బాబాయికి బై బై… ?

జగన్ పదవుల విషయంలో సొంత బాబాయి కే ఝలక్ ఇవ్వబోతున్నారా అంటే సమాధానం అవును అనే వస్తోంది. ప్రకాశం జిల్లాకు చెందిన వైవీ సుబ్బారెడ్డి వైఎసార్ కి [more]

Update: 2021-06-18 12:30 GMT

జగన్ పదవుల విషయంలో సొంత బాబాయి కే ఝలక్ ఇవ్వబోతున్నారా అంటే సమాధానం అవును అనే వస్తోంది. ప్రకాశం జిల్లాకు చెందిన వైవీ సుబ్బారెడ్డి వైఎసార్ కి తోడల్లుడు. ఆయనతో పాటే రాజకీయాలలో చురుకుగా పాలుపంచుకుంటూ జిల్లాలో పట్టు సాధించారు. ఇక జగన్ కాంగ్రెస్ ని విభేదించి బయటకు వచ్చాక బాబాయిగా వెన్నంటి ఉన్నారు. అన్ని విషయాల్లోనూ అబ్బాయికి సలహా సూచనలు ఇస్తూ పార్టీని ముందుకు నడిపించారు. ఫలితంగా 2014 ఎన్నికల్లో ఒంగోలు నుంచి వైవీ సుబ్బారెడ్డి ఎంపీ అయ్యారు. ప్రత్యేక హోదా సాధనలో భాగంగా జగన్ మాట మేరకు 2018లోనే ఆయన తన ఎంపీ పదవిని వదులుకున్నారు. ఆ తరువాత నుంచి ఆయనకు పెద్ద పదవులు దక్కడంలేదు.

రాజ్యసభ మీదనే ..?

లోక్ సభకు రాజీనామా చేసిన వారిలో తిరిగి కొందరికి అవకాశం 2019 ఎన్నికల్లో జగన్ ఇచ్చారు. అయితే వైవీ సుబ్బారెడ్డికి బదులుగా ఒంగోలు నుంచి మాగుంట శ్రీనివాసులురెడ్డికి చాన్స్ ఇవ్వడంతో నాడే బాబాయ్ గుస్సా అయ్యారు. మొత్తానికి జగన్ సర్దిచెప్పి పార్టీ అధికారంలోకి వస్తే రాజ్యసభకు పంపుతానని చెప్పారు. ఆ తరువాత టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చారు కానీ వైవీ సుబ్బారెడ్డికి పెద్దాశలే ఉన్నాయట. అలా మొదటి దఫా ఖాళీలు 2020లో వస్తే వైవీ సుబ్బారెడ్డి ఊసే లేకుండా పోయింది. 2022లో మరోసారి నాలుగు ఎంపీ పదవులు వస్తాయి. వీటి మీద వైవీ సుబ్బారెడ్డి చాలా గట్టిగానే ఆశలు పెట్టుకున్నారుట.

నో చెప్పేశారా …?

అయితే జగన్ మాత్రం సామాజిక సమీకరణలు, బీజేపీ వారికి ఇచ్చిన హామీలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే ఆశలు ఏవీ పెట్టుకోవద్దు అనేస్తున్నారుట. 2022 జూన్ లో ఖాళీ అయ్యే నాలుగింటిలో విజయసాయిరెడ్డి సీటు కూడా ఉంది. ఆయన్ని జగన్ అసలు కాదనలేరు. దాంతో మరోసారి ఆయన రెన్యూవల్ ఖాయమని అంటున్నారు. మరి రెడ్డి కోటా అలా భర్తీ అయిపోతే వైవీ సుబ్బారెడ్డికి ఎలా ఇస్తారు అన్నదే ఇపుడు చర్చగా ఉందిట. మరో వైపు బీజేపీ చెప్పిన వారికి ఒక పదవి ఇస్తారని, మరో రెండు పదవులు వివిధ సామాజిక వర్గాల నుంచి ఎంపిక చేస్తారని అంటున్నారు. అయితే తాను పార్టీకి చేసిన సేవలకు గానూ రాజ్యసభ ఇస్తే హాయి అన్నది వైవీ సుబ్బారెడ్డి డిమాండ్ గా ఉంది. విజయ‌సాయిరెడ్డిని తప్పించి అయినా ఇవ్వాలని ఆయన కోరినా జగన్ నెరవేర్చకపోవచ్చు అంటున్నారు.

ఎమ్మెల్సీ అయినా…?

మరో వైపు చూసుకుంటే ఏపీలో ఎమ్మెల్సీ పదవులు వైసీపీకే వరసగా దక్కనున్నాయి. అందులో అయినా వైవీ సుబ్బారెడ్డికి చాన్స్ ఉంటుందా అంటే చెప్పలేమనే అంటున్నారు. పైగా ఎమ్మెల్సీ ఇస్తే మంత్రి పదవి ఇవ్వాల్సిందే అని వైవీ సుబ్బారెడ్డి పట్టుబడుతున్నారుట. ప్రకాశం జిల్లాలో ఇప్పటికే బాలినేని శ్రీనివాసులురెడ్డి ఉన్నారు. ఆయన్ని కాదని వైవీకి అక్కడ చాన్స్ రాదు అంటున్నారు. మరి ఏమీ కాకుండా ఏ పదవీ లేకుండా అబ్బాయి పాలనను అలా చూస్తూ వైవీ సుబ్బారెడ్డి గడిపేయాల్సిందేనా అంటే జవాబు అదే వస్తోంది. జగన్ తాను పెట్టుకున్న కొన్ని నియమాలూ నిబంధనల మేరకు సొంత వారు అయినా తగ్గేది లేదు అంటున్నారు. దాంతో బాబాయికి బైబై చెప్పైనా ఆశ్చర్యం లేదన్నదే పార్టీలో వినిపిస్తున్న మాట.

Tags:    

Similar News