ఫ్యాక్ట్ చెక్: 2016లో మహిళను పులి లాక్కుని వెళ్లిన వీడియోను ఇటీవలిదిగా ప్రచారం చేస్తున్నారు
అడవి జంతువులను చూడడానికి జూకు వెళుతూ ఉంటారు. కానీ అవి అడవిలో ఎలా ఉంటాయి, అభయారణ్యాలలో ఎలా బతుకుతాయనే విషయాన్ని;

అడవి జంతువులను చూడడానికి జూకు వెళుతూ ఉంటారు. కానీ అవి అడవిలో ఎలా ఉంటాయి, అభయారణ్యాలలో ఎలా బతుకుతాయనే విషయాన్ని తెలుసుకోడానికి చాలా మంది ప్రయత్నిస్తూ ఉంటారు. ప్రపంచంలోని పలు దేశాలలోని జంగిల్ సఫారీలకు మంచి ఆదరణ లభిస్తూ ఉంటుంది. అడవిలోని అందాలను, జంతువులకు సంబంధించిన పలు విషయాలను తెలుసుకోడానికి జంగిల్ సఫారీలు ఒక ఉత్తేజకరమైన మార్గం. ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉంటూ, కాస్త సరదాగా గడపడానికి ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలను పాటించాలి. సురక్షితమైన, ఆనందదాయకమైన అనుభవానికి జంగిల్ సఫారీ ఓ ముఖ్యమైన మార్గం. రూల్స్ ను పాటించడం ద్వారా, పర్యావరణాన్ని, వన్యప్రాణులను కాపాడుకోవడంలో సహాయపడవచ్చు. ఈ మార్గదర్శకాలను విస్మరిస్తే ఊహించని ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.
మనం బిగ్గరగా చేసే శబ్దాలు జంతువుల సహజ ప్రవర్తనకు భంగం కలిగించవచ్చు, దూకుడుగా ప్రవర్తించి దాడి చేయడానికి కారణమవ్వచ్చు. అందుకే అలాంటి ప్రదేశాల్లో బిగ్గరగా అరవకూడదు. గట్టిగా సంగీతాన్ని ప్లే చేయడం, ఎక్కువ శబ్దాలతో ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించడం వంటి అనవసరమైన శబ్దాన్ని నివారించడం చాలా ముఖ్యం. అంతేకాకుండా అడవి జంతువులకు ఆహారం ఇవ్వడం నిబంధనలకు విరుద్ధం మాత్రమే కాదు, జంతువులు, మానవులకు కూడా తీవ్రమైన పరిణామాలు చోటు చేసుకునే ప్రమాదం ఉంది. మనుషులు తినే ఆహారం వన్యప్రాణులకు ఆమోదయోగ్యమైంది కాదు, పలు ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.
ఇంతలో, ఒక పులి ఒక స్త్రీని లాక్కుని వెళుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటన ఇటీవల భారతదేశంలో జరిగిందనే వాదనతో పోస్టు పెట్టారు. వీడియోలో, ఒక మహిళ ఒక చిన్న రహదారి మధ్యలో కారుకు ఓ వైపు దిగి, మరొక వైపుకు వెళ్లడాన్ని మనం చూడవచ్చు. ఆమె కారులో ఉన్న వ్యక్తితో మాట్లాడటం ప్రారంభించినప్పుడు వెనుక నుండి ఒక పులి వచ్చి ఆ స్త్రీని లాక్కుపోతుంది. “पति से झगड़ा कर कार से बाहर निकली महिला, जंगल में खींच ले गया बाघ...” అనే క్యాప్షన్ తో వీడియోను పోస్టు చేశారు. హెచ్చరిక: గ్రాఫికల్ వీడియో
వైరల్ పోస్టుకు సంబంధించిన ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెక్:
వైరల్ అవుతున్న వాదన నిజం కాదు. ఈ వీడియో ఇటీవలిది కాదు. భారతదేశంలో చోటు చేసుకుంది అసలే కాదు. వీడియో నుండి కీ ఫ్రేమ్‌లను తీసుకుని, గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాము, అందుకు సంబంధించి మాకు కొన్ని పాత సోషల్ మీడియా పోస్ట్‌లు లభించాయి.
Varta24 Travel అనే ఫేస్‌బుక్ యూజర్ ఆగస్టు 5, 2023న అదే వీడియోను “जंगल में सफारी करते समय सावधानी रखें और गाड़ी से तो बिल्कुल नहीं उतरे... देखिए, कैसे एक महिला को बाघ ले गया..!!” అనే క్యాప్షన్‌తో షేర్ చేశారు. "అడవిలో సఫారీ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి, వాహనం నుండి దిగకండి. చూడండి, పులి ఒక స్త్రీని ఎలా తీసుకెళ్లిందో..!!" అని ఆ పోస్టుకు అర్థం.
