ఫ్యాక్ట్ చెక్: రాహుల్ గాంధీ ర్యాలీలో పాకిస్థాన్ కు మద్దతుగా నినాదాలంటూ వైరల్ అవుతున్న వీడియో పాతది
మధ్యప్రదేశ్ లో రాహుల్ ప్రోగ్రామ్ లో భాగంగా ఒక కాంగ్రెస్ MLA పాకిస్థాన్ జిందాబాద్ అంటుండగా
దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి అనుకున్నంత మెజారిటీ రాకపోయినప్పటికీ.. జేడీయూ, టీడీపీ ఎంపీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. కాంగ్రెస్ పార్టీ ఉన్న ఇండియా కూటమి ఊహించిన దానికంటే మెరుగ్గా రాణించింది.
ఇక లోక్‌సభలో విపక్ష నేతగా రాహుల్‌గాంధీ బాధ్యతలు చేపట్టాలంటూ ఇటీవల ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. మరో వైపు రాహుల్ గాంధీకి సంబంధించి పలు తప్పుడు కథనాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.
తాజాగా "మధ్యప్రదేశ్ లో రాహుల్ ప్రోగ్రామ్ లో భాగంగా ఒక కాంగ్రెస్ MLA చేసిన పాకిస్తాన్ జిందాబాద్ నినాదాన్ని ఆపబోయిన పోలీస్ తో వాళ్ల అనుచిత ప్రవర్తన చూడండి..." అంటూ ఓ వీడియో వైరల్ అవుతూ ఉంది. తెలుగు పోస్ట్ కు ఈ వీడియోను ఫాలోవర్స్ వాట్సాప్ ద్వారా పంపించారు.
ఈ వీడియోను 2023లో కూడా ఇదే వాదనతో వైరల్ చేశారు.
వీడియోను నిశితంగా పరిశీలించాం.. అందులో పోలీసులను కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న ఓ వ్యక్తి దూషణకు దిగడం గమనించాం. అక్కడే ఉన్న వ్యక్తులు పోలీసులను చుట్టుముట్టగా.. కాంగ్రెస్ నాయకుడు చేతులతో పోలీసు అధికారులను తోస్తూ ఉండడాన్ని వీడియోలో చూడొచ్చు. కాంగ్రెస్ నేత పోలీసులను బహిరంగంగా బెదిరించారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
ఈ ఘటన మధ్య ప్రదేశ్ లో చోటు చేసుకోలేదని.. వీడియోలో పాకిస్థాన్ కు మద్దతుగా నినాదాలు చేయలేదని స్పష్టంగా తెలుస్తోంది.
వైరల్ వీడియోకు సంబంధించిన స్క్రీన్ గ్రాబ్ ను గూగుల్ లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. అందులో ఉన్నది ఢిల్లీకి చెందిన కాంగ్రెస్ నేత ఆసిఫ్ మొహమ్మద్ ఖాన్ అని స్పష్టంగా తెలుస్తోంది.
'ఆసిఫ్ మొహమ్మద్ ఖాన్' అనే కీవర్డ్స్ ను ఉపయోగించి గూగుల్ సెర్చ్ చేయగా ఆయనకు సంబంధించిన పలు వార్తా కథనాలు మాకు కనిపించాయి. వైరల్ వీడియోకు పోలిన స్క్రీన్ షాట్స్ తో పలు వార్తా కథనాలను నవంబర్, 2022లో మేము గుర్తించాం.
ఢిల్లీ లోని షాహీన్ బాగ్ ప్రాంతంలో పోలీసులను దుర్భాషలాడడం, దురుసుగా ప్రవర్తించడం, అసభ్యంగా ప్రవర్తించినందుకు కాంగ్రెస్ మాజీ శాసనసభ్యుడు ఆసిఫ్ మహ్మద్ ఖాన్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారని నివేదికల్లో చూశాం. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD) ఎన్నికలకు ముందు ఈ ఘటన చోటు చేసుకుంది.
