మునుగోడులో ఇళ్లు దొరకడం కష్టమేనట
మునుగోడులో ఉప ఎన్నిక ఆరు నెలల్లో జరగాల్సి ఉంది. నవంబరులో ఉప ఎన్నిక ఉండే అవకాశముందని రాజకీయ పార్టీలు అంచనా వేస్తున్నాయి
మునుగోడులో ఉప ఎన్నిక ఆరు నెలల్లో జరగాల్సి ఉంది. నవంబరులో ఉప ఎన్నిక ఉండే అవకాశముందని రాజకీయ పార్టీలు అంచనా వేస్తున్నాయి. అయితే ఇప్పటి నుంచే మునుగోడు ఉప ఎన్నికలో గెలిచేందుకు అన్ని పార్టీలూ వ్యూహాలు రచిస్తున్నాయి. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్థంగా ఉండేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. కనీస స్థాయి ఓట్లున్న నేతను తమ పార్టీలోకి తీసుకు వచ్చేందుకు అన్ని పార్టీలూ తంటాలు పడుతున్నాయి.
టిక్కెట్ల కోసం...
మునుగోడు ఉప ఎన్నిక సాధారణ ఎన్నికలకు ఒక ట్రయల్ గా మారింది. ఈ ఎన్నికల్లో గెలిచినా ఏడాది పాటే పదవి ఉంటుంది. అయినా అన్ని పార్టీల్లో టిక్కెట్ కోసం కొట్లాట ప్రారంభమయింది. అసంతృప్తి గళాలు వినిపిస్తున్నాయి. అధికార టీఆర్ఎస్ కూడా ఇందుకు అతీతం కాదు. కూసుకుంట ప్రభాకర్ రెడ్డికి టిక్కెట్ కన్ఫర్మ్ అయిందని తెలియడంతో చౌటుప్పల్ టీఆర్ఎస్ ఎంపీపీ వెంకటరెడ్డి పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిపోయారు. అయితే ఈ నెల 20వ తేదీన జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించలేదు. టీఆర్ఎస్, కాంగ్రెస్ లు తమ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
బహిరంగ సభలతో...
ఇక మునుగోడులో ఈ నెల 20వ తేదీన ప్రజాదీవెన సభను టీఆర్ఎస్ ఏర్పాటు చేసింది.ఈ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మరో వైపు బీజేపీ ఈ నెల 21వ తేదీన భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఈ సభకు కేంద్ర మంత్రి అమిత్ షా హాజయ్యారు. కేసీఆర్ వేసిన ప్రశ్నలకు అమిత్ షా సమాధానం చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కాంగ్రెస్ ఈ నెల 5వ తేదీన సభ నిర్వహించింది. 16 నుంచి 21వ తేదీ వరకూ పాదయాత్ర చేపట్టింది.
అన్నీ ముందుగానే...
ఇక మునుగోడు నియోజకవర్గంలోని మండల కేంద్రాల్లో అద్దె ఇళ్లు దొరకడం గగనమయి పోయాయి. లాడ్జీలను ముందుగానే బుక్ చేసుకున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మండల కేంద్రాల్లోని ప్రధాన లాడ్జీలను డిసెంబరు నెల వరకూ బుక్ చేసుకున్నారని తెలిసింది. ఇక అద్దె ఇళ్ల కోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా నేతలు వెనకాడటం లేదు. మునుగోడులో నేతలు బస చేయడానికి ఏర్పాట్లను ముందుగానే ఏర్పాటు చేసుకుంటున్నారు. మామూలుగా ఉన్న దానికంటే పది రెట్టు అద్దె చెల్లిస్తామని పార్టీలు ముందుకు వస్తున్నాయి. దీంతో అద్దె ఇళ్లకు మునుగోడులో డిమాండ్ పెరిగింది. మొత్తం మీద మునుగోడులో అద్దె ఇల్లు దొరకడం కూడా కనాకష్టంగా మారింది.