హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సమీపంలోని 400 ఎకరాల భూమిని వేలం వేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన తర్వాత హైదరాబాద్‌లో పెద్దఎత్తున నిరసనలు చెలరేగాయి. విద్యార్థులు, పర్యావరణ కార్యకర్తలు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. తీవ్రంగా నిరసన తెలుపుతున్నారు. తెలంగాణ హైకోర్టు, సుప్రీం కోర్టు కూల్చివేత పనులను ఆపాలని ఆజ్ఞలు జారీ చేశాయి. కంచె గచ్చిబౌలి భూముల విషయంలో సుప్రీంకోర్టు స్పందించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు అన్ని చర్యలను నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తెలంగాణ హైకోర్టు నివేదికను పరిశీలించిన జస్టిస్ గవాయ్ ధర్మాసనం చట్టాన్ని చేతుల్లోకి ఎలా తీసుకుంటారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇది చాలా తీవ్రమైన అంశమని, ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని అత్యున్నత న్యాయస్థానం ప్రతివాదిగా చేర్చింది. అత్యవసరంగా కార్యకలాపాలు చేపట్టాల్సిన అవసరమేంటని ప్రశ్నించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 16కి వాయిదా వేసింది.
ఇంతలో, కంచ గచ్చిబౌలి ప్రాంతంలో నుండి వన్యప్రాణులు భయంతో పారిపోతున్నాయని పేర్కొంటూ అనేక చిత్రాలు, వీడియోలు వైరల్ అయ్యాయి. తెలంగాణ ప్రభుత్వ చర్యల కారణంగా వన్యప్రాణులు నగరంలోకి వచ్చేస్తున్నాయనే వాదనతో ఒక అపార్ట్‌మెంట్ సమీపంలోని ప్రజలకు దగ్గరగా నడుస్తున్న సంబల్ జింకను చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో నగర పరి
ధిలో అపార్ట్‌మెంట్‌ల సమీపంలో ఒక జింక నడుస్తున్నట్లు, దానికి జనం మంచి
నీరు ఇవ్వడం మనం చూడొచ్చు.
“రేవంత్ చేస్తున్న విధ్వంసానికి ఫలితం ! ప్రాణభయంతో అందమైన ప్రకృతిని , పచ్చదనాన్ని వదిలి కాంక్రిట్ జనారణ్యంలోకి వచ్చిన జింక .. ఏదో రాక్షసుల మధ్యకి వచ్చినట్లు బిత్తర చూపులు చూస్తున్న అమాయక జీవి . పాలకుడుకి కొంచమైనా జాలి హృదయం ఉండాలి .ఒకసారి మోదుగుల వేణు అన్న వాజిపేయ్ గురించి చెప్తూ నాకు భలే మాట చెప్పాడు . అదేమిటంటే 'పాలకుడు ఎప్పుడూ ప్రేమికుడై ఉండాలి . అది సాటి మనిషినైనా కావొచ్చు , ప్రకృతునైనా కావొచ్చు , మూగజీవినైనా కావొచ్చు , పరదేశమైనా కావొచ్చు ' . పాలకుడు ప్రేమికుడైతే సమాజం నిశ్చింతంగా ఉంటుందంట . అధికారాన్ని సంపాదనకు ఉపయోగించుకోవాలా లేక సమాజం కోసం ఉపయోగించాలా అన్నదే చరిత్రలో ఆ నాయకుడి స్థానాన్ని నిర్ణయిస్తుంది .” అంటూ పోస్టులు పెట్టారు.
మరికొందరు యూజర్లు “#HCU: Forest Animals reaching out to nearby homes after losing their forest.” అంటూ పోస్టులు పెట్టారు.
“జనాలనే గోస పెడుతుండు అనుకున్నాం కానీ వన్యప్రాణులను కూడా వదలట్లేదు పోతవురరై....HCU పరిదిలో జనావాసాల్లోకి వస్తున్న వన్యప్రాణులు... దగ్గరలో ఉన్న గోపన పల్లి.. లో అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చింది...” అంటూ ఇంకొందరు పోస్టులు పెట్టారు.
ఫ్యాక్ట్ చెక్:
తెలంగాణ ప్రభుత్వ చర్యల కారణంగా ఆవాసాలను కోల్పోయిన జింక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిసరాల్లోని ఒక అపార్ట్‌మెంట్ సమీపంలో కనిపించిందనే వాదనలో నిజం లేదు. ఆ వీడియో హైదరాబాద్ నుండి వచ్చింది కాదు, విశాఖపట్నంలో చోటు చేసుకుంది.
