జగన్ ఇమేజ్ మీదనే భారం

ప్రధాన ప్రతిపక్షం ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తోంది. వ్యూహకర్తల నివేదికలు, సర్వేల అంచనాలను బేరీజు వేసుకుంటూ జగన్ మోహన్ రెడ్డి సమీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లాల వారీగా సమరశంఖారావాలు పూరిస్తున్నారు. [more]

Update: 2019-02-08 17:40 GMT

ప్రధాన ప్రతిపక్షం ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తోంది. వ్యూహకర్తల నివేదికలు, సర్వేల అంచనాలను బేరీజు వేసుకుంటూ జగన్ మోహన్ రెడ్డి సమీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లాల వారీగా సమరశంఖారావాలు పూరిస్తున్నారు. తమ పార్టీ పరిస్థితిని వివరించి పొలిటికల్ ఫీడింగ్ ఇవ్వడమే ఈ సమీక్షల సారాంశం. 13 జిల్లాలకు సంబంధించిన పూర్తిస్థాయి రిపోర్టులను వైసీపీ అగ్రనాయకత్వం ఇప్పటికే రెండు మూడు విడతలుగా అధ్యయనం చేసింది. పాదయాత్ర ముగిసిన వెంటనే అభ్యర్థుల ఖరారు ప్రక్రియను ప్రారంభించాలనుకున్నారు. అయితే కార్యకర్తలతో ఒక మాట చెప్పిన తర్వాత ఫైనలైజ్ చేస్తే బాగుంటుందనే సూచనలు వచ్చాయి. దాంతో అభ్యర్థుల వివరాలను బయటపెట్టకుండా ఖరారు ప్రక్రియను కొనసాగిస్తున్నారు. ఇప్పటికి 130 నియోజకవర్గాలకు సంబంధించిన క్యాండిడేట్లు ఖాయమై పోయారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అగ్రనాయకత్వం అభ్యర్థుల బలాబలాలను పెద్దగా పట్టించుకోవడం లేదు. జగన్ ఇమేజ్ మీద ఆధారపడే అందరూ గెలుస్తారనే బలమైన విశ్వాసం పార్టీలో ఏర్పడింది. అందువల్లనే అభ్యర్థులకు షరతులు వర్తింపచేస్తున్నారు. క్యాండిడేట్లతో సంబంధం లేకుండా పార్టీ ఎక్కడెక్కడ బలంగా ఉందనే విషయాన్నే కార్యకర్తల సమావేశాల్లో వివరిస్తున్నారు.

రాయలసీమ రైటో రైట్…

తాము అధికారంలో కూర్చోవాలో, లేదో రాయలసీమలో లభించే బలమే నిర్ణయిస్తుందని వైసీపీ భావిస్తోంది. ఈసారి క్లీన్ స్వీప్ సాధిస్తామని ఆ పార్టీ అగ్రనాయకత్వం బలంగా నమ్ముతోంది. గతంలో అనంతపురం నుంచి ప్రకాశం వరకూ ఉన్న మెట్ట జిల్లాల్లో అనంతపురం మాత్రమే టీడీపీకి అండగా నిలిచింది. మిగిలిన జిల్లాల్లో వైసీపీదే ఆధిక్యం. ఈ సారి టీడీపీ మరింతగా దెబ్బతింటుందని జగన్ మోహన్ రెడ్డి చెబుతున్నారు. ఈ జిల్లాల్లో టీడీపీ కంటే 25 సీట్ల కచ్చితమైన ఆధిక్యం వైసీపీకి లభిస్తుందని సొంత సర్వేల ఆధారంగా నిర్ధరణకు వచ్చేశారు. టీడీపీకి ఈ ఆరు జిల్లాల్లో కలిసి 23 నుంచి 25 స్థానాలు మాత్రమే దక్కుతాయని అగ్రనాయకులు వివిధ సమావేశాల్లో పార్టీ క్యాడర్ కు భరోసాగా చెబుతున్నారు. స్వతంత్ర రాజకీయ పరిశీలకులు సైతం ఎడ్జ్ వైసీపీదేనని అభిప్రాయపడుతున్నారు. అయితే ఆ పార్టీ ప్రచారం చేస్తున్నంతటి క్లీన్ స్వీప్ ఉండకపోవచ్చునంటున్నారు. కనీసం ఈ జిల్లాల పరిధిలో 15 సీట్ల ఆధిక్యం దక్కవచ్చని అంచనా వేస్తున్నారు. ఇటీవల ఒక జాతీయ సర్వే రాష్ట్రంలో ఎంపీ స్థానాల్లో 23 దక్కుతాయని చెప్పింది. దానిని వైసీపీ సైతం విశ్వసించలేకపోతోంది. 17 నుంచి 19 స్థానాలు దక్కుతాయనేది ఆ పార్టీ అంతర్గత సర్వే లో వెల్లడైందంటున్నారు.

ఉత్తరాంధ్రలో ఊపందుకుంది..

