ఫ్యాక్ట్ చెక్: కేరళ బీజేపీ ఎంపీ సురేష్ గోపి కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయలేదు
మలయాళ చిత్రసీమలో ప్రముఖుడైన సురేష్ గోపి 2024 ఎన్నికల్లో త్రిసూర్ నుంచి 75,000 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2019 లోక్‌సభ, 2021 అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత సురేష్ గోపీ ఈ ఎన్నికల్లో గొప్ప విజయం సాధించారు.
జూన్ 9, 2024, ఆదివారం నాడు ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సురేష్ గోపి తన ప్రమాణ స్వీకారోత్సవం జరిగిన వెంటనే మంత్రిత్వ శాఖకు రాజీనామా చేయాలనుకుంటున్నట్లు పేర్కొంటూ ఒక సందేశం ప్రచారంలో ఉంది.
“गजब मजाक बना रखा है. कल BJP सांसद सुरेश गोपी ने मंत्री पद की शपथ ली. अब पद छोड़ने की बात कह रहे हैं.” అంటూ హిందీలో పోస్టులు వైరల్ చేస్తున్నారు. “ఇది ఎంత అద్భుతమైన జోక్. నిన్న బీజేపీ ఎంపీ సురేష్ గోపీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు ఆ పదవికి రాజీనామా చేస్తానని అంటున్నారు." అంటూ పోస్టులను వైరల్ చేస్తున్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఈ వాదనను స్వయంగా సురేష్ గోపీ ఖండించారు.
ఈ క్లెయిమ్‌లపై మరింత సమాచారం కోసం మేము శోధించినప్పుడు. మేము సురేష్ గోపీ సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్ట్‌ను కనుగొన్నాము, “నేను నరేంద్ర మోదీ ప్రభుత్వ మంత్రిమండలికి రాజీనామా చేయబోతున్నానని కొన్ని మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నాయి. ఇది పూర్తిగా తప్పు. ప్రధానమంత్రి @narendramodiJi నాయకత్వంలో కేరళ అభివృద్ధి, శ్రేయస్సు కోసం కట్టుబడి ఉన్నాము." అని అందులో తెలిపారు.
ఇండియా టుడే కథనం ప్రకారం, పోర్ట్‌ఫోలియో కేటాయింపు తర్వాత సురేష్ గోపీ అందుకు సంబంధించిన ఒక వివరణ ఇచ్చారు. మీడియాలోని ఒక నిర్దిష్ట వర్గం ద్వారా అసత్య కథనాలను ప్రసారం చేస్తున్నారని ఆయన తెలిపారు. ‘కొన్ని మీడియా సంస్థలు తాను కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నానంటూ తప్పుడు వార్తను ప్రచారంలోకి తెచ్చాయి. అది పూర్తిగా అబద్ధం. ప్రధాని మోదీ నాయకత్వంలో కేరళ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని తాము కృతనిశ్చయంతో ఉన్నాం’ అని సురేష్ గోపి తెలిపారు.
హిందుస్థాన్ టైమ్స్ నివేదిక ప్రకారం కేరళ బీజేపీ అధ్యక్షుడు కే సురేంద్రన్ ఈ వార్తలను ‘ఫేక్ న్యూస్’ అని కొట్టిపారేశారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడిన కే. సురేంద్రన్ బీజేపీ రాష్ట్ర విభాగానికి వ్యతిరేకంగా ఒక వర్గం జర్నలిస్టులు తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
బీజేపీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కేరళ ఎంపీ సురేష్ గోపీ తన మంత్రి పదవికి రాజీనామా చేయాలనుకుంటున్నారనే వాదన అవాస్తవం. ఆయన స్వయంగా ఈ వదంతులను కొట్టి పడేశారు. ఆయన పర్యాటక మంత్రిత్వ శాఖ, పెట్రోలియం-సహజ వాయువు మంత్రిత్వ శాఖల సహాయ మంత్రి గా విధుల్లో చేరారు.
Claim : మళయాళ నటుడు, బిజేపి నేత సురేశ్ గోపీ కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాజీనామా చేయాలనుకుంటున్నారు
Claimed By : Twitter users
Fact Check : False