ఫ్యాక్ట్ చెక్: ప్రధాని నరేంద్ర మోదీ తమ్ముడు ఆటో నడుపుతూ ఉన్నారంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎలాంటి నిజం లేదు
ప్రధాని నరేంద్ర మోదీని పోలి ఉన్న ఆటో-రిక్షా డ్రైవర్ చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ
ప్రధాని నరేంద్ర మోదీని పోలి ఉన్న ఆటో-రిక్షా డ్రైవర్ కు సంబంధించిన చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. అతడు ఏకంగా ప్రధాని మోదీ తమ్ముడు అనే వాదనతో ఫోటోను షేర్ చేస్తున్నారు.
అనేక మంది సోషల్ మీడియా వినియోగదారులు, పలు సోషల్ మీడియా పేజీలు హిందీ క్యాప్షన్‌తో ఈ చిత్రాన్ని పంచుకుంటున్నాయి. ప్రధానిగా ఉన్నా కూడా ఆయన సోదరుడు ఆటో రిక్షా డ్రైవర్ గా పని చేస్తున్నారంటూ ప్రచారం చేస్తూ ఉన్నారు. "దేశాన్ని నడిపించే వ్యక్తికి సెల్యూట్ చేయాల్సిన అవసరం ఉంది, ఆయన తమ్ముడు ఆటో రిక్షా డ్రైవర్‌గా కొనసాగుతున్నాడు." అనే వాదనతో ఫోటోను వైరల్ చేస్తున్నాడు. ఈ ఆటో రిక్షా డ్రైవర్ ఫోటో చాలా కాలంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉండడం గమనించదగ్గ విషయం.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. అతడు తెలంగాణ వాసి.
మోదీలా కనిపిస్తున్న వ్యక్తిని తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాకు చెందిన అయూబ్‌గా గుర్తించారు. అతడి ఫోటో 2016 నుండి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. అతడి ఫోటో చుట్టూ జరుగుతున్న వాదనను.. వివిధ మీడియా సంస్థలు ఇప్పటికే తిరస్కరించాయి. నవభారత్ టైమ్స్ లాంటి ప్రముఖ వెబ్ సైట్స్ కూడా ఈ వాదనను ఖండిస్తూ కథనాలను ప్రసారం చేశాయి.
అయూబ్ 1998లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC)లో కాంట్రాక్ట్ డ్రైవర్‌గా పనిచేశారు. అయితే, కొన్ని సంవత్సరాల తర్వాత అతను ఉద్యోగాన్ని కోల్పోయాడు. అయూబ్ లారీ డ్రైవర్‌గా, ఆటో రిక్షా డ్రైవర్‌గా పని చేస్తూ వచ్చాడు. 2014లో, ఆదిలాబాద్ బస్ డిపోలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) డ్రైవర్‌గా ఉద్యోగాన్ని పొందారు.
ప్రధాని నరేంద్ర మోదీ తోబుట్టువుల్లో ఎవరూ ఆటో రిక్షాను నడపడం లేదు. ప్రధాని మోదీకి ముగ్గురు సోదరులు ఉన్నారు. సోంభాయ్ మోదీ, అమృత్ మోదీ, ప్రహ్లాద్ మోదీ. ఇండియా టుడేలో వచ్చిన కథనం ప్రకారం.. సోంభాయ్ గుజరాత్‌లోని వాద్‌నగర్‌లో వృద్ధాశ్రమాన్ని నిర్వహిస్తుండగా, అమృత్ మోదీ ఒక ప్రైవేట్ కంపెనీలో ఫిట్టర్‌గా పనిచేశారు, నలుగురు సోదరులలో చిన్నవాడైన ప్రహ్లాద్ మోదీకి ఓ దుకాణం ఉంది.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. చిత్రంలో ప్రధాని నరేంద్ర మోదీని పోలిన వ్యక్తి ఆయన కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కాదు. అతని ఫోటోను డిజిటల్‌గా ఎడిట్ చేయలేదు. తెలంగాణకు చెందిన ఓ డ్రైవర్ ఆయన.
Claim : A widely circulated image of an auto-rickshaw driver bearing a striking resemblance to Prime Minister Narendra Modi is creating buzz on social media, accompanied by a claim that he is Modi's younger brother
Claimed By : Social media users
Fact Check : False