ఫ్యాక్ట్ చెక్: టీడీపీ-బీజేపీ-జేఎస్పీ కూటమి ముస్లిం కోటాను రద్దు చేస్తుందని ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి ప్రకటించలేదు.
లోక్‌సభ ఎన్నికలు 2024 ఏప్రిల్ 19, 2024 నుండి ఏడు దశల్లో నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో.. పార్లమెంటరీ, అసెంబ్లీ ఎన్నికలకు ఓటింగ్ మే 13, 2024న నిర్వహించనున్నారు.
లోక్‌సభ ఎన్నికలు 2024 ఏప్రిల్ 19, 2024 నుండి ఏడు దశల్లో నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో.. పార్లమెంటరీ, అసెంబ్లీ ఎన్నికలకు ఓటింగ్ మే 13, 2024న నిర్వహించనున్నారు. ప్రతిపక్ష పార్టీలు టీడీపీ, బీజేపీ జనసేన పొత్తు పెట్టుకుని ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీపై కలిసి పోటీ చేస్తున్నాయి.
ఇదిలా ఉంటే.. కూటమి అధికారంలోకి వచ్చాక ముస్లిం కోటాను తొలగిస్తామని ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి ప్రకటించినట్లు వార్తా పోర్టల్, వే2న్యూస్ కు చెందిన స్క్రీన్‌షాట్‌లు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ ఛానెల్ స్క్రీన్‌షాట్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. కూటమికి వ్యతిరేకంగా పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లింలకు అన్యాయం జరుగుతుందనే వాదనతో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. సర్క్యులేషన్‌లో ఉన్న స్క్రీన్‌షాట్‌లు మార్ఫింగ్ చేశారు. దగ్గుబాటి పురందేశ్వరి అలాంటి ప్రకటన ఏదీ చేయలేదు.
వైరల్ అవుతున్న పోస్టుకు సంబంధించి మరింత సమాచారం కోసం మేము సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను సెర్చ్ చేశాం.. మేము వే2న్యూస్, అలాగే ABN ఆంధ్రజ్యోతి మీడియా సంస్థల ద్వారా అలాంటి వార్తలను ప్రచురించలేదనే పోస్ట్‌లను కనుగొన్నాము. Way2news కూడా “Attention: This is not a Way2news story. Some miscreants have fabricated our format and spreading misinformation.” అంటూ వివరణ ఇచ్చింది. కొంతమంది తమ సంస్థకు సంబంధించిన వార్తా కథనంగా చేసి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేశారని అందులో ఉంది.
తప్పుడు వార్తలను ప్రచారం చేసే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి టీవీ కథనాన్ని కూడా ప్రచురించింది.
దగ్గుబాటి పురంధేశ్వరి కూడా ఈ వైరల్ పోస్టును ఖండిస్తూ పోస్ట్ పెట్టారు. “ఓటమి భయంతో, చీప్ లిక్కర్ అమ్మకం వల్ల వచ్చిన అనుభవంతో ఇలాంటి ఫేక్ ప్రచారాలు, ఫేక్ లేటర్లు సృష్టిస్తున్న బులుగు పార్టీ” అని పురంధేశ్వరి ట్వీట్ చేశారు.
ఈనాడులో ప్రచురితమైన కథనం ప్రకారం.. ఫేక్ న్యూస్‌లను నమ్మవద్దని పురంధేశ్వరి ముస్లిం సమాజానికి విజ్ఞప్తి చేశారు.
ది హిందూ.కామ్ ప్రకారం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి బీజేపీ-టీడీపీ-జనసేన పార్టీ (జెఎస్‌పి) కూటమి అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తానని చెప్పినట్లుగా వచ్చిన నకిలీ వార్తలను ఖండించారు. బీజేపీ నినాదం ‘సబ్ కా సాథ్ సబ్‌కా వికాస్’ అని, పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఇలాంటి ప్రయత్నాలు జరగడం సహజమేనని అన్నారు. ఇలాంటి తప్పుడు వార్తా నివేదికలను నమ్మవద్దని ముస్లిం సమాజానికి ఆమె విజ్ఞప్తి చేశారు.
అధికారం లోకి రాగానే ముస్లిం కోటాను రద్దు చేస్తామని పురంధేశ్వరి ప్రకటన చేశారన్న వాదన అవాస్తవం. ఆమె అలాంటి ప్రకటన చేయలేదు.
Claim : బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ప్రకటించారు.
Claimed By : Social media users
Fact Check : False