మావోలకు వైసీపీ టార్గెట్ …?

ఏజెన్సీలో గిరిజనం వైసీపీ అంటే జై కొడతారు. నాడు వైఎస్సార్ కాంగ్రెస్ సీఎం గా ఉన్నారు కాబట్టే వారంతా ఆయన్ని చూసి ఆ పార్టీకి ఓటేశారు. ఆయన [more]

Update: 2021-05-06 11:00 GMT

ఏజెన్సీలో గిరిజనం వైసీపీ అంటే జై కొడతారు. నాడు వైఎస్సార్ కాంగ్రెస్ సీఎం గా ఉన్నారు కాబట్టే వారంతా ఆయన్ని చూసి ఆ పార్టీకి ఓటేశారు. ఆయన దివంగతులు అయ్యాక వైసీపీని జగన్ ఏర్పాటు చేస్తే మరో పార్టీ వైపే చూడకుండా ఓటేస్తూ వస్తున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీకి ఒకే ఒక ఎస్టీ ఎమ్మెల్యే ఉంటే మొత్తం సీట్లు అన్నీ వైసీపీ గెలుచుకుంది. ఇక 2019 ఎన్నికల్లో మొత్తానికి మొత్తం సీట్లు వైసీపీ పరం అయ్యాయి అంటేనే మన్యం వైసీపీకి ఎంతలా ప్రాణం అయిందో అర్ధమవుతోందిగా.

వైసీపీ మీద గురి….

జగన్ ఏపీలో అధికారంలోకి వచ్చాక బాక్సైట్ తవ్వకాలు జరపమని చెప్పారు కానీ ఆ దిశగా చర్యలు లేవని మావోయిస్టులు చాలా కాలంగా గుర్రుమీద ఉన్నారు. ఇక వైఎస్సార్ హయాంలో ఏజెన్సీ ముఖద్వారంలో కంపెనీని ఏర్పాటు చేసుకుని గనుల తవ్వకాలకు ఆన్ రాక్ కంపెనీ అనుమతులు తెచ్చుకుంది. దీని మీద ఎంతో పోరాటం జరిగాక అప్పటికి అది ఆగింది. తెలుగుదేశం హయాంలో కూడా చంద్రబాబు జీవో నంబర్ 97 మొదట ఇచ్చి తరువాత బాక్సైట్ తవ్వకాల మీద వెనక్కు తగ్గారు. అయినా సరే నాడు టీడీపీని మావోలు టార్గెట్ చేసి ఆ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమలను దారుణంగా హత్య చేశారు. ఇపుడు వైసీపీ సర్కార్ మీద మావోలు వీలు దొరికినపుడల్లా కారాలు మిరియాలూ నూరుతున్నారు. దోపిడీకే విశాఖను పాలనారాజధానిగా ప్రక‌టించారని కూడా మావోలు విమర్శలు చేస్తూ వస్తున్నారు.

ఆ ఘటనతో అలెర్ట్….

ఇక చత్తీస్ ఘడ్ లో జరిగిన దారుణ మారణ హోమం తరువాత విశాఖ మన్యం కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పైగా చాలా మంది మావోయిస్టులు తలదాచుకునేందుకు విశాఖ ఏజెన్సీ చేరుకున్నారు అన్న వార్తలు కూడా అటు పోలీసులనూ ఇటు ప్రజా ప్రతినిధులనూ కలవరపాటుకు గురి చేస్తున్నాయి. విశాఖ ఏజెన్సీలో మావోలకు ఒకప్పుడు గట్టి పట్టుంది. ఇపుడు కూడా వారు బలపడేందుకు చూస్తున్నారు. చత్తీస్ ఘడ్ దురాగతం తరువాత మావోలు విశాఖ ఏజెన్సీ వైపుగా చూడడంతో పోలీసులు సైతం అప్రమత్తం అయ్యారు. ఇక వైసీపీ నేతలు అయితే మన్యం లో ఇదివరకు మాదిరిగా తిరిగేందుకు కూడా జంకుతున్నారు.

రాజకీయ సంకటం…..

వైసీపీ అధినాయకత్వం నేతలను జనాల్లోనే ఉండమంటోంది. ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టమంటోంది. ఇప్పటిదాకా ఏజెన్సీలో ఎక్కడికైనా ఎమ్మెల్యేలు భాగ్యలక్ష్మి, శెట్టి ఫల్గుణ వంటి వారు తిరిగేవారు. అలాగే అరకు ఎంపీ మాధవి కూడా కొండలు గుట్టకు ఎక్కి మరీ అనేక‌ కార్యక్రమాల్లో పాలుపంచుకునేవారు. అయితే ఇపుడు పోలీసుల నుంచి వస్తున్న హెచ్చరికలు సూచనలతో వైసీపీకి చెందిన ప్రజా ప్రతినిధులు మన్యం వైపు తొంగి చూసే పరిస్థితి లేదని అంటున్నారు. దాంతో పాటు విశాఖ ఏజెన్సీలో మావోలు మళ్ళీ తమ కార్యకలపాలను విసృతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు అంటున్నారు. ఇదిలా ఉంటే విశాఖ ఏజెన్సీకి చెందిన 32 మంది గ్రామ వాలంటీర్లు హఠాత్తుగా తమ పదవులకు రాజీనామా చేయడం కూడా చర్చనీయాంశం అయింది. వారిని పోలీస్ ఇంఫార్మర్లుగా మావోలు అనుమానిస్తున్నారు అన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఇటు పోలీసులు, అటు మావోల ధాటికి తట్టుకుని ఉద్యోగం చేయలేమని వారు చేతులెత్తేయడం కూడా అతి పెద్ద చర్చ అవుతోంది. మరి ఇలా వైసీపీ ప్రభుత్వం గిరిజనుల దగ్గరకు వెళ్లలేకపోతే రాజకీయంగా దెబ్బే అంటున్నారు. దాంతో ముందు నుయ్యి వెనక గొయ్యి అన్న చందంగా వైసీపీ నేతల పరిస్థితి తయారైంది అంటున్నారు.

Tags:    

Similar News