంగా టీడీపీ కొంత డీ మోరలైజ్ అయి ఉంది. అక్కడే వైసీపీ తెగ హుషార్ చేస్తోంది. ఇదే సీన్ కనుక కొనసాగితే మాత్రం మళ్లీ సైకిల్ కి ఇబ్బందులు తప్పవని అంటున్నారు. ఏది ఏమైనా 2019 సార్వత్రిక ఎన్నికల తరువాత విశాఖలో మళ్ళీ అధికార పార్టీ రాజకీయ కోలాహలం స్పష్టంగా కనిపిస్తోంది.

Tags:    

Similar News