ఫ్యాక్ట్ చెక్: కేటీఆర్ మాట్లాడుతూ ఉండగా 'గో బ్యాక్' అంటూ ప్రజలు నినాదాలు చేసినట్లుగా వీడియోను ఎడిట్ చేశారు
కేటీఆర్ మాట్లాడుతూ ఉండగా ప్రజలు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు;
ఇటీవల సిరిసిల్లలో జరిగిన సమావేశంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) నాయకుడు కేటీఆర్ రామారావు (కేటీఆర్) ఐపీఎస్ అధికారులపై చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల సంఘాలు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేయడమే కాకుండా.. చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని పిలుపునిచ్చాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఐఏఎస్ అధికారి సందీప్ కుమార్ ఝా కాంగ్రెస్ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. అధికార పార్టీని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న కలెక్టర్లకు తమ పార్టీ మళ్లీ అధికారంలోకి రాగానే ‘వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాం’ అని హెచ్చరించారు.
KTR వ్యాఖ్యలపై నవంబర్ 28, గురువారం నాడు తెలంగాణ IPS సంఘం స్పందించింది.ఒక సర్వీసింగ్ సివిల్ సర్వెంట్‌పై అవమానకరమైన, నిరాధార ఆరోపణలను ఖండిస్తూ ఐపీఎస్ సంఘం ఒక ప్రకటనను విడుదల చేసింది. ఈ తరహా వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమైనవని, ప్రజాస్వామ్య సంస్థలకు హానికరమని ఐపీఎస్ సంఘం తెలిపింది.
మరో వైపు కేటీఆర్ మాట్లాడుతూ ఉండగా 'గో బ్యాక్ కేటీఆర్' అంటూ వాయిస్ వినిపించే వీడియో ఒకటి వైరల్ అవుతూ ఉంది.
"💥కేటీఆర్ కు నిరసన సెగ...
కేటీఆర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేసిన ప్రజలు.." అంటూ పోస్టులు పెట్టారు.
"మహబూబాబాద్ బీఆర్ఎస్ పార్టీ ధర్నాలో కేటీఆర్ కు నిరసన సెగ
*గో బ్యాక్ కేటీఆర్ అంటూ నినాదాలు*
*🤔🤔ఎంతపనైంది టిళ్ళూ....?!* " అంటూ ఇంకో అకౌంట్ లో పోస్టు పెట్టారు.
వైరల్ వీడియోకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ వీడియోను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఒరిజినల్ వీడియోలో కేటీఆర్ కు వ్యతిరేకంగా ఎలాంటి నినాదాలు చేయలేదు.
వైరల్ పోస్టు కింద కామెంట్స్ సెక్షన్ లో ఒరిజినల్ వీడియో-ఫేక్ వీడియో అంటూ కామెంట్ పెట్టడాన్ని మేము గుర్తించాం.
ఈ వీడియోలో అసలు వీడియోకు, ఫేక్ వీడియోకు మధ్య తేడాలను మనం గమనించవచ్చు.
వైరల్ వీడియోలోని కీ ఫ్రేమ్స్ ను తీసుకుని మేము గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. కేటీఆర్ లగచెర్ల ఘటనపై బహిరంగ సభలో మాట్లాడారు.
యూట్యూబ్ వీడియోలో వైరల్ విజువల్స్ ఉన్నాయని గుర్తించాం.
కేటీఆర్ ఫుల్ స్పీచ్ ఈ వీడియోలో మీరు చూడొచ్చు. ఎక్కడా కూడా కేటీఆర్ గో బ్యాక్ అంటూ ప్రజలు నినాదాలు చేయలేదని గుర్తించాం.
కేటీఆర్ గో బ్యాక్ అంటూ ప్రజలు నినాదాలు చేసి ఉంటే అది తప్పకుండా వార్తల్లో వచ్చి ఉండేది. కానీ మాకు అలాంటి నివేదికలు ఏవీ కనిపించలేదు.
ఇక కేటీఆర్ గోబ్యాక్ అంటూ జరిగిన ఘటన ఫిబ్రవరి 27, 2024న చోటు చేసుకుంది. అంబర్ పేటలో కాంగ్రెస్ కార్యకర్తలు కేటీఆర్ కాన్వాయ్ ను అడ్డుకోడానికి ప్రయత్నించారు.
ఈ వీడియో లోని ఆడియోను తీసి వైరల్ వీడియోలో ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. వైరల్ వీడియోను రెండు వీడియోలను ఉపయోగించి తయారు చేశారు. దాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. గతంలో ఇలాంటి ఎడిటెడ్ వీడియోలను తెలుగుపోస్టు ఫ్యాక్ట్ చెక్ చేసి నివేదికలను అందించింది. ఇప్పుడు మరో అలాంటి వీడియోనే సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కేటీఆర్ కు మద్దతుగా పలువురు నినాదాలు చేశారు తప్పితే ఈ సభలో కేటీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేయలేదని మేము ధృవీకరిస్తున్నాం.
ఈ ఘటనపై ఫ్యాక్ట్లీ ఫ్యాక్ట్ చెక్ చేసి ఎలాంటి నిజం లేదని తేల్చింది.
కాబట్టి, వైరల్ వీడియోను ఎడిట్ చేశారు. కేటీఆర్ ను వెనక్కు వెళ్లిపోవాలంటూ ఆయన బహిరంగ సభలో మాట్లాడుతున్నప్పుడు ప్రజలు డిమాండ్ చేయలేదు. ఒక వీడియోకు సంబంధించిన ఆడియోను మరో వీడియోకు అతికించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అలాంటి ఘటన ఏదీ ఈ సభలో జరగలేదు.
Claim : బీఆర్ఎస్ సీనియర్ నేత కేటీఆర్ మాట్లాడుతూ ఉండగా ప్రజలు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు
Claimed By : Social Media Users
Fact Check : Misleading