జాగ్రత్తగా గమనించినప్పుడు, షేర్ చేసిన కొన్ని వైరల్ వీడియోలలో కుడి ఎగువ మూలలో Way2News లోగో కనిపించింది. వీడియో నుండి కీఫ్రేమ్‌లను కూడా సంగ్రహించి, రివర్స్ ఇమేజ్ సెర్చ్ ఉపయోగించి వాటిని శోధించాము, కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు అదే వీడియోను “విశాఖలో జనావాసాల్లోకి వస్తున్న వన్యప్రాణులు...దగ్గరలో ఉన్న కంబాల కొండ నుంచి... విశాలాక్షి నగర్ లో అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చింది.” క్యాప్షన్‌తో షేర్ చేస్తున్నట్లు
తెలుసుకున్నాం.
మరొక ఫేస్ బుక్ యూజర్ “అడవి జంతువులు ఎలా ఉంటయి, ఎక్కడ ఉంటయి అనే కనీస అవగాహన లేని గులాబీ దద్దమ్మలు, కనబడితే కాల్చుకుతినే బ్యాచ్. #HCU అడవి నరుకుతుంటే జనావాసాల్లోకి వచ్చిన దుప్పి అంటూ ఫేక్ ప్రచారం చేస్తూ ప్రజలను గొర్రెలను చేస్తారు.” అంటూ వీడియోను పోస్టు చేశారు. ఈ వీడియోపై వచ్చిన కామెంట్స్ ను మేము గమనించినప్పుడు, కొంతమంది వినియోగదారులు way2news అనే షార్ట్ న్యూస్ యాప్‌లో అప్లోడ్ చేసిన వార్తల స్క్రీన్‌షాట్‌లను షేర్ చేసినట్లు
మాకు తెలిసింది.
మరింత వెతికినప్పుడు, తన నివాసం దగ్గర తిరుగుతున్న జింకతో తాను దిగిన చిత్రాలను షేర్ చేస్తున్న ఒక యూజర్ ఫేస్‌బుక్ పోస్ట్ మాకు కనిపించింది. వైరల్ వీడియోలో కనిపించిన జింకను, ఈ చిత్రాలను పోల్చినప్పుడు. రెండూ ఒకటేనని మేము కనుగొన్నాము. ఈ జింక విశాఖపట్నంలోని విశాలాక్షి నగర్‌లో కనిపించింది.
“VIDEO: విశాఖలో జనావాసాల్లోకి వన్యప్రాణులు. విశాఖలోని జనావాసాల్లోకి వన్య ప్రాణులు వస్తున్నాయి. విశాలాక్షి నగర్, సాగర్నగర్, బీచ్ రోడ్ తదితర ప్రాంతాల్లోకి జింకలు, దుప్పిలు వస్తున్నాయి. బుధవారం సాయంత్రం విశాలాక్షి నగర్ ప్రాంతంలో కొండపై నుంచి దుప్పి జనావాసాల్లోకి వచ్చింది. వీటిని తిలకించేందుకు స్థానికులు ఆసక్తి చూపారు. పలువురు సెల్ఫీలు దిగిన అనంతరం వాటికీ నీళ్లు అందించారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో నీళ్ల కోసం వస్తున్నట్లు స్థానికులు తెలిపారు” అంటూ కథనాలు మాకు లభించాయి.
way2newsలో ప్రచురించిన కథనానికి సంబంధించిన స్క్రీన్ షాట్ ను మీరు చూడొచ్చు.
వే2న్యూస్ కూడా ఒక ఫ్యాక్ట్ చెక్ కథనాన్ని ప్రచురించింది. ఇందులో ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో హైదరాబాద్‌కు చెందినది కాదని, విశాఖపట్నంలోని విశాలాక్షి నగర్‌లో ఒక జింకకు నీరు అందిస్తున్నప్పుడు చిత్రీకరించారని నివేదించారు. స్క్రీన్‌షాట్ ను ఇక్కడ ఉంది.
విశాఖపట్నంలో గతంలో కూడా ప్రజలు అడవి జింకలను చూసిన సందర్భాలు ఉన్నాయి..
కాబట్టి, జింకకు నీటిని అపార్ట్ మెంట్ వాసులు అందిస్తున్న వైరల్ వీడియో హైదరాబాద్ కు సంబంధించింది కాదు. ఇది విశాఖపట్నం నుండి వచ్చింది. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.