సిట్టింగ్ సీటు.. ఈసారి వైసీపీకి డౌటు

గత ఎన్నికల్లో రాయలసీమలోని మూడు జిల్లాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మొగ్గు ఉండగా అనంతపురం జిల్లాలో మాత్రం తెలుగుదేశం పార్టీ హవా వీచింది. ఇక్కడ కేవలం రెండు [more]

Update: 2019-04-29 02:00 GMT

గత ఎన్నికల్లో రాయలసీమలోని మూడు జిల్లాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మొగ్గు ఉండగా అనంతపురం జిల్లాలో మాత్రం తెలుగుదేశం పార్టీ హవా వీచింది. ఇక్కడ కేవలం రెండు స్థానాలు మినహా మిగతా స్థానాలను తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది. అయితే, ఊహించని విధంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ మాత్రం ఉరవకొండ నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. ఆయనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విశ్వేశ్వర్ రెడ్డి 2,275 ఓట్ల స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. పయ్యావుల కేశవ్ ఉరవకొండ నుంచి ఐదుసార్లు పోటీ చేసి మూడుసార్లు విజయం సాధించారు. గత ఎన్నికల్లో కూడా ఆయన గెలిచి ఉంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినందున మంత్రి అయ్యేవారనే అంచనాలు కూడా ఉన్నాయి. దీంతో ఈసారైనా ఇక్కడ విజయం సాధించాలని పయ్యావుల పట్టుదలగా పనిచేశారు. ఇక, మరోసారి గెలిచి తన ప్రభావాన్ని నిలబెట్టుకోవాలని వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వర్ రెడ్డి ప్రయత్నించారు.

అభివృద్ది ఘనత కేశవ్ కే…

ఉరవకొండ నియోజకవర్గంలో రెండుసార్లు పయ్యావుల కేశవ్ పై ఓడిన విశ్వేశ్వరరెడ్డి గత ఎన్నికల్లో విజయం సాధించారు. అయితే, వైసీపీ ప్రతిపక్షానికే పరిమితం కావడంతో ఎమ్మెల్యేగా ఉన్నా నియోజకవర్గంలో ఆయన ప్రభావం చూపలేకపోయారు. ఎమ్మెల్యేగా ఓడిపోయినా పయ్యావుల కేశవ్ నియోజకవర్గంలో చక్రం తిప్పారు. కేశవ్ కు పార్టీ ఎమ్మెల్సీగా అవకాశం కూడా ఇవ్వడంతో ఆయనే నియోజకవర్గంలో అనధికార ఎమ్మెల్యేగా వ్యవహరించారు. నియోజకవర్గ అభివృద్ధి ఘనత కూడా కేశవ్ తన ఖాతాలోనే వేసుకున్నారు. ఇక, వ్యవసాయాధారిత ప్రాంతమైన ఉరవకొండకు హంద్రినీవా ద్వారా లక్షన్నర ఎకరాలకు నీరు తీసుకువచ్చిన ఘనత తనదేనని కేశవ్ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. ఇది ఆయన కలిసొచ్చినట్లు కనిపిస్తుంది. నియోజకవర్గంలో బలమైన నేతగా ఉన్న ఆయన ఈసారి విజయం సాధించేందుకు తన శక్తియుక్తులన్నీ ప్రయోగించారు.

విశ్వేశ్వర్ రెడ్డికి మంచి పేరున్నా…

కమ్యూనిస్టు నేపథ్యం నుంచి వచ్చిన విశ్వేశ్వర్ రెడ్డి తండ్రి కూడా కమ్యూనిస్టు నేత. విశ్వేశ్వర్ రెడ్డి సామన్యుడిగా ఉంటారని, అందరికీ అందుబాటులో ఉంటారనే పేరుంది. ఎటువంటి ఆరోపణలు కూడా లేవు. అయితే, కేశవ్ ను ఎదుర్కోవడంలో ఆయన ఆర్థికంగా వెనుకబడిపోయారు. మొదట విశ్వేశ్వర్ రెడ్డికి చాలా రోజుల పాటు స్వంత పార్టీ నుంచే పలువురు నేతలు సహకరించకపోవడం మైనస్ గా మారింది. నియోజకవర్గంలో రెండు ప్రధాన సామాజకవర్గాలు ఇద్దరు అభ్యర్థులకు మద్దతుగా నిలిచారు. మైనారిటీలు ఎక్కువగా వైసీపీ వైపు నిలిచారనే అంచనాలు ఉన్నాయి. అయితే, నియోజకవర్గంలో గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్న బీసీలు మాత్రం తమకు అండగా ఉన్నారని తెలుగుదేశం పార్టీ ధీమాగా ఉంది. గత ఎన్నికల్లో ఓడిన సానుభూతి ఉండటం, అభివృద్ధి చేయడం కలిసొచ్చిందని కేశవ్ భావిస్తున్నారు. మొత్తానికి నియోజకవర్గంలో విశ్వేశ్వర్ రెడ్డి కంటే కేశవ్ కు ఈసారి కొంత మొగ్గు కనిపిస్తోంది.

Tags:    

Similar News