ఇక్కడ మూడు.. అక్కడ రెండుట

అదేంటో రాజకీయాల్లో నాయకులకు ఆశలు పెరిగిపోతున్నాయి. జనాల్లోనూ కొత్త కోరికలు పుట్టుకువస్తున్నాయి. ఒకపుడు ఎవరికీ ఏమీ అక్కరలేదు. తమ వీధి కౌన్సిలర్ కూడా తెలియనంత అమాయకత్వంతో నాలుగు [more]

Update: 2020-02-11 12:30 GMT

అదేంటో రాజకీయాల్లో నాయకులకు ఆశలు పెరిగిపోతున్నాయి. జనాల్లోనూ కొత్త కోరికలు పుట్టుకువస్తున్నాయి. ఒకపుడు ఎవరికీ ఏమీ అక్కరలేదు. తమ వీధి కౌన్సిలర్ కూడా తెలియనంత అమాయకత్వంతో నాలుగు దశాబ్దాల క్రితం రాజకీయం నడిచింది. ఇపుడు సోషల్ మీడియా పుణ్యమా అని చీమ చిటుక్కుమంటే ఇట్టే తెలిసిపోతోంది. తమకు అన్యాయం చేసారని ఎక్కడికక్కడ ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం గొంతు సవరిస్తున్నాయి. దీంతో అందరి కోసం పనిచేయడం అన్నది పాలకులకు కష్టమైపోతోంది. రాజకీయ నాయకులు కూడా బాధ్యతగా సర్దిచెప్పాల్సిపోయి తమ ప్రయోజనాల కోసం జనాలకు ఎగదోస్తున్నారు. ఇక ఏపీ విషయానికి వస్తే మూడు రాజధానుల ముచ్చట ఇపుడు జోరుగా సాగుతోంది. దీనికి తోడు అన్నట్లుగా దేశానికి రెండు రాజధానులు కావాలట.

కుదిరే పనేనా?

ఒక దేశం, ఒక ఎన్నిక, ఒకటే పార్టీగా ఉండాలన్నది బీజేపీ ఆలోచన. అటువంటి బీజేపీ ఇపుడు రెండవ రాజధాని ఇస్తుందా? ఎప్పటినుంచో రెండవ రాజధాని డిమాండ్ ఉంది. అయితే అది రాజకీయ నాయకుల స్థాయిలోనే ఉంది. అప్పట్లో తెలంగాణాను అడ్డుకుందామని కొందరు హైదరాబాద్ ని రెండవ రాజధాని చేయమని కోరారు. నాడు కేంద్రం అవేమీ పట్టించుకోలేదు. ఇక ఇపుడు అమరావతిని దేశానికి రెండవ రాజధాని చేయమంటున్నారు. ఈ మాటను అటు టీడీపీ తమ్ముళ్ళు మొదట అంటే ఇపుడు బీజేపీ నేతలు అందుకున్నారు.

ఎన్ని డిమాండ్లో…?

ఇక కధ రెండుతో మొదలుపెడితే ఆగేనా అన్నది కూడా చర్చించాలి. జగన్ మూడు రాజధానుల తలనొప్పి ఇప్పటికీ బొప్పి కట్టేలా ఉంది. ఇది ఒక కొలిక్కి ఇంకా రాలేదు. అదే సమయంలో దేశానికి అమరావతిని రెండవ రాజధానిగా చేయమని అంటున్నారు. అలా చేస్తారంటూ మొదట టీడీపీ అనుకూల మీడియాలో వార్తలు వచ్చాయి. దాన్ని తమ్ముళ్ళు పట్టుకున్నారు. ఇపుడు బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ పాట పాడుతున్నారు. ఆయన మూడు రాజధానులను సమర్దిస్తూనే అమరావతిని దేశానికి రెండవ రాజధాని చేయాలని అంటున్నారు.

జగన్ లేఖ….

ఈ మహత్తర కార్యాన్ని జగన్ మీదనే టీజీ పెట్టారు. దేశానికి రెండవ రాజధానిగా అమరావతిని గుర్తించాలని, ఆ దిశగా చర్యలు చేపట్టాలని జగన్ కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలట. అయితే అమరావతి స్కాముల నిలయమని, అది ఎప్పటికీ అభివృధ్ధి చెందదని జగన్ గట్టిగా భావిస్తూ మూడు రాజధానులను తెర పైకి తీసుకువచ్చారు. అటువంటి జగన్ అమరావతి స్థాయిని వేయింతలు పెంచేలా దేశానికే రాజధాని చేయమంటారా. అదసలు జరిగే పనేనా. ఇక కొత్తగా సరైన రాజధాని లేని ఏపీ నుంచే ఈ రకమైన ప్రతిపాదన వస్తే మిగిలిన నగరాలు ఊరుకుంటాయా. అసలు ఈ కొత్త చిచ్చుకు, రచ్చకు బీజేపీ అవకాశం ఇస్తుందా. తాను చెడ్డ కోతి వనమల్లా చెరచిందని, ఏపీ ఇపుడు మూడు రాజధానుల కుంపట్లో మండుతోంది. మళ్ళీ బీజేపీకి ఎందుకు ఈ సెగలూ పొగలు అన్నది మేధావుల భావన.

Tags:    

Similar News