టైంపాస్ వ్యవహారమేనా?

విశాఖ భూములను అడ్డంగా దోచేసుకున్న మారాజులకు దడ పుట్టించే విధంగా మూడేళ్ల క్రితం ప్రతిపక్షాలు అన్నీ ఏకమై ఉద్యమించాయి. గజానికో గాంధారీపుత్రుడు దుశ్శాసనుడై వలువలు వూడదీసినట్లు భూములు [more]

Update: 2019-11-01 14:30 GMT

విశాఖ భూములను అడ్డంగా దోచేసుకున్న మారాజులకు దడ పుట్టించే విధంగా మూడేళ్ల క్రితం ప్రతిపక్షాలు అన్నీ ఏకమై ఉద్యమించాయి. గజానికో గాంధారీపుత్రుడు దుశ్శాసనుడై వలువలు వూడదీసినట్లు భూములు దొలిచేశాడు. ప్రభుత్వ, ప్రైవేట్ అన్న తేడా లేకుండా వేలాదిగా ఎకరాలు భూ దందాకు అర్పణం అయిపోయాయి. సర్కారీ భూములకు లెక్కా పత్రం లేకుండా చేసి తప్పు హుదూద్ తుపాన్ మీదకు తోసేశారు. అంతా బాగానే ఉంది అనుకుంటే ఆఖరుకు ఈ అరాచకం చూడలేక అప్పటి టీడీపీ మంత్రి అయ్య్యన్నపాత్రుడు బాహాటంగా వచ్చి భూ ఆక్రమణ విషయంలో తప్పుపట్టారు. ప్రతిపక్షంతో గొంతు కలిపారు. విపక్షాల వత్తిడి మూలంగా ఎట్టకేలకు చంద్రబాబు సర్కార్ సిట్ ని నియమించింది. దాదాపు ఎనిమిది నెలల పాటు దర్యాప్తు చేసిన మీదట సిట్ పూర్తి నివేదిక నాటి సర్కార్ కి సమర్పించింది. మరి ఆ నివేదిక ఏమైనట్లు..?

కొత్త సిట్ ఎందుకు…?

నిజానికి విశాఖ భూకుంభకోణంపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని వైసీపీ నాయకులు నాడు గట్టిగా డిమాండ్ చేశారు. అసలు దోషులు చిన్నవారు కాదు కాబట్టి ఈ కేసు సాఫీగా దర్యాప్తు జరిగి న్యాయం గెలవాలంటే సీబీఐ ఒక్కటే మార్గమని కూడా చెప్పుకొచ్చారు. చంద్రబాబు సిట్ విచారణకు ఆదేశిస్తే తప్పు పట్టారు. ఆ తరువాత సిట్ నివేదికను బయటపెట్టమని కూడా కోరారు ఇవన్నీ నిన్నా మొన్నా జరిగినవే. మరి ఇపుడు వైసీపీయే అధికారంలో ఉంది. సిట్ నివేదిక వైసీపీ సర్కార్ చేతిలోనే ఉంది. దాన్ని బయటపెట్టవచ్చు కదా అన్న మాట వామపక్షాల నేతలు, బీజేపీ నేతల నుంచి వినవస్తోంది. దీని మీద సీపీఎం నేత సీ హెచ్ నరసింగరావు మాట్లాడుతూ కొత్త సిట్ ఎందుకు, అది పూర్తిగా దండగ మారి వ్యవహారం అన్నారు. ఎన్నో నెలలు కష్టపడి పాత సిట్ విచారణ జరిపించిందని, బాధితులు కూడా నాడు అష్టకష్టాలు పడి మరీ సిట్ కి తమ గోడు చెప్పుకున్నారని కూడా ఆయన గుర్తు చేశారు. అందువల్ల పాత సిట్ నివేదిక బయటపెట్టి దోషుల మీద చర్యలు తీసుకుంటే పోయేదానికి కొత్తగా సిట్ వేసి మళ్ళీ కాలయాప‌న ఎందుకని గట్టిగానే నిలదీశారు. బీజేపీ నేతలైతే ఇది పూర్తిగా టైం పాస్ వ్యవహారంగానే కొట్టిపారేస్తున్నారు.

ఐఏఎస్ లు ఇరుక్కుంటారనా….?

విశాఖ భూదందాల వెనక పలువురు ఐఏఎస్ అధికారులు ఉన్నారని అంటున్నారు. అప్పట్లో విశాఖలోలోపలా, బయటా పనిచేసే కొంతమంది ఐఏఎస్ ల‌ సహాయంతోనే ఇంతటి పెద్ద ల్యాండ్ స్కాం జరిగిందని కూడా అంటున్నారు. ఓ విధంగా చెప్పాలంటే దేశంలోని అతి పెద్ద భూ కుంభకోణంగా దీన్ని పేర్కొంటారు. ఎందరో పేద‌ల భూములు పెద్దలు గద్దల్లా లాక్కెళ్ళిపోతే ఈ రోజుకీ న్యాయం జరగక వారు ఆరు బయట అలమటిస్తున్నారు. మరి అపుడు ప్రభుత్వ అధికారులతో సిట్ ని ఏర్పాటు చేస్తే, ఇపుడు రిటైర్డ్ అధికారులతో ఏర్పాటు చేసిన కొత్త సిట్ ఎంతవరకూ న్యాయం చేస్తుందని అంటున్నారు. పైగా ఎవరికి రక్షించడానికి ఈ సిట్ ఏర్పాటు అని కూడా నిగ్గదీస్తున్నారు. నిజానికి ఈ భూ దందాలో ప్రధాన పాత్ర అప్పటి టీడీపీ నాయకులది అయితే ఇతర పార్టీల నేతలు కూడా ఉన్నారని అంటున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో దోషులను కఠినంగా శిక్షిస్తేనే మరో మారు ఈ తరహా కుంభకోణం జరగకుండా ఉంటుందని అంటున్నారు. కానీ వైసీపీ సర్కార్ కొత్త సిట్ ని వేయడం పట్ల మాత్రం విమర్శలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి. కొత్త సిట్ ఇపుడు ఆఫీస్ తెరచి కూర్చుంది కానీ, బాధితులు మాత్రం ఆసక్తిని చూపడం లేదు. ఇది ఓ విధంగా వైసీపీ నేతలు కూడా సమర్దించేలా లేదని అంటున్నారు.

Tags:    

Similar News