ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందారు. ఆ తర్వాత ఫిబ్రవరి 2025లో హిందూపురం మున్సిపల్ చైర్మన్ పదవి టీడీపీ కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్మన్‌గా టీడీపీ అభ్యర్థి రమేష్ ఎన్నికయ్యారు. రమేష్‌కు అనుకూలంగా 23 ఓట్లు పోలయ్యాయి. వైసీపీ అభ్యర్థి లక్ష్మికి అనుకూలంగా 14 ఓట్లు వచ్చాయి. కౌన్సిల్ సమావేశాన్ని వైసీపీ కౌన్సిలర్లు బహిష్కరించారు. వైసీపీ నుంచి గెలిచి చైర్‌పర్సన్ అయిన ఇంద్రజ.. రాజీనామా చేసి టీడీపీలో చేరడంతో చైర్మన్ పీఠం ఖాళీ అయింది. ఆ పదవిని టీడీపీ కైవసం చేసుకుంది. హిందూపురం మున్సిపాలిటీలో మొత్తం 38 మంది కౌన్సిలర్లు ఉన్నారు. 21 మంది కౌన్సిలర్లు, ఎమ్మెల్యే, ఎంపీతో కలిపి టీడీపీకి 23 ఓట్లు వచ్చాయి. వైఎస్సార్సీపీకి 17 స్థానాలు ఉంటే అభ్యర్థి లక్ష్మికి అనుకూలంగా 14 ఓట్లు పడ్డాయి. ముగ్గురు సభ్యులు గైర్హాజరయ్యారు. దీంతో టీడీపీకే మున్సిపల్ ఛైర్మన్ సీటు దక్కింది.
గత మున్సిపల్ ఎన్నికల్లో హిందూపురం మున్సిపాలిటీలోని 38 వార్డుల్లో వైసీపీ 30 గెలుచుకోగా.. టీడీపీ ఆరు స్థానాలకే పరిమితం అయింది. బీజేపీ, ఎంఐఎం చెరో ఒక్కో వార్డు గెలుచుకున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 14మంది వైసీపీ కౌన్సిలర్లు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సమక్షంలో టీడీపీలో చేరడంతో మున్సిపాలిటీ టీడీపీ వశమైంది.
అయితే హిందూపురం పురపాలక సంఘం ఆటోడ్రైవర్ల నుండి ప్రతి రోజూ 70 రూపాయలు వసూలు చేస్తోందంటూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి.
"ఆటో డ్రైవర్లకు చంద్రబాబు ప్రభుత్వం భారీ షాక్
ఆటోలకు రోజువారీ ₹70 చార్జీలు వసూలు చేస్తున్న కూటమి ప్రభుత్వం
హిందూపురం లాంటి పట్టణంలో కనీసం రెండువేల ఆటోలు తిరుగుతాయి రోజుకు, ఆటోకి 70 లెక్కన రోజుకు 1,40,000 వసూలు చేస్తున్నారు,అది నెలకు 42 లక్షలు, సంవత్సరానికి 5 కోట్ల 4 లక్షలు వసూలు చేస్తున్నారు...
ఇదంతా ఎవరి సొమ్ము రోజూ చెమటోడ్చి ఎండనక,వాననక రేయింబవళ్లు ఆటో తోలుకునే ఒక సామాన్యుడి దగ్గర నుండి వసూలు చేస్తున్నారు...
సగటున ఒక్కో ఆటో డ్రైవర్ వద్ద నుండి 25,200 రూపాయలు అక్రమంగా వసూలు చేస్తూ సంపద సృష్టిస్తున్నారు...
అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆటో సోదరులకు ఏటా పదివేలు సాయం చేసేవాడు,నేడు చంద్రబాబు ఎదురు 25 వేల రూపాయలు దోచుకుంటున్నాడు...
న్యాయం ఎక్కడుంది అసలు..." అంటూ పోస్టు పెట్టారు.
మరొక పోస్టులో "హిందూపురం లాంటి పట్టణంలో కనీసం రెండువేల ఆటోలు తిరుగుతాయి రోజుకు, ఆటోకి 70 లెక్కన రోజుకు 1,40,000 వసూలు చేస్తున్నారు,అది నెలకు 42 లక్షలు,సంవత్సరానికి 5 కోట్ల 4 లక్షలు వసూలు చేస్తున్నారు... ఇదంతా ఎవరి సొమ్ము రోజూ చెమటోడ్చి ఎండనక,వాననక రేయింబవళ్లు ఆటో తోలుకునే ఒక సామాన్యుడి దగ్గర నుండి వసూలు చేస్తున్నారు" అంటూ మరొకరు పోస్టు పెట్టారు.
వైరల్ పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని తేలింది.
హిందూపురంలో ఆటో డ్రైవర్ల నుండి ఏదైనా ఫీజులు వసూలు చేస్తున్నారని తెలుసుకోడానికి తెలుగు పోస్ట్ ఫ్యాక్ట్ చెక్ విభాగం హిందూపురం పురపాలక సంఘం ఆఫీసుకు ఫోన్ చేసింది. మా ఫోన్ కాల్ కు సంప్రదించిన అధికారులు తాము ఆటో డ్రైవర్ల నుండి ఎలాంటి డబ్బులు వసూలు చేయడం లేదని తెలిపారు. ఇదంతా అసత్య ప్రచారం అని తెలిపారు. మేము సంబంధిత కీవర్డ్ సెర్చ్ చేయగా ఆంధ్రప్రదేశ్ ఫ్యాక్ట్ చెక్ విభాగం సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు మాకు కనిపించింది.
"హిందూపురం మున్సిపాలిటీ వారు తమ పరిధిలో ఉన్న ఆటో డ్రైవర్ల నుండి రోజుకు ఆటోకు 70 రూపాయలు వసూలు చేస్తున్నట్టు... తద్వారా ఏడాదికి ఒక్కో ఆటో డ్రైవర్ నుండి రూ.25,500 వసూలు చేస్తున్నట్టు... కొందరు చేస్తున్న ఈ ప్రచారం అబద్ధం. ఇలాంటి వసూలు ఏమీ లేదని తమకు తాముగా ఆటో డ్రైవర్లు చెబుతున్న ఈ వీడియో చూడండి. ఇలాంటి వసూళ్లను హిందూపురంలోని కాదు రాష్ట్రంలో ఎక్కడా ప్రభుత్వం వసూలు చేయడం లేదు. కాబట్టి ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మకండి.
#FactCheck
#AndhraPradesh" అంటూ ట్వీట్ వేశారు.
ఈ వీడియోలో కొందరు వ్యక్తులు మాట్లాడుతూ, తాము ఆటో డ్రైవర్లమని, తమతో ఎలాంటి ఫైన్లు అధికారులు వసూలు చేయడం లేదని చెప్పడం వినవచ్చు.
అదే వీడియోను factcheckapgov ఇంస్టాగ్రామ్ పేజీలో కూడా అదే వీడియోను పోస్టు చేశారు.
హిందూపురంలో ఆటో డ్రైవర్ల నుండి ప్రతి రోజూ 70 రూపాయలు వసూలు చేస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.