తెలివైన ఎత్తుగడ..?

వైసీపీ సర్కారు వ్యూహాత్మక నిర్ణయంతో రాగల ప్రమాదాన్ని నివారించుకోగలిగింది. రాజకీయంగా తీవ్రమైన ఒత్తిడి నుంచి బయటపడింది. ఏదోరకంగా వైసీపీ ని ఉచ్చులోకి లాగి, వినోదించాలనుకున్న ప్రతిపక్షాల ఆశలు [more]

Update: 2021-08-06 15:30 GMT

వైసీపీ సర్కారు వ్యూహాత్మక నిర్ణయంతో రాగల ప్రమాదాన్ని నివారించుకోగలిగింది. రాజకీయంగా తీవ్రమైన ఒత్తిడి నుంచి బయటపడింది. ఏదోరకంగా వైసీపీ ని ఉచ్చులోకి లాగి, వినోదించాలనుకున్న ప్రతిపక్షాల ఆశలు ఆవిరైపోయాయి. కృష్ణా జలవివాదాలపై సుప్రీం కోర్టు సూచనను తిరస్కరించడం ద్వారా విపక్షాల వ్యూహంలో చిక్కుకోకుండా తప్పించుకోగలిగింది. తెలంగాణ పెట్టే అదనపు డిమాండ్లనూ పక్కనపెట్టగలిగింది. ఇరు ప్రభుత్వాలు కూర్చుని మధ్యేవర్తిత్వంలో జలాల పంపిణీ వివాదాన్ని పరిష్కరించుకుంటే మంచిదనే రీతిలో సుప్రీం కోర్టు సూచించింది. దీనివల్ల కేసు నాన్చివేత, తీర్పు ఎప్పటికి వెలువడుతుందో చెప్పలేని స్థితి ఉండదు. ఇది మంచి పరిష్కారంగానే కనిపిస్తుంది. కానీ దీనివల్ల ఆంధ్రప్రదేశ్ నష్టపోవడానికే ఎక్కువ అవకాశముందనేది సాగునీటి రంగం నిపుణుల అంచనా. అందువల్ల శాశ్వత పరిష్కారం కుదిరేంతవరకూ ఇరు ప్రభుత్వాల ఒప్పందాలు అనవసరమని ఏపీ ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చింది. అందుకే కేసు విచారణ ను ముందుకు తీసుకెళ్లమంటూ సుప్రీం కోర్టును అభ్యర్థించింది.

కేసీఆర్ కు చెక్…

కృష్ణాజలాలపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల మద్య కేంద్ర జలవనరుల శాఖ మధ్యవర్తిత్వంలో 2015లోనే ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం కృష్ణాజలాల్లో అయిదువందల టీఎంసీలు ఏపీ, మూడువందల టీఎంసీలు తెలంగాణ వినియోగించకుంటున్నాయి. అయిదేళ్లుగా అదే ఒప్పందం కొనసాగుతూ వస్తోంది. వైసీపీ సర్కారు పోతిరెడ్డి పాడు విస్తరణ కు ప్రత్యేకంగా ఉత్తర్వులివ్వడంతో తాజా గొడవ మొదలైంది. వివాదాన్ని పతాక స్తాయికి తీసుకెళ్లడానికి తెలంగాణ ప్రయత్నించింది. నీటిని వృథా చేస్తూ విద్యుత్ ఉత్పత్తి చేసింది. మొత్తమ్మీద రెండు రాష్ట్రాలు రోడ్డున పడ్డాయి. నీటి పంపకాలు నిన్నామొన్నటివరకూ రాజకీయ వివాదంగా మారలేదు. కానీ ఏపీ, తెలంగాణలు భీష్మించుకు కూర్చోవడంతో వివాదం పెరిగి పెద్దదయింది. మధ్యవర్తిత్వం జరిగితే 2015 నాటి ఒప్పందాన్ని తిరగదోడేందుకు అవకాశం వస్తుందని కేసీఆర్ ఆశించారు. దానివల్ల ఎంతోకొంత తెలంగాణకు ప్రయోజనం చేకూరుతుంది. కానీ ఇప్పుడు న్యాయపరమైన పరిష్కారానికే వైసీపీ ప్రభుత్వం మొగ్గు చూపడంతో తక్షణం తెలంగాణకు వచ్చే లాభమేమీ ఉండదు. కోర్టు తీర్పు వచ్చేవరకూ వేచి చూడాల్సి ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఎవరూ చెప్పలేరు. అంతవరకూ 2015లో కుదిరిన ఒప్పందమే అమలులో ఉంటుంది. దీనివల్ల జలాల పంపిణీ నుంచి తక్షణం రాజకీయ ప్రయోజనం పొందవచ్చనుకున్న కేసీఆర్ ఆలోచనలు ఫలించే అవకాశం కనిపించడం లేదు. పైపెచ్చు 2015లో ఒప్పందం టీఆర్ఎస్ ప్రభుత్వమే కుదుర్చుకుంది. అందువల్ల ఎవరినీ తప్పు పట్టడానికి కూడా వీల్లేని పరిస్థితి ఏర్పడింది.

