ఫ్యాక్ట్ చెక్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నూతన సంవత్సరం సందర్భంగా ఉచితంగా రీఛార్జ్ ను ఇవ్వలేదు

వినియోగదారుల డేటాను దొంగిలించడం కోసం కొత్త కొత్త ఐడియాలతో;

Update: 2025-01-15 15:48 GMT

వినియోగదారుల డేటాను దొంగిలించడం కోసం కొత్త కొత్త ఐడియాలతో కేటుగాళ్లు ముందుకు వస్తూ ఉంటారు. ఇలాంటి మోసాలపై ప్రభుత్వం, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న మిలియన్ల మంది మొబైల్ వినియోగదారులకు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంటుంది. ఉచిత రీఛార్జ్ ఆఫర్లకు సంబంధించి ఎన్నో మోసాలు జరుగుతూ ఉన్నాయని, వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

మీరు వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగిస్తుంటే మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ వేదికల ద్వారా ప్రజలను మోసం చేస్తున్నారు. వాట్సాప్‌లో కూడా చాలా స్కామ్‌లు జరుగుతూ ఉన్నాయి. వాట్సాప్ ప్రతి ఒక్కరి మొబైల్ లో భాగమవ్వడంతో సైబర్ నేరగాళ్లకు లక్ష్యంగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన-బీజేపీ-టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఆయన పేరు మీద నూతన సంవత్సరం కానుకగా ప్రతి ఒక్కరికీ 3 నెలల రీఛార్జ్ ఇస్తున్నారంటూ పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి. 749 రూపాయల రీఛార్జ్ ఉచితమని వాట్సాప్ లో ఓ మెసేజీ వైరల్ అవుతూ ఉంది.

" న్యూ ఇయర్ రీఛార్జ్ ఆఫర్
నూతన సంవత్సరం సందర్భంగా (నారా చంద్రబాబు నాయుడు) ప్రతి ఒక్కరికీ 3 నెలల రీఛార్జ్ ₹749 పూర్తిగా ఉచితంగా ఇస్తున్నారు. కాబట్టి క్రింద ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా ఇప్పుడే రీఛార్జ్‌ని పొందండి.
ఈ ఆఫర్ పరిమిత కాలానికి మాత్రమే |
https://new-year25.blogspot.com/" అంటూ పోస్టులు పెట్టారు.

వైరల్ మెసేజీకి సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు.



 



ఫేస్ బుక్ లో కూడా ఈ పోస్టులు వైరల్ అవుతున్నాయి.

Full View


Full View

ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాంటి ప్రకటన ఏదీ చేయలేదు.

మేము సంబంధిత కీవర్డ్స్ ను ఉపయోగించి వెతికాము. అయితే ఏపీ సీఎం అలాంటి ప్రకటన ఏదీ చేయలేదని తెలుసుకున్నాం. ఇలాంటి ఆఫర్ ప్రకటించి ఉంటే అది తప్పకుండా వార్తల్లో నిలిచి ఉండేది.

ఈ వైరల్ పోస్టు నిజం కాదంటూ ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ టీమ్ ట్విట్టర్ లో ఈ మోసపూరిత ఆఫర్ ను నమ్మకండని వివరణ ఇచ్చింది. "ఇటువంటి మోసపూరిత ఆఫర్ల గురించి ప్రభుత్వం ఎప్పుడూ ప్రకటన చేయదు. విష ప్రచారం నమ్మొద్దు. ఇటువంటి ఫేక్ లింకులు క్లిక్ చేస్తే సైబర్ మోసాల బారిన పడతారు." అంటూ హెచ్చరించింది.




ఈ వైరల్ మెసేజీ పలు జిల్లాల్లో కూడా వైరల్ అవ్వడంతో పోలీసులు ఖండిస్తూ వివరణ ఇచ్చారు. ఆ విషయాన్ని పలు మీడియా సంస్థలు కూడా కథనాలుగా ప్రసారం చేశాయి. వాటిని
ఇక్కడ
, ఇక్కడ చూడొచ్చు.



ఇదే తరహా మెసేజీలు ఇటీవల తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కూడా వైరల్ అయ్యాయి. అక్కడి సీఎంలు మూడు నెలల పాటూ ఉచితంగా రీఛార్జ్ ను అందిస్తూ ఉన్నారంటూ కథనాలు వచ్చాయి. వాటిలో ఎలాంటి నిజం లేదని ఫ్యాక్ట్ చెక్ సంస్థలు, ప్రభుత్వం ఖండించాయి.

వాటిని ఇక్కడ చూడొచ్చు.



కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పేరు మీద కూడా ఇదే తరహాలో రీఛార్జ్ మెసేజీ వైరల్ అయింది.


ఈ స్కామ్‌లు పండుగల సమయంలో ప్రజలను మోసం చేయడానికి ప్రత్యేకంగా సృష్టిస్తారు. మంచి ఆఫర్‌లతో ప్రజలను ఆకర్షించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ రకమైన ఫిషింగ్ స్కామ్‌లో భాగంగా మోసగాళ్లు నకిలీ ఆఫర్‌లు లేదా ప్రమోషన్‌లను సృష్టిస్తారు. తరచుగా ప్రసిద్ధ వ్యక్తులు, సంస్థల పేర్లను ఉపయోగిస్తారు. అలాంటి హానికరమైన లింక్‌లపై క్లిక్ చేసేలా ప్రజలను ప్రేరేపిస్తారు.

ఈ లింక్‌ల ద్వారా లాగిన్ వివరాలు, మీ ఆర్థిక వివరాలు వంటి వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించేలా ప్రణాళిక రచించారు. బాధితుల ఎలక్ట్రానిక్ డివైజ్ లలో మాల్వేర్‌ను కూడా ఇన్‌స్టాల్ చేయవచ్చు. కొన్ని కొన్ని సార్లు బాధితులకు తెలియకుండానే డబ్బులు పంపించేలా అనుమతులను ఈ మాల్వేర్ ఇచ్చేస్తుంది. కాబట్టి, ఇలాంటి లింక్ లపై క్లిక్ చేయకూడదని అధికారులు సూచిస్తూ ఉన్నారు.

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నూతన సంవత్సరం సందర్భంగా 3 నెలల రీఛార్జ్ ఉచితంగా ఇస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు.


Claim :  మీ డేటాను దొంగిలించడానికి కొందరు చేస్తున్న మోసంలో ఇదీ భాగం
Claimed By :  Social Media Users
Fact Check :  False
Tags:    

Similar News