వచ్చింది ఒకందుకైతే …. తీసుకున్నది మరొకందుకు… ?
రాజకీయాల్లో పరస్పర అవసరాలు ఉంటాయి. ఎంత మంచి నాయకుడు అయినా అవతల పార్టీకి అక్కర లేకపోతే అలా ఖాళీగానే ఉండాలి. ఇక వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన [more]
రాజకీయాల్లో పరస్పర అవసరాలు ఉంటాయి. ఎంత మంచి నాయకుడు అయినా అవతల పార్టీకి అక్కర లేకపోతే అలా ఖాళీగానే ఉండాలి. ఇక వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన [more]
రాజకీయాల్లో పరస్పర అవసరాలు ఉంటాయి. ఎంత మంచి నాయకుడు అయినా అవతల పార్టీకి అక్కర లేకపోతే అలా ఖాళీగానే ఉండాలి. ఇక వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలో భారీ ఎత్తున టీడీపీ నుంచి వలసలు మొదలయ్యాయి. ఇక వచ్చిన వారిని వచ్చినట్లే చేర్చుకుని పసుపు పార్టీకి గుండె నిండా గుబులు పుట్టించారు జగన్. ఇలా వచ్చిన వారు వైసీపీకి ఎంత వరకూ ఉపయోగపడుతున్నారు. వారికి పార్టీ ఎంత ఉపయోగపడుతోంది అన్నది కనుక చూసుకుంటే చెల్లుకు చెల్లు అన్నట్లుగానే కధ ఉంది మరి.
దెబ్బ తీయడానికే…?
బంపర్ మెజారిటీతో అధికారాన్ని అందుకున్న కొత్తలో వైసీపీ దూకుడు మామూలుగా లేదు. ఇక ఏపీలో విపక్షమే ఉండకూడదు అన్నట్లుగా జోరు చేసింది. ఆ ప్రయత్నంలోనే చాలా మంది తమ్ముళ్ళు వైసీపీ వైపుగా వచ్చారు. ముఖ్యంగా విశాఖను పాలనా రాజధానిగా చేస్తామని ప్రకటించిన తరువాత మాజీ ఎమ్మెల్యేలతో పాటు కీలకమైన నేతలు అంతా ఫ్యాన్ నీడకు వచ్చేశారు. వారందరికీ కండువాలు కప్పేసిన జగన్ ఇక టీడీపీ పని సఫా అనేశారు. దీంతో టీడీపీ క్యాడర్ ఆత్మస్థైర్యం దెబ్బ తిన్న మాట నిజమే. అయితే వారి వల్ల వైసీపీలో కూడా లొల్లి బాగానే ఉంది మరి.
అందుకోసమేనట…?
ఇక సైకిల్ దిగి వచ్చేసిన ఘనాపాటి నాయకులకు కూడా చాలా ముందు చూపు ఉందని అంటున్నారు. వారి వ్యాపారాలు, వ్యవహారాలకు దెబ్బ తగలకుండా తెలివిగానే ఈ వైపునకు జంప్ చేశారు అంటున్నారు. పదవులు వస్తే బోనస్. రాకపోయినా తమకు సేఫేస్ట్ జోన్ గా అధికార పార్టీ ఉంటుందనే అలా చేశారు అంటున్నారు. విశాఖలోని టీడీపీ నేతలను టార్గెట్ చేసిన వైసీపీ చాలా మంది భూ బాగోతాలను బయటపెట్టింది. అయితే వైసీపీలో చేరిన మాజీ తమ్ముళ్ల గుట్టు మాత్రం ఎక్కడా రట్టు కాకపోవడం విశేషం. ఆ విధంగా వారు చాలా మేలు పొందారని అంటున్నారు.
అనుమానపు చూపులే….
ఇక ఇలా వచ్చిన తమ్ముళ్ళు మళ్ళీ పచ్చగా తెలుగుదేశం వెలిగిపోతే అక్కడకు చేరరు అన్న నమ్మకం ఏదీ వైసీపీ పెద్దలకు లేదుట. అందుకే వారికి పదవులు ఇవ్వకుండా అలా ఎండబెడుతున్నారుట. మరో వైపు కొత్తగా టీడీపీ తరఫున గెలిచిన కొందరు కార్పోరేటర్లు కూడా వైసీపీ తో దోస్తీ చేస్తున్నారు. అయితే వారి మనసు మాత్రం సైకిల్ పార్టీ మీదనే ఉంది అంటున్నారు. గాజువాకలో దాదాపుగా వంద ఎకరాల భూములను దందా చేశారని ఆరోపణలు ఉన్న కార్పోరేటర్లు ఇపుడు అధికార పార్టీ నేతలతో రాసుకుపూసుకుని తిరుగుతున్నారు. వీరందరి విషయంలో అసలైన వైసీపీ నేతలు మాత్రం రగిలిపోతున్నారు. వారికి తమ పార్టీలో పెద్ద పీట వేయడం దారుణమనే అంటున్నారు. వారు తమ స్వార్ధ ప్రయోజనాల కోసమే ఇలా వైసీపీకి జై కొడుతున్నారని విమర్శిస్తున్నారు. మొత్తానికి విశాఖలో వలసలతో వైసీపీ బలపడిందా అంటే లేదు అనే చెప్పాలి. అదే సమయంలో పార్టీలో చేరిన వారు మాత్రం సొంత వ్యాపారాలు చూసుకుంటూ హ్యాపీగా ఉన్నారు. దీంతో వీరు ఎప్పటికైనా తమ గూటి పక్షులే అని టీడీపీ కూడా ధీమా పడుతోంది. ఇదండీ మరి అసలైన రాజకీయం అంటే.