ఈసారి కూడా ఆ సీటు వైసీపీదేనా..?

కర్నూలు జిల్లాలో ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గమైనా అందరి ఆసక్తి నందికొట్కూరు నియోజకవర్గంపై ఉంది. నియోజకవర్గంలో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి ఇక్కడ పట్టున్న రెడ్డి సామాజకవర్గ నేతలు [more]

Update: 2019-05-05 08:00 GMT

కర్నూలు జిల్లాలో ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గమైనా అందరి ఆసక్తి నందికొట్కూరు నియోజకవర్గంపై ఉంది. నియోజకవర్గంలో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి ఇక్కడ పట్టున్న రెడ్డి సామాజకవర్గ నేతలు ప్రయత్నించడంతో ఇక్కడ హోరాహోరీ పోరు జరిగింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి ఇక్కడ మాండ్ర శివానందరెడ్డి, గౌరు కుటుంబం పూర్తి స్థాయిలో పనిచేయగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం యువ నాయకత్వాన్ని నమ్ముకుంది. నియోజకవర్గ ఇంఛార్జిగా ఉన్న యువ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి తానే అభ్యర్థి అన్నంతలా పనిచేసి వైసీపీ అభ్యర్థి తోగురు ఆర్థర్ ను గెలిపించేందుకు కష్టపడ్డారు. దీంతో అభ్యర్థుల కంటే ఎక్కువగా ఇక్కడ ఇంఛార్జిల మధ్యే పోరుగా నడిచింది.

రాజకీయమంతా రెడ్డి నేతల మధ్యే…

నందికొట్కూరు నియోజకవర్గం 2009లో రిజర్వుడ్ స్థానంగా మారింది. అంతకముందు ఇక్కడ బైరెడ్డి శేషశయనారెడ్డి మూడుసార్లు గెలిచి మంత్రిగా పనిచేశారు. ఆయన కుమారుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి రెండుసార్లు గెలిచారు. దీంతో బైరెడ్డి కుటుంబానికి ఇక్కడ గట్టి పట్టుంది. తర్వాత గౌరు కుటుంబం కాంగ్రెస్ నుంచి ఇక్కడ పట్టు సాధించింది. 2004లో గౌరు చరిత కాంగ్రెస్ నుంచి విజయం సాధంచారు. దీంతో బైరెడ్డి, గౌరు కుటుంబాల మధ్య రాజకీయ, ఫ్యాక్షన్ పోరు నడిచింది. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఐజయ్య 21,814 ఓట్ల భారీ మెజారిటీతో టీడీపీ అభ్యర్థి లబ్బి వెంకటస్వామిపై విజయం సాధించారు. అయినా కూడా ఇక్కడ ఇంఛార్జిగా గౌరు వెంకట్ రెడ్డి వైసీపీ వ్యవహారాలు చూసుకునే వారు. టీడీపీ ఇంఛార్జిగా మాండ్ర శివానందరెడ్డి ఉండి ఆయన టీడీపీ వ్యవహారాలు చూసుకునే వారు.

ఇద్దరూ కొత్త అభ్యర్థులే…

ఏడాది క్రితం బైరెడ్డి కుటుంబం నుంచి మూడోతరంగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి రాజకీయ ప్రవేశం చేశారు. ఆయనను వైసీపీ ఇక్కడ ఇంఛార్జిగా నియమించి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించింది. తక్కువ కాలంలోనే సిద్ధార్థ్ రెడ్డి నియోజకవర్గంలో బలమైన నేతగా ఎదిగారు. అప్పటివరకు వైసీపీకి ఇక్కడ పెద్దదిక్కుగా ఉన్న గౌరు దంపతులు ఎన్నికల ముందు టీడీపీలో చేరడంతో వైసీపీకి మైనస్ అవ్వడంతో పాటు టీడీపీ బాగా బలం పుంజుకుంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు ఈసారి టీడీపీ, వైసీపీ టిక్కెట్లు ఇవ్వలేదు. వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఐజయ్యను పక్కనపెట్టి కొత్త అభ్యర్థి ఆర్థర్ కు టిక్కెట్ ఇచ్చారు. టీడీపీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన వెంకటస్వామికి కాకుండా బండి జయరాజ్ కు టిక్కెట్ ఇచ్చారు. దీంతో ఐజయ్య వైసీపీ నుంచి టీడీపీలో చేరగా, వెంకటస్వామి టీడీపీ నుంచి వైసీపీలో చేరడం గమనార్హం. నంద్యాల పార్లమెంటు పరిధిలో వైసీపీ బలంగా ఉంది. పోలింగ్ సరళి కూడా వైసీపీకి అనుకూలంగా జరిగిందని అంచనాలు ఉన్నాయి. అయితే, గౌరు కుటుంబానికి ఇక్కడ రెండు మండలాల్లో పట్టుండటం టీడీపీకి కలిసొచ్చింది. మొత్తంగా వైసీపీకి ఇక్కడ విజయావకాశాలు కనిపిస్తున్నా మెజారిటీ మాత్రం బాగా దక్కే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి.

Tags:    

Similar News