ఫ్యాక్ట్ చెక్: ముంబై లోని సిద్ధి వినాయక ఆలయం భూమిపై హక్కులు తమవేనని వక్ఫ్ బోర్డు ప్రకటించలేదు
ముంబై లోని సిద్ధి వినాయక ఆలయం భూమిపై హక్కులు
భారతదేశంలోని పలు రాష్ట్రాలలో వక్ఫ్ భూములకు సంబంధించి చర్చ జరుగుతూ ఉంది. పలువురు రాజకీయ నాయకులు కూడా దీనిపై కీలక ప్రకటనలు చేస్తున్నారు. కొన్ని రాష్ట్రాలలో రైతుల భూములు వక్ఫ్ బోర్డు కిందకు వస్తాయంటూ నోటీసులు వెళ్లడం కూడా సంచలనంగా మారింది. దీనిపై నిరసనలకు కూడా దిగారు రైతులు.
సెప్టెంబరు నెలలో గురుగ్రామ్‌లో జరిగిన ర్యాలీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ వక్ఫ్ (సవరణ) బిల్లు- 2024 పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఆమోదించబడుతుందని ప్రకటించారు. ఆయన ప్రకటన వెంటనే మైనారిటీ వర్గం, ప్రతిపక్ష నాయకులలో ఆగ్రహాన్ని రేకెత్తించింది. ముస్లిం సమాజం హక్కులను కాలరాసే ప్రయత్నం అంటూ ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించాయి.
కర్నాటకలో దేవాలయాలతో సహా, ASI రక్షిత స్థలాలపై వక్ఫ్ బోర్డు హక్కులు ఉన్నాయని చెబుతున్నారు. కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో 400 ఎకరాలకు పైగా వక్ఫ్ భూమి ఉందని అందులో చర్చిలు, 600 క్రిస్టియన్ కుటుంబాలు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఇలా ఓ వైపు ఆందోళనలు కొనసాగుతూ ఉండగా.. ముంబై నగరంలోని ప్రముఖ సిద్ధి వినాయక ఆలయం కూడా వక్ఫ్ భూములకు చెందుతుందనే సోషల్ మీడియా పోస్టు వైరల్ అవుతూ ఉంది.
వినాయక చవితి సందర్భంగా సిద్ధి వినాయకుడిని దర్శనం చేసుకోవడం కోసం దేశ విదేశాల నుండి భక్తులు వస్తూ ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వం కొద్దిరోజుల కిందట శ్రీ సిద్ధివినాయక గణపతి ఆలయ ట్రస్ట్ (SSGT)కి కొత్తగా నియామకాలు కూడా చేసింది. SSGTలో ఆఫీస్ బేరర్లుగా పవన్ కుమార్ త్రిపాఠి కోశాధికారిగా, మీనా కాంబ్లీ, రాహుల్ లోంధే, గోపాల్ దాల్వీ ట్రస్టీలుగా నియమితులయ్యారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ నియామకాలు జరిగాయి. అయితే సిద్ధి వినాయక ఆలయం వక్ఫ్ భూములకు చెందుతుందని.. హిందువులు మేలుకోవాలంటూ సోషల్ మీడియా పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి.
వైరల్ పోస్టుకు సంబంధించిన క్లెయిమ్ ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎలాంటి నిజం లేదని మేము నిర్ధారించాం.
వైరల్ పోస్టుల కింద కామెంట్స్ ను మేము పరిశీలించాం. అందులో చాలా మంది ఫేక్, ఫేక్ న్యూస్ అంటూ కామెంట్లు పెట్టారు.
మేము సంబంధిత కీవర్డ్ సెర్చ్ చేయగా శ్రీ సిద్ధివినాయక దేవాలయం సొసైటీ కోశాధికారి పవన్ త్రిపాఠి చేసిన ప్రకటనను మేము గుర్తించాం.
సిద్ధివినాయక మందిరంపై వక్ఫ్ బోర్డు ఎలాంటి ప్రకటన చేయలేదని పవన్ త్రిపాఠి తెలిపారు. ఆలయంపై ఎవరూ యాజమాన్యాన్ని క్లెయిమ్ చేయలేరని ప్రకటించారు. భారతదేశంలోని ప్రముఖ హిందూ మందిరాలలో ఒకటైన సిద్ధివినాయక ఆలయంపై వక్ఫ్ బోర్డు ఎటువంటి వాదనలు చేసే అవకాశం కూడా లేదని త్రిపాఠి భక్తులకు హామీ ఇచ్చారు. “సిద్ధివినాయక ఆలయం ముంబైకి కేవలం మతపరమైన ప్రదేశం మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు ఇది అపారమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇది ముంబై, మహారాష్ట్రలకు గర్వకారణం. ఈ ఆలయంపై ఎవరూ ఎలాంటి దావా వేయలేరు" అని త్రిపాఠి తెలిపారు.
ముంబైలోని సిద్ధివినాయక దేవాలయంపై వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేసిందని పేర్కొంటూ మిస్టర్ సిన్హా అనే వినియోగదారు చేసిన ఎక్స్ పోస్ట్ పై శివసేన UBT నాయకుడు ఆదిత్య థాకరే ఆగ్రహం వ్యక్తం చేశారు. "ఇనఫ్ ఈజ్ ఇనఫ్! చేయి దాటిపోతున్నాయి. వాటిని ఆపాలి..." అంటూ పోస్టు పెట్టారు. నకిలీ వార్తలను వ్యాప్తి చేసినందుకు వినియోగదారుడిపై ధ్వజమెత్తారు. మహారాష్ట్రలో ద్వేషాన్ని వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తున్న వినియోగదారుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆదిత్య థాకరే ECI, ముంబై పోలీసులను ట్యాగ్ చేశారు.
బీజేపీ పర్యావరణ వ్యవస్థ మనస్తత్వం ఇదని.. విభజించి పాలించాలని ప్రయత్నిస్తున్నారని ఆదిత్య విమర్శించారు. అబద్ధాలు చెప్పి గెలవడానికి ప్రయత్నిస్తారని , విద్వేషాలను సృష్టించేవారిని, మహారాష్ట్రను ద్వేషించేవారిని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ముంబై పోలీసులు చర్యలు తీసుకొని అరెస్టు చేస్తారా లేదా అని ప్రశ్నించారు. మా మనోభావాలు, భావోద్వేగాలతో ఆడుకోకండని ఆదిత్య థాకరే తన పోస్ట్‌లో రాశారు.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : ముంబై లోని సిద్ధి వినాయక ఆలయం భూమిపై హక్కులు తమవేనని వక్ఫ్ బోర్డు ప్రకటించింది
Claimed By : Social Media Users
Fact Check : False