ఫ్యాక్ట్ చెక్: చెన్నై మైలాపూర్‌లోని కపాలీశ్వర దేవాలయం చుట్టూ ఓం నమః శివాయ అంటూ స్మరించడాన్ని నిషేధించలేదు.
తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని మైలాపూర్‌లో శివుని పవిత్ర క్షేత్రం ఉంది
కార్తీక మాసం కావడంతో భక్తులు ఆలయాలకు పోటెత్తుతూ ఉన్నారు. ముఖ్యంగా శివాలయాలకు. శివునికి ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం. ఈ మాసంలో భక్తులంతా నిత్యం భోళాశంకరుని నామాన్ని స్మరిస్తూ ఉంటారు. పురాణ కాలంనుంచీ ఈ మాసం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది.ఈ మాసంలో పాఢ్యమి, చవితి, పౌర్ణమి, చతుర్దశి, ఏకాదశి, ద్వాదశి తిధుల్లో శివపార్వతుల అనుగ్రహం కోసం ప్రజలు పూజలు చేస్తుంటారు. దేశం నలుమూలలా ఉన్న వివిధ ఆలయాలలో రుద్రాభిషేకాలు, రుద్రపూజ, లక్ష బిల్వదళాలతో పూజలు, అమ్మవారికి లక్షకుంకుమార్చనలు, విశేషంగా జరుపుతూ ఉంటారు.
తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని మైలాపూర్‌లో శివుని పవిత్ర క్షేత్రం ఉంది. ఈ కపాలీశ్వర దేవాలయాన్ని పల్లవులు నిర్మించారని చెబుతారు. ఈ ఆలయాన్ని కార్తీక మాసంలో చెన్నై నగరంలోని ప్రజలు ఆలయాన్ని దర్శించుకుంటూ ఉంటారు. అయితే ఈ ఆలయం చుట్టుపక్కల ఓం నమశ్శివాయ అంటూ జపించడం శిక్షార్హమైన నేరం అని ఈవో ఉత్తర్వులు జారీ చేశారని సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి.
"ఆలయం లోపల, చుట్టూ ఉన్న వీధుల్లో, "ఓం నమశ్శివాయ" అని బిగ్గరగా జపించడం శిక్షార్హమైన నేరం. శబ్దం చేయకుండా లోపల జపం చేసుకోవాలని చెన్నై తమిళనాడులోని మైలాపూర్ కపాలీశ్వర ఆలయంలో EO ద్వారా ఒక ఉత్తర్వు జారీ చేయబడింది." అంటూ పోస్టులు పెట్టారు. కొందరిని బెదిరించడానికి ఏకంగా పోలీసులను ఆలయంలోకి పిలిపించారు. పోలీసుల తో ప్రజలు వాదిస్తున్నారనే వాదనతో వీడియోను షేర్ చేస్తున్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని తమిళనాడు ఫ్యాక్ట్ చెక్ విభాగం వైరల్ పోస్టు కింద కామెంట్ పెట్టినట్లు మేము గమనించాం.
"Fake news spreading as chanting "om nama shivaya" is restricted in temple
@CMOTamilnadu @TNDIPRNEWS" అంటూ పోస్టు పెట్టారు.
ఇదే ఫ్యాక్ట్ చెక్ పేజీలో నవంబర్ 14న కూడా నిజ నిర్ధారణ చేస్తూ వీడియోను పోస్టు చేశారు. ఇదంతా ఒక బ్యానర్ విషయంలో జరిగిన ఘటన అంటూ తెలిపారు. అంతేకానీ ఓం నమ: శివాయ అంటూ జపించడాన్ని అడ్డుకున్న ఘటన కాదని అన్నారు.
"గత ఏడాది నవంబర్‌లో మైలాపూర్‌లోని ఓ రోడ్డులో బ్యానర్‌ను తొలగించడంపై నిరసన సందర్భంగా ఆలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన కొంతమందిని పోలీసులు అడ్డుకున్నారు." అనే అర్థం వచ్చేలా తమిళంలో పోస్టును పెట్టారు.
ఇక సంబంధిత కీవర్డ్స్ ను ఉపయోగించి ఆలయం చుట్టూ ఏవైనా ఆంక్షలను తీసుకుని వచ్చారా అని తెలుసుకోడానికి ప్రయత్నించాం. కానీ మాకు ఎలాంటి నివేదిక కనిపించలేదు. ఏదైనా ఆలయం అలాంటి ఆంక్షలను విధించి ఉంటే అది ఖచ్చితంగా వార్తల్లో ప్రముఖంగా ఉండేది. వైరల్ పోస్టులు ఫేక్ అని మేము నిర్ధారించాం. ఇంతకు ముందు జరిగిన వాగ్వాదానికి సంబంధించిన వీడియోను మళ్లీ వైరల్ చేస్తున్నారని ధృవీకరించాం.
మేము మరింత క్లారిటీ కోసం మైలాపూర్ కపాలీశ్వర దేవాలయం బోర్డును సంప్రదించాం. తాము ఇలాంటి నిబంధనలను ఏవీ తీసుకుని రాలేదని, తీసుకుని రాబోమని వివరించారు. గత కొద్ది నెలలుగా ఓ వీడియోను వైరల్ చేస్తున్నారని, అది గతేడాది జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో అని ప్రస్తావించారు.
ఆలయం గురించి తప్పుడు కథనాలను ప్రచారం చేసే వారిపై తప్పకుండా పోలీసులను ఆశ్రయిస్తామని, లీగల్ గా చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : చెన్నై మైలాపూర్‌లోని కపాలీశ్వర దేవాలయం చుట్టూ ఓం నమః శివాయ అంటూ స్మరించడాన్ని నిషేధించారు
Claimed By : Social Media Users
Fact Check : False