ఫ్యాక్ట్ చెక్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్డీయే నేతలపై ఆగ్రహం వ్యక్తం చేయలేదు
బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ) అధినేత నరేంద్ర మోడీ భారత ప్రధానిగా వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ మెజారిటీకి దూరం కాగా.. ఏపీలో కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం పార్టీ,
బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ) అధినేత నరేంద్ర మోడీ భారత ప్రధానిగా వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ మెజారిటీకి దూరం కాగా.. ఏపీలో కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కలిసి 21 లోక్‌సభ స్థానాలను గెలుచుకున్నాయి. ఇది కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు చాలా కీలకమైంది. జూన్ 12, 2024న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి భారత ప్రధాని మోదీ కూడా హాజరయ్యారు. రెండు ప్రమాణస్వీకారోత్సవాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా సాఫీగా పూర్తయ్యాయి.
ఇదిలావుండగా.. మోదీ ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు ఎన్డీయే నేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చంద్రబాబు నాయుడు వెళ్లిపోతున్నారనే వాదనతో ఓ వీడియో వైరల్ అవుతూ ఉంది.
ఈ వీడియో హిందీలో "ప్రమాణానికి ముందే NDA కూటమిపై చంద్రబాబు నాయుడు కోపంగా ఉన్నారు" అంటూ ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు. తనకు మాట్లాడడానికి కూడా అనుమతి ఇవ్వకపోతే అక్కడ ఉండిపోయే ప్రసక్తే లేదని ఆయన చెప్పడం వీడియోలో వినొచ్చు. ముఖ్యమంత్రి అయిన తర్వాతే తిరిగి వస్తానని చంద్రబాబు నాయుడు తెలిపారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేది. ఈ వీడియో పాతది.
మేము వీడియో నుండి సంగ్రహించిన కీఫ్రేమ్‌లను తీసుకుని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ కూటమి ఘన విజయం సాధించిన తర్వాత వైరల్ వీడియో కొన్ని రోజుల కిందట షేర్ చేశారని మేము కనుగొన్నాము. ‘చంద్రబాబు శపధం నెరవేరింది’ అంటూ కూటమికి అనుకూలంగా ఉన్న కొన్ని సోషల్ మీడియా అకౌంట్లు షేర్ చేశాయి.
‘UNSEEN VIDEO: TDP chief Chandrababu Naidu Challenge in Andhra Pradesh Assembly | TV5 News Digital’ అనే టైటిల్ తో వైరల్ వీడియోను టీవీ5 న్యూస్ నవంబర్ 19, 2021న షేర్ చేసినట్లు మేము కనుగొన్నాము
నవంబర్ 19, 2021న ‘ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం’ అనే క్యాప్షన్‌తో వీ6 న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానెల్ కూడా దీన్ని షేర్ చేసింది.
firstpost.com ప్రకారం, అప్పటి అధికారంలో ఉన్న YSPC పార్టీ తనను అవమానించిందని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. వ్యవసాయ రంగంపై చర్చ సందర్భంగా సభలో ఇరుపక్షాల మధ్య వాగ్వివాదం చోటుచేసుకోవడంతో చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తరువాత, తన ఛాంబర్‌లో తన పార్టీ శాసనసభ్యులతో సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత టీడీపీ శాసనసభ్యులు తిరిగి సభలోకి వచ్చారు. ఆ తర్వాతనే చంద్రబాబు నాయుడు తాను ముఖ్యమంత్రిని అయ్యాక తిరిగి అసెంబ్లీలోకి అడుగు పెడతానని తన నిర్ణయాన్ని ప్రకటించారు.
కాబట్టి, వైరల్ అవుతున్న వీడియో 2021 నవంబర్ నాటిది. అధికార వైఎస్సార్సీ నేతల తీరుతో విసుగు చెందిన చంద్రబాబు నాయుడు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన వీడియో. ఇది ఇటీవలిది కాదు. NDA ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేది.
Claim : మోదీ క్యాబినెట్ ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు చంద్రబాబు నాయుడు ఎన్డీయే నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియో వైరల్ అవుతుంది.
Claimed By : Social media users
Fact Check : False