టీడీపీకి ఎదురు చూపులే..

తెలుగుదేశం పార్టీ ప్రతివిషయంలోనూ వైసీపీని రాజకీయంగా ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తూ వస్తోంది. ప్రభుత్వ అనుభవరాహిత్యం వల్ల అనేక అంశాల్లో సాంకేతికంగా ప్రతిపక్షాలదే పైచేయిగా మారింది. అయినప్పటికీ వైసీపీ సర్కారుకు ఉన్న ప్రజాదరణ, శాసనసభలో బలం దృష్ట్యా ప్రతిపక్షాల ఆందోళనలు, రాజకీయ పోరాటాలు పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాయి. కృష్ణాజలాల వివాదం రైతులతో ముడి పడి ఉండటంతో వైసీపీని ఇబ్బంది పెట్టవచ్చని భావించారు. తెలుగుదేశం అధినేత ఆచితూచి స్పందించారు. ఏదో స్థాయిలో కేసీఆర్, జగన్ మోహన్ రెడ్డి అవగాహనకు వస్తే అటాక్ చేద్దామని భావించారు. అయితే అటువంటి అవకాశం లేకుండా జగన్ కనీసం స్పందించలేదు. దీంతో టీడీపీ చేతి నుంచి ఒక అస్త్రం చేజారిపోయింది. కేసీఆర్ పట్ల జగన్ సానుకూలంగా ఉంటారని వాదన చేస్తున్న టీడీపీకి ఈసారి మాత్రం అటువంటి అవకాశం దక్కలేదు. రాయలసీమతోపాటు కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు వనరు కృష్ణా జలాలు. అందుకే కీలకమైన రాజకీయ అంశంగానూ మారింది. మధ్యవర్తిత్వంలో ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో వ్యవహరించాలి. ఏమాత్రం తెలంగాణ వైపు మొగ్గు కనిపించినా ఏపీ ప్రభుత్వానికి రాజకీయంగా ఇబ్బంది తప్పదు. అందుకే న్యాయస్థానంపైనే బాధ్యతను ఉంచి , వైసీపీ సర్కారు తెలివిగా తప్పుకుంది.

చేసేదేమీ లేదు…

గిల్లికజ్జాలు పెట్టుకుని ఇంతవరకూ తెచ్చుకున్న రెండు ప్రభుత్వాలు ఇకపై పెద్దగా చేసేదేమీ ఉండదు. కృష్ణా,గోదావరి బోర్డులు నిర్వహణ బాధ్యతలు చేపడతాయి. తమ వాదనలు వినిపించడమే తప్ప కార్యనిర్వహణ అధికారాలు రెండు రాష్ట్రాలకు ఉండవు. అక్టోబర్ నుంచి విద్యుదుత్పత్తి సహా ప్రాజెక్టులు, కాలవల నిర్వహణ మొత్తాన్ని బోర్డులు అధీనంలోకి తీసుకుంటాయి. ఛైర్మన్ సహా కీలకమైన బాధ్యతల్లో రెండు రాష్ట్రాలకు చెందిన వారెవరూ ఉండరు. దీనివల్ల అనుచిత లబ్ధి, వివక్ష అన్న మాటలకు తావు లేకుండా చర్యలు తీసుకుంటారు. ఈ ఏర్పాటు వల్ల రాజకీయంగా రెండు రాష్ట్రాలు పేచీలు పెట్టుకోవడానికి కుదరదు. ఓట్ల కోసం గోడవ పడేందుకు ప్రయత్నించినా ప్రయోజనం దక్కదు. రెండు ప్రభుత్వాలు కేంద్రాన్ని నిందించడం ద్వారా మాత్రమే సంతృప్తి చెందాలి. నిజానికి బోర్డును ఏర్పాటు చేసిన తర్వాత కేంద్రం కూడా జోక్యం చేసుకునేందుకు అవకాశం తక్కువ. ఇప్పటివరకూ కుదిరిన ఒప్పందాలు, ట్రిబ్యునళ్ల కేటాయింపులకు అనుగుణంగా బోర్డు నీటి పంపకాలపై ఆటోమాటిక్ గా చర్యలు తీసుకుంటుంది. ఇంతవరకూ రెండు రాష్ట్రాలు కొంతమేరకు కృష్ణ నీటిపై ప్రివిలేజెస్ అనుభవిస్తున్నాయి. ఇకపై అటువంటి విచక్షణాధికారం కోల్పోనున్నాయి. రాజకీయ రచ్చకు కూడా ఫుల్ స్టాప్ పెట్టకతప్పదనే చెప్పాలి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News