అప్పట్లో ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. డ్యూటీలో ఉన్న సబ్ ఇన్‌స్పెక్టర్ అక్షయ్ తో మాజీ ఎమ్మెల్యే ఆసిఫ్ ఖాన్ మాత్రమే కాకుండా అతని మద్దతుదారులు కూడా అనుచితంగా ప్రవర్తించడాన్ని వీడియోలో చూడవచ్చు. మాజీ ఎమ్మెల్యే ప్రసంగాన్ని కుదించమని పోలీసులు కోరగా.. వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసిఫ్ మహ్మద్ ఖాన్ మద్దతుదారుల ప్రతిఘటన కారణంగా పోలీసు అక్కడి నుండి వెళ్లిపోతుండగా, మాజీ ఎమ్మెల్యే పోలీసులపై దుర్భాషలాడడం కెమెరాలో రికార్డు అయింది.
పోలీసులు వెళ్ళిపోతూ ఉండగా మాజీ ఎమ్మెల్యే అనుచరులు 'ఆసిఫ్ ఖాన్ జిందాబాద్.. ఆసిఫ్ ఖాన్ జిందాబాద్' అంటూ నినాదాలు చేశారు. వివిధ మీడియా సంస్థలు అప్లోడ్ చేసిన వీడియోలను నిశితంగా పరిశీలించాం. ఎక్కడా కూడా పాకిస్థాన్ కు మద్దతుగా నినాదాలు వినలేదు. వైరల్ అవుతున్న వీడియోలో 'ఆసిఫ్ ఖాన్ జిందాబాద్' అని అంటున్నారని స్పష్టంగా తెలుస్తోంది.
ఈ ఘటనకు సంబంధించి వచ్చిన మీడియా కథనాలలో కూడా ఎక్కడా పాకిస్థాన్ మద్దతుగా ఆసిఫ్ ఖాన్, ఆయన అనుచరులు నినాదాలు చేశారని ఎవరూ నివేదించలేదు. ఆసిఫ్ ఖాన్ పోలీసులతో దురుసుగా ప్రవర్తించారని, దుర్భాషలాడారని మీడియా సంస్థలు తెలిపాయి. ఈ ఘటన తర్వాత ఆసిఫ్ ఖాన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. బెయిల్ పై కూడా విడుదలయ్యారు.
"Congress Leader Asif Muhammad Khan Heckles A Cop, Gets Arrested From Shaheen Bagh | Times Now" అనే టైటిల్ తో టైమ్స్ నౌ మీడియా సంస్థ ఈ ఘటనను నివేదించింది.
ఇండియా టీవీ న్యూస్ సీనియర్ ఎడిటర్ అని బయోలో ఉన్న అభయ్ @abhayparashar ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోను నవంబర్ 25, 2022న అప్లోడ్ చేశారు. అందులో కూడా 'ఆసిఫ్ ఖాన్ జిందాబాద్' అనే నినాదాలను మేము గుర్తించాం.
బీజేపీ నేత తాజిందర్ బగ్గా ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసి.. ఢిల్లీ పోలీసులు ఆసిఫ్ ఖాన్ పై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేశారు.
వీటన్నిటినీ పరిగణలోకి తీసుకున్న తర్వాత వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకున్నది కాదు.. ఢిల్లీలో 2022లో జరిగిన ఘటన. పాకిస్థాన్ కు మద్దతుగా నినాదాలు చేయలేదు.. ఢిల్లీ మాజీ ఎమ్మెల్యే ఆసిఫ్ ఖాన్ కు మద్దతుగా నినాదాలు చేశారు.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉంది.
Claim : మధ్యప్రదేశ్ లో రాహుల్ ప్రోగ్రామ్ లో భాగంగా ఒక కాంగ్రెస్ MLA పాకిస్థాన్ జిందాబాద్ అంటుండగా.. ఆపబోయిన పోలీస్ తో అనుచితంగా ప్రవర్తించారు.
Claimed By : Social Media Users
Fact Check : False