ప్రసన్నకు లైన్ క్లియర్ అయిందా..?

ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ నెల్లూరు జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో ఆధిక్యత చూపినా కోవూరులో మాత్రం ఆ [more]

Update: 2019-03-18 01:30 GMT

ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ నెల్లూరు జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో ఆధిక్యత చూపినా కోవూరులో మాత్రం ఆ పార్టీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఓటమిపాలయ్యారు. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరి టిక్కెట్ తెచ్చుకున్న పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఎనిమిది వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈసారి వైసీపీ నుంచి మళ్లీ నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి బరిలో ఉండనుండగా తెలుగుదేశం పార్టీ కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే పోలంరెడ్డికే టిక్కెట్ ఖాయం చేసింది. దీంతో మళ్లీ పాత ప్రత్యర్థులే తలపడనున్నారు. ఇద్దరూ బలమైన నేతలుగా ఉండటంతో కోవూరు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.

మళ్లీ పాత ప్రత్యర్థులే…

నెల్లూరు జిల్లాలో తిరుగులేని నేతగా ఎదిగిన నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి రాజకీయ వారసునిడి తెలుగుదేశం పార్టీతో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు ప్రసన్నకుమార్ రెడ్డి. కోవూరులో ఉపఎన్నికలతో కలిపి ఏడుసార్లు పోటీ చేసి ఐదు సార్లు విజయం సాధించారు. ఎన్టీఆర్ మంత్రివర్గంలో కొంతకాలం మంత్రిగా కూడా పనిచేశారు. 2012లో టీడీపీని వీడి వైసీపీలో చేరిన ఆయన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీ విజయం సాధించారు. కానీ రెండేళ్లకే వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. దీంతో ఈసారి కచ్చితంగా విజయం సాధించాలని ఆయన పట్టుదలతో ఉన్నారు. తండ్రికి ఉన్న పేరు, ఐదుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసి నియోయోజకవర్గంలో తనదైన ముద్ర వేయడం, ప్రజల్లో ఉంటారనే పేరుండటం ఆయన ప్లస్ పాయింట్స్ కానున్నాయి. ఇక, నెల్లూరు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండటంతో తన విజయం ఖాయమని ఆయన ధీమాగా ఉన్నారు.

ఇద్దరికీ అంత ఈజీ కాదు…!

తెలుగుదేశం పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పోలంరెడ్డికి టిక్కెట్ ఖారారు చేశారు. చంద్రబాబు ఇక్కడ అనేక ఏళ్లుగా టీడీపీలోనే ఉంటూ ఈసారి టిక్కెట్ ఆశించిన పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డికి భంగపాటు ఎదురయ్యింది. దీంతో ఆయన తెలుగుదేశం పార్టీని వీడారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ పరిణామం టీడీపీకి కొంత ఇబ్బందికరంగా మారనుంది. ఈ ఐదేళ్లు నియోజకవర్గంలో కొంత అభివృద్ధి చేయగలగడం, తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు పోలంరెడ్డికి అనుకూలంగా మారనున్నాయి. అయితే, గత ఎన్నికల్లో ఓడిపోయారని సానుభూతి ప్రసన్నకుమార్ రెడ్డిపై ఎక్కువగానే కనపడుతోంది. దీంతో పోలంరెడ్డికి ఈసారి గెలుపు అంత సులువు కాదనే విశ్లేషణలు ఉన్నాయి.

Tags:    

Similar News