గత ఎన్నికల్లో ఉత్తరాంధ్ర వైసీపీని దెబ్బతీసింది. ఇక్కడ టీడీపీకి బలమైన నాయకత్వం అందగా ఉంది. వైసీపీకి సైతం బొత్స, ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం వంటివారి అండ ఉంది. కానీ వారెవరూ నియోజకవర్గం దాటిపోవడం లేదు. పార్టీలో ఉప ప్రాంతీయ నాయకులు ప్రాబల్యం సంతరించుకోవడం జగన్ కు ఇష్టం లేదు. దీనివల్ల తమ అనుయాయులకు టిక్కెట్లు ఇవ్వమనే ఒత్తిడి పెరుగుతుంది. అందువల్లనే ఎవరిని ఎంతమేరకు అనుమతించాలో, ఆ పరిధికే నాయకులను జగన్ పరిమితం చేస్తున్నారు. బొత్స, ధర్మాన వంటివారు అత్యుత్సాహంతో ముందుకు దూసుకుపోకుండా సంయమనం పాటించడానికి కారణమదే. ఉత్తరాంధ్రలో గతంలో ఉన్న వైఫల్యాలను అధిగమించి కచ్చితంగా వైసీపీ పైచేయి సాధిస్తుందని నాయకులు క్యాడర్ కు చెబుతున్నారు. అయితే అధికార పార్టీతో భారీగా వ్యత్యాసం ఉండకపోవచ్చని అంచనాలో ఉన్నారు. అయిదు నుంచి ఆరుసీట్లు తెలుగుదేశానికంటే వైసీపీకి ఎక్కువగా లభిస్తాయని అంతర్గత సర్వేల ద్వారా వెల్లడైంది. ఎస్టీ నియోజకవర్గాలన్నీ వైసీపీ ఖాతాలోనే జమ అవుతాయనే అంచనాలో ఉన్నారు. విశాఖపట్నంలో మాత్రం అధికారపార్టీవైపు మొగ్గు కనిపిస్తోందనేది వైసీపీ అంచనా.

మధ్యాంద్రలో మనీ తప్పదు..

ఉభయగోదావరి జిల్లాలు, క్రుష్ణా, గుంటూరు ల ప్రజాస్పందనపై అందరిలోనూ ఆసక్తి వ్యక్తమవుతోంది. ఈ నాలుగు జిల్లాలే టీడీపీని అందలమెక్కించాయి. మిగిలిన చోట్ల నెలకొని ఉన్న పోటాపోటీ వాతావరణాన్ని తెలుగుదేశం వైపు తిప్పిన జిల్లాలివే. ఈ జిల్లాల్లో జనసేన కూడా ప్రధానమైన పార్టీగానే తలపడబోతోంది. దీంతో త్రిముఖ పోరు అనివార్యంగా కనిపిస్తోంది. మిగిలిన జిల్లాల కంటే ఆర్థికంగా కూడా సంపన్న జిల్లాలు. రాజధాని నెలకొని ఉన్న ప్రాంతం. నయా సంపన్న వర్గం పుట్టుకొచ్చింది. రియల్ ఎస్టేట్ , హోటళ్లు, వ్యాపార కార్యకలాపాల్లో హఠాత్తుగా కుబేరులుగా ఆవిర్భవించిన వారి సంపద కూడా ఈ సారి ఎన్నికల్లో భారీగానే ఖర్చు కాబోతోంది. నేతలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా బినామీలుగా రియల్ వ్యాపారాలు, కాంట్రాక్టులు చేస్తున్నవారు కూడా ఉన్నారు. ఓటర్లను ఆకట్టుకోవడానికి, కొనుగోళ్లకు భారీ ఎత్తున డబ్బు గుమ్మరించాల్సి ఉంటుంది. అందులోనూ ఇక్కడ పేద వర్గాల జీవనప్రమాణాలు సైతం మిగిలిన జిల్లాలతో పోలిస్తే కొంతమేరకు మెరుగ్గా ఉంటాయి. పదో పరకో చేతిలో పెట్టి ప్రలోభ పరచడం సాధ్యం కాదు. మిగిలిన జిల్లాల్లో నియోజకవర్గానికి సగటున ఒక్కో ప్రధాన పార్టీ అభ్యర్థి 12 నుంచి 15 కోట్ల మేరకు ఖర్చు పెట్టాల్సి ఉంటుందని భావిస్తున్నారు. ఈ నాలుగు జిల్లాల్లో మాత్రం 22 నుంచి 25 కోట్ల వరకూ కచ్చితంగా తీయాలని అధికార, ప్రతిపక్షాల నాయకులు పేర్కొంటున్నారు. ఈ విషయం కూడా వైసీపీ అంతర్గత సమీక్షల్లో ప్రధానాంశమై కూర్చొంది. మరో పదిహేను రోజుల్లో జాబితాలను బహిరంగ పరిచి ప్రచార ఉద్ధ్రుతిని పెంచాలని వైసీపీ అధినేత భావిస్తున్నారు.

Tags:    

Similar News