నిరాశలో ఫ్యాన్ పార్టీ నేతలు !!

వైఎస్ జగన్ పాదయాత్ర ముగిసింది. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలో బ్రహ్మాండంగా సాగింది. అన్ని చోట్లా జగన్ కి జనం నీరాజనం పట్టారు. అన్నీ బాగానే ఉన్నా వచ్చే [more]

Update: 2019-01-10 11:00 GMT

వైఎస్ జగన్ పాదయాత్ర ముగిసింది. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలో బ్రహ్మాండంగా సాగింది. అన్ని చోట్లా జగన్ కి జనం నీరాజనం పట్టారు. అన్నీ బాగానే ఉన్నా వచ్చే ఎన్నికల్లో అభ్యర్ధులెవరో జగన్ ప్రకటించకుండానే ఉత్తరాంధ్రని వదిలి వెళ్ళిపోయారని ఆశావహులు ఆందోళన చెందుతున్నారు. నిజానికి మొదట జ‌గన్ పాదయాత్రలో ఎక్కడికక్కడ అభ్యర్ధులను ప్రకటిస్తారని అంతా అనుకున్నారు. కానీ విశాఖ జిల్లాలో ఒక్క పేరు ప్రకటించలేదు, విజయనగరం జిల్లాలో మాత్రం కోలగట్ల వీరభద్రస్వామి పేరు ప్రకటించి ఊరుకున్నారు. ఇక శ్రీకాకుళంలో అయితే ఒక్కరి పేరు కూడా జగన్ నోటి వెంట రాలేదు. ఉత్తరాంధ్రలో మొత్తానికి మొత్తం 34 అసెంబ్లీ సీట్లు, అయిదు పార్లమెంట్ సీట్లు ఉంటే జగన్ అధికారికంగా ప్రకటించింది ఒకే ఒక్క పేరు మత్రమే.

ముగింపు రోజుపై ఆశలు

ఇక జగన్ పాదయాత్ర ముగింపు రోజున మొదటి జాబితా రిలీజ్ ఉంటుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దానికి తగినట్లుగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల కో ఆర్డినేటర్లను సభకు రమ్మని ఆదేశాలు ఇచ్చారు. దీంతో సీట్ కన్ ఫర్మ్ అనుకున్న వారంతా గంపెడాశతో ఇచ్చాపురం చేరుకున్నారు. తీరా అక్కడ రెండు గంటల పాటు ప్రసంగించిన జగన్ అభ్యర్ధుల ఊసే లేకుండా ముగించి వెళ్లిపోయారు. దీంతో ఎమ్మెల్యే టికెట్ కోసం రేసులో ఉన్న వారంతా డీలా పడ్డారు.

అపుడేనా

ఇక జగన్ పండుగ వెళ్ళేంతవరకూ విశ్రాంతి తీసుకుని ఆ మీదట బస్సు యాత్రకు రెడీ అవుతారని పార్టీ వర్గాలు అంటున్నాయి. బస్సు యాత్ర సందర్భంగానే టికెట్లు ప్రకటించే అవకాశాలు ఉన్నాయని తేలడంతో మరి కొంతకాలం ఈ టెన్షన్ తప్పెట్లు లేదని వైసీపీ నాయకులు అంటున్నారు. నిజానికి ప్రతి నియోజకవర్గంలో జగన్ పాదయాత్ర నాలుగేసి రోజుల పాటు జరిగింది. దీంతో ఏర్పాట్లు, ఇతర ఖర్చుల కోసం ఆశావహులంతా జేబులు కరిగించుకున్నారు. మేమంటే మేమంటూ జగన్ కంట్లో పడడానికి పెద్ద ప్రయత్నాలే చేశారు.

ఇంత చేసినా అధినేత కరుణించకపోవడంతో కలవరపడుతున్నారు. రేపటి రోజున ఎవరికి టికెట్ దక్కుతుందోనని వైసీపీ నేతలు బెంగటిల్లుతున్నారు. అయితే సర్వే నివేదికల ఆధారంగానే టికెట్ ఇస్తామని వైసీపీ అధినాయకత్వం స్పష్టం చేయడంతో ఆ సర్వేలు ఎవరి కొంప ముంచనున్నాయోనని కలవరపడుతున్నారు. మొత్తానికి ఉత్తరాంధ్రలో పాదయాత్ర పేరిట దాదాపు అయిదు నెలల పాటు ఇక్కడే గడిపిన జగన్ పార్టీ నాయకులకు మాత్రం ఉత్త చేతులే చూపించారని అంటున్నారు.

Tags:    

Similar News