టీడీపీ యువ‌నేత‌తో వైసీపీ మంత‌నాలు.. జ‌గ‌న్‌కూ ఓకే

తెలుగుదేశం పార్టీకి చెందిన యువ నేత‌ల‌పై ప్రధానంగా ఫోక‌స్ చేస్తూ వ‌స్తోంది. ఇటు టీడీపీ యువ‌నేత‌ల అవ‌స‌రాలు కావొచ్చు. అటు వైసీపీకి వీరి అవ‌స‌రం కావ‌చ్చు.. ఏదేమైనా [more]

Update: 2021-02-18 14:30 GMT

తెలుగుదేశం పార్టీకి చెందిన యువ నేత‌ల‌పై ప్రధానంగా ఫోక‌స్ చేస్తూ వ‌స్తోంది. ఇటు టీడీపీ యువ‌నేత‌ల అవ‌స‌రాలు కావొచ్చు. అటు వైసీపీకి వీరి అవ‌స‌రం కావ‌చ్చు.. ఏదేమైనా వ‌ల్లభ‌నేని వంశీ, దేవినేని అవినాష్‌, క‌ర‌ణం వెంక‌టేష్ లాంటి యువ‌నేత‌లు ఇప్పటికే టీడీపీకి జెల్ల కొట్టి వైసీపీ చెంత చేరిపోయారు. ఇప్పుడు అదే లిస్టులో మ‌రో టీడీపీ యువ‌నేత చేర‌బోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ యువ‌నేత త‌మ‌కే అవ‌స‌రం అని వైసీపీ అధిష్టానం భావిస్తోంద‌ట‌. ఫ్యాక్షన్ రాజ‌కీయాల‌కు దూరంగా ఉండ‌డంతో పాటు త‌న ప‌ని తాను చేసుకుపోయే ఈ నేత‌ను పార్టీలోకి తీసుకోవ‌డం ద్వారా సొంత పార్టీలో ఎగురుతోన్న కొంత‌మంది నేత‌ల‌కు చెక్ పెట్టే ఉద్దేశం కూడా అధిష్టానానికి ఉంద‌నే అంటున్నారు.

టీడీపీలో చివరి నేతగా….

ఆ యువ‌నేత ఎవ‌రో కాదు క‌ర్నూలు టీడీపీ ఇన్‌చార్జ్ టీజీ. భ‌ర‌త్‌. గ‌త ఎన్నిక‌ల్లో క‌ర్నూలు సిటీ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన భ‌ర‌త్ స్వల్ప తేడాతో వైసీపీ అభ్యర్థి మ‌హ్మద్ హ‌ఫీజ్‌ఖాన్ చేతిలో ఓడిపోయారు. ఆ త‌ర్వాత భ‌ర‌త్ తండ్రి, మాజీ మంత్రి, ప్రస్తుత రాజ్యసభ స‌భ్యుడు టీజీ వెంక‌టేష్ కాషాయ కండువా క‌ప్పుకున్నారు. ఇప్పుడు తండ్రి ఓ పార్టీలో… కొడుకు ఓ పార్టీలో ఉన్నారు. టీడీపీలో భ‌ర‌త్‌కు ఉండాల్సిన ఇబ్బందులు భ‌ర‌త్‌కు ఉన్నాయి. జిల్లాలో చంద్రబాబు భూమా, కేఈ, కోట్ల కుటుంబాల‌కు ప్రయార్టీ ఇచ్చాక కూడా ఏ జ‌య‌నాగేశ్వర్ రెడ్డో లేదా మ‌రో నేత‌కో ప్రయార్టీ ఇచ్చాక కానీ చివ‌రి వ‌రుస‌లో భ‌ర‌త్ గుర్తుకు వ‌స్తారు. పైగా ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో క‌ర్నూలులో టీడీపీ పుంజుకుంటుంద‌న్న న‌మ్మకం లేదు. గ‌త ఎన్నిక‌ల్లోనే వైసీపీ స్వీప్ చేసేసింది.

తెరవెనక మంతనాలు…..

ఈ క్రమంలోనే భ‌ర‌త్ అవ‌స‌రం కావ‌చ్చు.. అటు వైసీపీ అవ‌స‌రం కావ‌చ్చు… ఈ యువ‌నేత వైసీపీ కండువా క‌ప్పుకునే ప్రక్రియ‌కు తెర‌వెన‌క మంత‌నాలు షురూ అయ్యాయి. అన్నింటికి మించి టీడీపీలో ఆర్థికంగా బ‌లంగా ఉన్న నేత‌ల‌ను కూడా వైసీపీ టార్గెట్ చేస్తూ త‌మ పార్టీలోకి లాగేస్తోంది. ఇదే భ‌ర‌త్ వైశ్య సామాజిక వ‌ర్గానికి చెందిన మాజీ మంత్రి శిద్ధా రాఘ‌వ‌రావు, ఆయ‌న కుమారుడు సుధీర్‌బాబు సైతం వైసీపీ కండువా క‌ప్పేసుకున్నారు. ఇప్పుడు భ‌ర‌త్‌ను పార్టీలో చేర్చుకుంటే అటు వైశ్య క‌మ్యూనిటీని అక్కున చేర్చుకున్నార‌న్న ప్లస్ పాయింట్‌తో పాటు టీడీపీకి ఉన్న బ‌ల‌మైన ఆర్థిక వ‌న‌రుల్లో ఒక వికెట్‌ను ప‌డ‌గొట్టడ‌మే వైసీపీ టార్గెట్‌.

ఆ కుటుంబం అవసరం కూడా….

ఇక టీజీ ఫ్యామిలీ అవ‌స‌రం వైసీపీకి కూడా ఉంది. జిల్లా వైసీపీలో ఎక్కువ మంది గ్రూపు త‌గాదాల‌తో జ‌గ‌న్‌కు త‌ల‌నొప్పులు తెస్తున్నారు. ఒక్క బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి లాంటి నాన్ కాంట్రవ‌ర్సియ‌ల్ ప‌ర్సన్ మిన‌హా క‌ర్నూలు వైసీపీలో చాలా మంది దూకుడుగా ఉండ‌డంతో పాటు… ఫ్యాక్షన్ రాజ‌కీయ నేత‌ల‌న్న విమ‌ర్శలు ఎదుర్కొంటున్నారు. దీంతో భ‌ర‌త్‌ను తీసుకుంటే పై ఈక్వేష‌న్లను బ‌ట్టి సామాజిక‌, ఆర్థిక‌, ఫ్యాక్షన్ ర‌హిత రాజ‌కీయాల కోణంలో క‌లిసి వ‌స్తుంద‌న్నదే వైసీపీ అధిష్టానం అంచ‌నా. అందుకే నేరుగా జ‌గ‌న్ నుంచే భ‌ర‌త్‌ను పార్టీలో చేర్చుకునే ప్రక్రియ మొద‌లైందంటున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌ర్నూలు గ్రూపు రాజ‌కీయాల‌కు చెక్ పెడుతూ ఆయ‌న‌కు వైసీపీ సీటు ఇస్తార‌ని కూడా స్థానికంగా చ‌ర్చలు స్టార్ట్ అయ్యాయి. ఏదేమైనా టీడీపీలో మ‌రో యంగ్ వికెట్ ప‌డ‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది.

Tags:    

Similar News