ఆ లోక్ సభ సీటు వైసీపీ ఖాతాలోకేనా..?
ఈ ఎన్నికల్లో అసెంబ్లీతో పాటు పార్లమెంటు స్థానాలనూ తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో పాటు ఎక్కువ పార్లమెంటు స్థానాలను దక్కించుకొని [more]
ఈ ఎన్నికల్లో అసెంబ్లీతో పాటు పార్లమెంటు స్థానాలనూ తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో పాటు ఎక్కువ పార్లమెంటు స్థానాలను దక్కించుకొని [more]
ఈ ఎన్నికల్లో అసెంబ్లీతో పాటు పార్లమెంటు స్థానాలనూ తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో పాటు ఎక్కువ పార్లమెంటు స్థానాలను దక్కించుకొని కేంద్ర ప్రభుత్వంలోనూ కీలకం కావాలని రెండు పార్టీలూ ప్రయత్నించాయి. అన్ని లోక్ సభ స్థానాల్లో బలమైన అభ్యర్థులను నిలబెట్టాయి. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వంత జిల్లా కడపలో ఈసారి ఫ్యాను స్పీడుకి బ్రేకులు వేయాలని తహతహలాడిన తెలుగుదేశం పార్టీ జిల్లాలో కనీసం నాలుగు అసెంబ్లీ స్థానాలు గెలుచుకోవడంతో పాటు ఒక పార్లమెంటు స్థానాన్ని కైవసం చేసుకోవాలని స్కెచ్ వేసింది. జిల్లాలోని కడప, రాజంపేట ఎంపీ స్థానాల్లో ఒక స్థానాన్నైనా దక్కించుకోవాలని టీడీపీ ప్లాన్ చేసింది. కడపలో మంత్రి ఆదినారాయణరెడ్డిని పోటీకి పెట్టినా ఆ పార్టీ రాజంపేట నుంచి ఎమ్మెల్యే డీకే సత్యప్రభను పోటీకి నిలిపింది. అయితే, కడప కష్టమైనా రాజంపేట సీటు అయినా దక్కించుకుంటామని టీడీపీ ధీమాగా ఉంది. ఇక, తమ సిట్టింగ్ స్థానాలు రెండింటినీ తిరిగి కైవసం చేసుకుంటామనేది వైసీపీ నేతల ధీమా.
కొత్త ప్రత్యర్థితో తలపడుతున్న మిథున్
కడప, చిత్తూరు జిల్లాల్లో ఉండే రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం ముందునుంచీ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కేవలం రెండు సార్లు మాత్రమే ఆ పార్టీ విజయం సాధించారు. ఆరుసార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి సాయిప్రతాప్ గెలిచారు. అయితే, వైఎస్ఆర్ మరణం, రాష్ట్ర విభజన ఎఫెక్ట్ తో ఇక్కడ కాంగ్రెస్ క్యాడర్ మొత్తం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి నడిచింది. దీంతో గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి విజయం సాధించారు. టీడీపీతో పొత్తులో భాగంగా బీజేపీ నుంచి పోటీ చేసిన దగ్గుబాటి పురందేశ్వరిపై 1,74,762 ఓట్లు భారీ మెజారిటీతో ఆయన విజయం సాధించారు. ఇప్పుడు ఆయన మరోసారి బరిలో ఉన్నారు. ఇక, తెలుగుదేశం పార్టీ నుంచి డీకే సత్యప్రభ పోటీ చేశారు. రాజంపేట లోక్ సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండటం మిథున్ రెడ్డికి కలిసివచ్చే అవకాశం ఉంది.
మెజారిటీ తగ్గినా గెలుపు పక్కా…
రాజంపేట పార్లమెంటు పరిధిలో ఉన్న కడప జిల్లాలోని రాజంపేట, రైల్వే కోడూరు, రాయచోటి నియోజకవర్గాల్లో వైసీపీ బలంగా ఉంది. ఈ మూడు నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో రాజంపేటలో టీడీపీ గెలిచినా ఈసారి వైసీపీకి అక్కడ మొగ్గు కనిపిస్తోంది. ఇక, చిత్తూరు జిల్లాలోని పుంగనూరు, పీలేరు, మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాలు రాజంపేట లోక్ సభ పరిధిలో ఉన్నాయి. వీటిల్లో పుంగనూరు నుంచి మిథున్ రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డి బరిలో ఉన్నారు. ఇక్కడ మిథున్ కు ఎక్కువ మెజారిటీ వచ్చే అవకాశం ఉంది. మిగతా మూడు నియోజకవర్గాల్లో హోరాహోరీ పోరు ఉంది. మొత్తంగా రాజంపేట, రాయచోటి, రైల్వేకోడూరు, పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీకి మెజారిటీ వస్తే మిగతా మూడు నియోజకవర్గాల్లో హోరాహోరీ పోరు జరిగినా వైసీపీకి విజయావకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కాబట్టి మిథున్ కు భారీ మెజారిటీ వచ్చింది. ఈసారి మాత్రం ఆయన మెజారిటీ లక్ష ఓట్లు దాటే అవకాశం లేదనే అంచనాలు ఉన్నాయి.