అక్కడ వైసీపీలో సీన్ మారుతోంది… తేడా కొట్టేస్తోంది

ఒక‌ప్పుడు టీడీపీకి కంచుకోట‌గా ఉన్న ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ ఫుల్ స్వింగ్ చూపించింది. టీడీపీని కేవ‌లం పాల‌కొల్లు, ఉండికి మాత్రమే ప‌రిమితం చేసి [more]

Update: 2021-09-09 13:30 GMT

ఒక‌ప్పుడు టీడీపీకి కంచుకోట‌గా ఉన్న ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ ఫుల్ స్వింగ్ చూపించింది. టీడీపీని కేవ‌లం పాల‌కొల్లు, ఉండికి మాత్రమే ప‌రిమితం చేసి 13 అసెంబ్లీ సీట్లలోనూ పాగా వేసింది. వైసీపీ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తయ్యాయి. క‌ట్ చేస్తే గ‌త టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జిల్లాలో గ్రూపు రాజ‌కీయాలు రాజ్యమేలి ఎలా అయితే టీడీపీని ముంచేశాయో ఇప్పుడు వైసీపీలోనూ అదే త‌ర‌హా గ్రూపు రాజ‌కీయాలు ప‌తాక స్థాయిలో రాజ్యమేలుతున్నాయి.

ఎమ్మెల్యేలకు…ఎంపీలకు….

ఏలూరు ఎంపీ కోట‌గిరి శ్రీధ‌ర్‌కు డిప్యూటీ సీఎం ఆళ్ల నానికి మ‌ధ్య తీవ్ర స్థాయిలో ప్రచ్ఛన్న యుద్ధం న‌డుస్తోంది. నానికి చెప్పకుండా ఎంపీ శ్రీధ‌ర్ ఏలూరులో ప‌ర్యటించే ప‌రిస్థితి లేదు. ఇక శ్రీధ‌ర్ సొంత నియోజ‌క‌వ‌ర్గం చింత‌ల‌పూడిలో వైసీపీ ఎమ్మెల్యే ఎలీజాకు, శ్రీధ‌ర్‌కు మ‌ధ్య ప‌చ్చగ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటోంది. ఎవ‌రికి వారు పోటాపోటీగా కార్యాల‌యాలు ప్రారంభిస్తున్నారు. చింత‌ల‌పూడిలో ఎమ్మెల్యే ఎలీజాకు నియోజ‌క‌వ‌ర్గ రాజ‌కీయాల్లో కీల‌కంగా ఉన్న కేవీపీ రామ‌చంద్రరావు బావ‌మ‌రిది అశోక్‌కూ స‌ఖ్యత లేదు.

వర్గాలుగా విడిపోయి….

దెందులూరులో చింతమనేని ప్రభాక‌ర్‌కు వ్యతిరేకంగా గ‌త ఎన్నిక‌ల్లో అబ్బయ్య చౌద‌రిని గెలిపించిన ఓ వ‌ర్గం నేత‌లు ఇప్పుడు ఆయ‌న‌కు దూర‌మై తిరిగి ప్రభాక‌ర్‌కు ద‌గ్గర‌వుతున్నారు. ఉంగుటూరులో వైసీపీ ఎమ్మెల్యే వాసుబాబుతో ఓ వ‌ర్గం అంటీ ముట్టన‌ట్టు ఉంది. త‌ణుకు, నిడ‌ద‌వోలు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎమ్మెల్యేల‌కు వ్యతిరేకంగా ఓ ప్రధాన సామాజిక వ‌ర్గం టైం వ‌చ్చిన‌ప్పుడు క‌సి తీర్చుకుందామ‌న్నంత కోపంతో ఉంది. ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల ఎమ్మెల్యేల‌పై తీవ్ర వ్యతిరేక‌త క‌నిపిస్తోంది.

ఇన్ ఛార్జితో….

పాల‌కొల్లులో నియోజ‌క‌వ‌ర్గ వైసీపీ ఇన్‌చార్జ్ క‌వురు శ్రీనివాస్‌, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, య‌డ్ల తాతాజీ మ‌ధ్య మూడు ముక్కలాట న‌డుస్తోంది. మంత్రి రంగ‌నాథ‌రాజు ప్రాతినిధ్యం వ‌హిస్తోన్న ఆచంట‌లో పార్టీ కులాల వారీగా చీలిపోయింది. కొన్ని సామాజిక వ‌ర్గాల ఆధిప‌త్యంతో మిగిలిన వ‌ర్గాలు పార్టీకి దూర‌మ‌వుతున్నాయి. తాడేప‌ల్లిగూడెంలో ఎమ్మెల్యే కొట్టు స‌త్యనారాయ‌ణ అంద‌రిని వ‌దిలేసి త‌న ప‌ని తాను చ‌క్క పెట్టుకుంటున్నారు.

గ్రూపుల గోలతో…

కొవ్వూరులో గ‌తంలో మంత్రి జ‌వ‌హ‌ర్ ఎదుర్కొన్న ప‌రిస్థితే ఇప్పుడు మంత్రి తానేటి వ‌నిత ఎదుర్కొంటున్నారు. ఇక్కడ సేమ్ టు సేమ్ ప‌రిస్థితి మార‌లేదు. గ‌త ఎన్నిక‌ల్లో క‌మ్మల‌కు ప‌ట్టున్న గోపాల‌పురంలో 37 వేల‌తో గెలిచిన త‌లారి వెంక‌ట్రావుకు నాలుగు మండ‌లాల్లోనూ ప్రధాన సామాజిక వ‌ర్గాల నేత‌లు ప‌ళ్లు ప‌ట‌ప‌టా నూరుతున్నారు. ఏదేమైనా భీమ‌వ‌రం, న‌ర‌సాపురం లాంటి ఒక‌టి రెండు నియోజ‌క‌వ‌ర్గాలు మిన‌హా అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ అధికార పార్టీ వైసీపీలో గ్రూపుల గోల టీడీపీని మించి పోయింది. ఈ ప‌రిస్థితి మార‌క‌పోతే టీడీపీకి ప‌ట్టిన గ‌తే వైసీపీకి కూడా ప‌ట్టేలా ఉంది.

Tags:    

Similar News