ఫ్యాక్ట్ చెక్: శబరిమలకు వెళుతున్న భక్తులకు పులి కనిపించిందంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి
కార్తీక మాసం వచ్చిందంటే చాలు భక్తులు అయ్యప్ప మాల ధరించి శబరిమలకు వెళుతూ ఉంటారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయ్యప్ప మాలలు ఎక్కువగా ధరిస్తూ ఉంటారు. నవంబర్ 25న నివేదిక ప్రకారం శబరిమలకు భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తుతున్నారు. మండలం-మకరవిళక్కు సీజన్ తెరిచిన 9 రోజుల్లోనే 6 లక్షలకు పైగా భక్తులు అయ్యప్పను దర్శించుకున్నారు. దేవస్థానానికి ఆదాయం రూ. 41 కోట్లకు పైగా వచ్చిందని ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డ్ (టిడిబి) ప్రెసిడెంట్ పిఎస్ ప్రశాంత్ తెలిపారు. ఈ సీజన్‌లో మొదటి తొమ్మిది రోజులలో ఆలయ ఆదాయం రూ. 41.64 కోట్లకు చేరుకుందని, గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే రూ. 13.37 కోట్లు పెరిగిందని చెప్పారు.
శనివారం వరకు ఆలయాన్ని సందర్శించిన యాత్రికుల సంఖ్య సుమారు 6.12 లక్షలని తెలిపారు. ప్రధాన ప్రసాదాలలో అరవణ విక్రయం ద్వారా రూ.17.71 కోట్లు రాగా, అప్పం విక్రయాల ద్వారా రూ.2.21 కోట్లు ఉన్నాయని సన్నిధానం దేవస్వం బోర్డు అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన తెలిపారు. అయ్యప్ప దర్శనానికి వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. పలు రాష్ట్రాల భక్తులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పలు బృందాలను ఏర్పాటు చేశామన్నారు.
శబరిమలకు భక్తులు నడుచుకుంటూ వెళుతుంటారు. అయితే నడక దారిలో పులి కనిపించిందంటూ ఓ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
"శబరిమలలో సాష్టాత్ అయ్యప్ప స్వామి వాహనం అయినా పులి కనిపించింది." అంటూ ఓ చిరుతపులి నక్కి ఉన్న వీడియో వైరల్ అవుతూ ఉంది.
వైరల్ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ వీడియోకు శబరిమల అయ్యప్ప దర్శనానికి ఎలాంటి సంబంధం లేదని ధృవీకరించాం.
ఇటీవల శబరిమలలో చిరుత కనిపించిందా అనే విషయమై వార్తా కథనాల కోసం వెతికాం. మాకు ఎలాంటి కథనాలు లభించలేదు. ఇక ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డును కూడా చిరుత సంచారం గురించి ప్రశ్నించగా అలాంటిదేమీ జరగలేదని కొట్టిపారేశారు.
ఈ సీజన్‌లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. చిరుతపులి సంచారం గురించి అటవీ అధికారుల నుండి తమకు ఎలాంటి సమాచారం అందలేదని, అలాంటిది ఏదీ జరగలేదని ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు సభ్యుడు తెలుగు పోస్టుకు ధృవీకరించారు. రాత్రి సమయంలో ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ అందించేందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలను KSEB తీసుకుందన్నారు. సన్నిధానం, పంపా, నిలక్కల్‌లో 24 గంటలూ అధికారులు విధుల్లో ఉన్నారని వివరించారు. పంపా నుండి శబరిమలకు భక్తులు నడుచుకుంటూ వెళ్లే అన్ని ప్రాంతాలలో LED లైట్లు ఏర్పాటు చేశామని, వన్యప్రాణుల వల్ల కలిగే విద్యుత్తు ప్రమాదాలను నివారించడానికి నిలక్కల్ నుండి సన్నిధానం వరకు పూర్తిగా ఇన్సులేటింగ్ వైరింగ్ ఉపయోగించామన్నారు.
వైరల్ అవుతున్న వీడియోకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. ఈ వీడియో కొన్ని నెలల కిందట నుండి ఆన్ లైన్ లో వైరల్ అవుతూ ఉందని ధృవీకరించాం. వైరల్ వీడియోలోని వీడియోను పలు సోషల్ మీడియా ఖాతాలలో పోస్టు చేశారు.
𝐉𝐮𝐧𝐠𝐥𝐞 𝐒𝐚𝐟𝐚𝐫𝐢 𝐈𝐧𝐝𝐢𝐚 అనే ఇంస్టాగ్రామ్ పేజీలో ఆగస్టు 9, 2024న వీడియోను అప్లోడ్ చేశారు. గ్రామంలోని ఓ ఇంట్లోకి అతిథి వచ్చారంటూ వీడియోను పోస్టు చేశారు.
Ranthambore National Park అనే ఇంస్టాగ్రామ్ పేజీలో కూడా ఇదే వీడియోను మేము కనుగొన్నాం. ఓ గ్రామంలో చిరుతపులి కనిపించిందంటూ అందులో ప్రస్తావించారు.
Mystery Of Himalayas అనే ఫేస్బుక్ పేజీలో సెప్టెంబర్ 25, 2024న వైరల్ వీడియోను పోస్టు చేశారని కూడా గుర్తించాం.
ఈ సోషల్ మీడియా పోస్టుల్లో ఎక్కడా కూడా చిరుతపులి కనిపించిన వీడియోకు సంబంధించిన లొకేషన్ గురించి ప్రస్తావించలేదు. సంబంధిత పేజీలకు మేము మరిన్ని వివరాల కోసం మెసేజీ కూడా చేశాం. వారు వివరణ ఇవ్వగానే అప్డేట్ చేస్తాం.
అయితే ఈ వీడియోకు శబరిమలకు సంబంధం లేదని ధృవీకరించగలిగాం. వీడియో ఏ ప్రాంతంలో నుండి తీశారో మేము స్వతంత్రంగా ధృవీకరించలేకపోయాం. కానీ ఇటీవలి మండలం-మకరవిళక్కు సీజన్ మొదలవ్వడానికి కొన్ని నెలల ముందే ఈ వీడియో సోషల్ మీడియాలో అందుబాటులో ఉంది.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : శబరిమల వెళుతున్న భక్తులకు ఇటీవల చిరుతపులి కనిపించింది
Claimed By : Social Media Users
Fact Check : False