ఫ్యాక్ట్ చెక్: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మద్దతుదారులు న్యూఢిల్లీలో భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలను చేపట్టలేదు
ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి, అరవింద్ కేజ్రీవాల్ అవినీతి ఆరోపణలపై మార్చి 2024లో అరెస్టయ్యారు.
ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి, అరవింద్ కేజ్రీవాల్ అవినీతి ఆరోపణలపై మార్చి 2024లో అరెస్టయ్యారు. కొన్ని ప్రైవేట్ కంపెనీలకు మద్యం లైసెన్సులను కేటాయించినందుకు కేజ్రీవాల్ ప్రభుత్వం లంచాలు తీసుకుందని ఆరోపణలు వచ్చాయి. కోట్లాది రూపాయల ఢిల్లీ మద్యం కేసు కల్పితమని కేజ్రీవాల్ మద్దతుదారులు ఆరోపణలను ఖండిస్తున్నారు. ఆయన అరెస్టుకు నిరసనగా వేలాది మంది మద్దతుదారులు ఢిల్లీలో ర్యాలీ నిర్వహించారు.
లిక్కర్ పాలసీ స్కాంలో తన అరెస్టు అక్రమమని, నిబంధనల ఉల్లంఘన అని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనను వెంటనే విడుదల చేయాలంటూ ఆదేశాలివ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. ఇవే అంశాలతో ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను మంగళవారం విచారించిన కోర్టు కేజ్రీవాల్ అరెస్టులో ఎలాంటి అతిక్రమణలు జరగలేదని తేల్చింది. ఆధారాలు ఉన్నాయంటూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చేసిన వాదనతో ఏకీభవించింది. కేజ్రీవాల్ అరెస్టు సక్రమమేనని పేర్కొంటూ ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ పిటిషన్ ను కొట్టేసింది. హైకోర్టులో చుక్కెదురు కావడంతో కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన లాయర్లు అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.
అటువంటి పరిస్థితిలో.. వేలాది మంది ప్రజలు పసుపు చొక్కాలు ధరించి వీధుల్లోకి వచ్చినట్లు చూపుతున్న చిత్రం వైరల్ అవుతోంది.. ఢిల్లీ వీధులు నిరసనకారులతో నిండిపోయాయన్నది కొందరి వాదన.
“दिल्ली की पूरी सड़क केजरीवालमय हो चुकी है। #IndiaWithKejriwal #INDIAAlliance” అంటూ హిందీలో పోస్టులు పెట్టారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వైరల్ అవుతున్న చిత్రం పాతది.. భారతదేశానికి సంబంధించినది కాదు. Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని ఉపయోగించి సెర్చ్ చేసినప్పుడు.. ఇది గ్రేట్ ఇథియోపియన్ రన్ కు సంబంధించినదని మేము గుర్తించాం. అనేక వార్తా నివేదికలలో ఈ చిత్రం అప్లోడ్ చేశారని మేము కనుగొన్నాము.
'గ్రేట్ ఇథియోపియన్ రన్: ది బిగ్గెస్ట్ రేస్ ఇన్ ఆఫ్రికా' పేరుతో radseason.com ప్రచురించిన నివేదికను మేము గుర్తించాం. ఇథియోపియా రన్ ను ఇథియోపియా రాజధాని అడిస్ అబాబాలో నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో 40,000 కంటే ఎక్కువ మంది పాల్గొన్నారు. ఆఫ్రికాలోని అత్యంత ప్రసిద్ధ రన్నింగ్ ఈవెంట్‌లలో ఇది ఒకటి.
దీన్ని ఒక క్యూగా తీసుకుని, మేము "గ్రేట్ ఇథియోపియన్ రన్" అనే కీవర్డ్‌లను ఉపయోగించి శోధించినప్పుడు, ఆగస్టు 2017లో కూడా CNN ప్రచురించిన కథనాన్ని మేము కనుగొన్నాము. కథనం శీర్షిక ‘Ethiopia is the hot new place in Africa – here’s why” అని ఉంది.
MDG fund.org పేరుతో మరో వెబ్‌సైట్ కూడా వైరల్ ఇమేజ్‌ని షేర్ చేసింది.
ఈ వెబ్‌సైట్‌లలో ప్రచురించిన చిత్రాలకు.. వైరల్ చిత్రానికి మధ్య పోలిక ఇక్కడ ఉంది.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. గ్రేట్ ఇథియోపియన్ రన్ కు సంబంధించిన ఫోటో ఇది.
Claim : ఢిల్లీలో వేలాది మంది కేజ్రీవాల్ మద్దతుదారులు, ఆయన అరెస్టును నిరసిస్తూ రోడ్ల మీదకు రావడం వైరల్ చిత్రం చూపుతోంది
Claimed By : Social media users
Fact Check : False