మరింత శోధించినప్పుడు, న్యూస్ 18 ఇండియా ప్రచురించిన వీడియోకు సంబంధించిన పొడవైన వెర్షన్ మాకు కనిపించింది. “चीन के बीजिंग शहर से दिल दहला देने वाला वीडियो सामने आया है.. बीजिंग में एक वाइल्ड लाइफ पार्क में दो महिलाओं का शिकार करता हुआ बाघ सीसीटीवी में कैद हो गया.. दरअसल एक लड़की ड्राइविंग करने के लिए कार से बाहर निकलकर जैसे ही ड्राइविंग सीट की और बढ़ी उसे बाघ खींच ले गया...उसे बचाने के लिए जैसे ही दूसरी महिला भागी उसे दूसरा बाघ उठा ले गया..” అంటూ నివేదించారు.
“చైనాలోని బీజింగ్ నగరం నుండి ఒక హృదయ విదారక వీడియో బయటపడింది. బీజింగ్‌లోని వన్యప్రాణుల ఉద్యానవనంలో ఇద్దరు మహిళలను వేటాడుతున్న పులికి సంబంధించిన ఘటన CCTVలో నిక్షిప్తమైంది. వాస్తవానికి డ్రైవింగ్ సీటు నడుపుతున్న వెంటనే ఒక అమ్మాయి కారు దిగి కారు నుండి బయటకు వెళ్లింది అప్పుడే ఈ దాడి జరిగింది.” అని కథనం చెబుతోంది. హెచ్చరిక: గ్రాఫికల్ వీడియో
Loksatta మరాఠీ యూట్యూబ్ ఛానల్ లో కూడా ఈ ఘటన గురించి నివేదించారు. జూలై 25, 2016న “చైనాలోని బాడాలింగ్ వైల్డ్‌లైఫ్ సఫారీ పార్క్‌లో పులి కనిపించింది” అనే శీర్షికతో వైరల్ వీడియోకు సంబంధించిన నిడివి ఎక్కువ ఉన్న వెర్షన్‌ను షేర్ చేశారు. వీడియోలోని వివరణలో “వీడియోలో, పులి ఆ మహిళను అడవిలోకి లాగుతున్నట్లు మీరు స్పష్టంగా చూడవచ్చు. ఆ క్షణం చాలా భయంకరంగా ఉంది, సమీపంలో పార్క్ చేసిన కారులో ఉన్న వ్యక్తులు కూడా ఏమీ చేయలేకపోయారు.” అని తెలిపారు. హెచ్చరిక: గ్రాఫికల్ వీడియో
scmp లో అక్టోబర్ 18, 2016న ప్రచురితమైన ఒక కథనం ప్రకారం, జూలై 23న బీజింగ్‌లోని గ్రేట్ వాల్ సమీపంలోని బాడాలింగ్ వైల్డ్‌లైఫ్ వరల్డ్‌లో ఈ ఘటన జరిగింది. 13 సెకన్ల వీడియోలో జావో అనే ఇంటిపేరు ఉన్న మహిళ కారు ముందు ప్రయాణీకుల తలుపు నుండి బయటకు వెళ్లి డ్రైవర్ తలుపు వద్దకు నడుచుకుంటూ వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆమె వెనుక నుండి ఒక పులి వచ్చి ఆమెను ఈడ్చుకుంటూ వెళ్ళింది. ఆ వీడియోలో ఉన్న రెండవ మహిళ జావో 57 ఏళ్ల తల్లి, ఆమె కూడా దాడికి గురై మరణించింది. జావోను ఆసుపత్రికి తరలించారు, ఆమెకు తీవ్ర గాయాలవ్వడంతో వైద్యులు చికిత్స అందించారు.
కారు నుండి దిగిన మహిళను పులి ఈడ్చుకుంటూ వెళ్తున్నట్లు చూపించే వైరల్ వీడియో 2016 సంవత్సరం నాటిది. ఈ సంఘటన భారతదేశంలో జరిగింది కాదు. చైనాలో చోటు చేసుకుంది. ఇది ఇటీవలి సంఘటన అనే వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : కారు దిగిన తర్వాత పులి ఒక మహిళను ఈడ్చుకెళ్లిన ఘటన ఇటీవల చోటు చేసుకుంది
Claimed By : Social media users
Fact Check : False