బాబోయ్.. బాబాయే ముంచేస్తున్నాడుగా ?

అదేంటో జగన్ కష్టంతో వచ్చిన అధికారాన్ని అనుభవిస్తున్న వారు ఆయనకే చిచ్చు పెట్టేలా వ్యవహరిస్తున్నారు. అది ఇంట్లో బాబాయ్ అయినా బయట మరో నేత అయినా ఒక్కటే. [more]

Update: 2020-09-19 13:30 GMT

అదేంటో జగన్ కష్టంతో వచ్చిన అధికారాన్ని అనుభవిస్తున్న వారు ఆయనకే చిచ్చు పెట్టేలా వ్యవహరిస్తున్నారు. అది ఇంట్లో బాబాయ్ అయినా బయట మరో నేత అయినా ఒక్కటే. రాజకీయంగా ఎన్ని రకాలుగా ఓటములు వచ్చినా చాణక్య రాజకీయంలో మాత్రం చంద్రబాబును మించిన వారు లేరు. ఇపుడు చూస్తే ఏపీలో బీజేపీ కేవలం మతం కార్డుని పట్టుకుని ఊరేగుతోంది. దీంతో ఏ మాత్రం రాజకీయం తెలిసినా కూడా సహనంతో సంయమనంతో వ్యవహరించాలి. కానీ చూడబోతే టీటీడీ చైర్మన్ కిరీటం నెత్తిన పెట్టినందుకు బాబాయ్ వైవీ సుబ్బారెడ్డిని చూసి జగనే బాబోయ్ అనేలా సీన్ ఉంది.

ఎందుకొచ్చిన ప్రకటన….

టీటీడీకి వచ్చే అన్య మతస్థులు ఎవరూ డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని పొలిటికల్ గా బోల్డ్ స్టేట్మెంట్ ఒకటి వైవీ సుబ్బారెడ్డి ఇచ్చేశారు. ఆయన ఈ మాట నోటి వెంట అన్నపుడు ఏపీలో గత కొన్ని రోజులుగా ఉన్న రాజకీయ వాతావరణాన్ని గమనించుకున్నారా అన్నదే డౌట్. అసలే ఏపీలో రధాల దహనం. వెండి సింహాలా అపహరణ. వరసగా హిందూ ఆలయాల మీద టార్గెట్ అవుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. వాటి మీద జగన్ సర్కార్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. దాంతోనే లాక్కోలేక పీక్కోలేక అన్నట్లుగా ఉన్న వైసీపీ ప్రభుత్వానికి బాబాయ్ సుబ్బారెడ్డి స్ట్రాంగ్ డోస్ ఇచ్చేశారు. ఎక్కడో తానే కెలుక్కునట్లుగా అన్య మతస్థులు ఎవరూ డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదనేశారు.

అడ్డంగా బుక్కయ్యారా….?

ఇదిపుడు టీడీపీకి బీజేపీకి మంచి అస్త్రంగా మారుతోంది. హిందూ మతం మీద నమ్మకం లేని వ్యక్తి జగన్ అంటూ బాబు అపుడే పెద్ద గొంతు చేసుకుంటున్నారు. ఇక రిటైర్డ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బీజేపీ నేత అయిన ఐవైఆర్ క్రిష్ణా రావు అయితే అంత నమ్మకం లేకపోతే జగన్ తిరుమల రావడం మానుకుంటే బెటర్ అంటూ ఎక్కడ గుచ్చాలో అక్కడే గుచ్చేశారు. మరి ఎందుకు ఇలా సుబ్బారెడ్డి మాట్లాడారో కానీ జగన్ ని బుక్ చేసేశారు. ఇపుడు బీజేపీ పెట్టిన హిందూ రగడకు ఇది ఆజ్యం పోసేలా ఉందన్నమాట. జగన్ ఎక్కడో ఆకాశం నుంచి ఊడిపడిన వారు కాదు, చిత్తూరు పక్కనే ఉన్న కడప జిల్లా వాసి. ఆయన తండ్రి అయిదేళ్ళు సీఎంగా చేశారు. నాడు వైఎస్సార్ కూడా బ్రహ్మోత్సవాలలో పాలుపంచుకున్నారు. అపుడు లేని గోల ఇపుడే ఎందుకు. ఈ లాజిక్ అర్ధం కాని సుబ్బారెడ్డి ఏదో మాట్లాడి వైసీపీ సర్కార్ని ముంచేశారు.

నాడు లేదుగా…..

జగన్ బ్రహ్మోత్సవాలు రావడం ఇది రెండవసారి. మరి ఆయన గత ఏడాది పట్టు వస్త్రాలు సమర్పించినపుడు కిక్కురుమనని వారు ఇపుడు పెద్ద గొంతు ఎందుకు చేస్తున్నారు. అయినా వైవీ సుబ్బరెడ్డి ఆ మాటలకు కౌంటర్లు ఇవ్వడం మానేసి తన పని తాను చూసుకుంటే పోయేది కదా. ఇపుడు ఎవరో దొంగ అంటే అది నేనే అన్నట్లుగా డిక్లరేషన్ రద్దు అంటూ తేనె తుట్టె కదిపారు. దీంతో జగన్ బాబాయ్ సాక్షిగానే హిందూ మత వ్యతిరేకి అయిపోతున్నారు. ఆయనకు హిందూ మతం మీద నమ్మకం లెలేదని కూడా అంటున్నారు. మొత్తానికి అధికారంలోకి వస్తే చాలదు, తన చుట్టూ ఉన్న వారిని సమర్ధులుగా నియమించుకోకపోతే వచ్చే ముప్పూ తప్పూ ఏంటో జగన్ చవిచూస్తున్నారు.

Tags:    

Similar News