చంద్ర గ్రహణం.. ఏ సమయంలో అంటే?
చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం అక్టోబర్ 28 రాత్రికి మూసివేయనున్నారు
నేడు చంద్ర గ్రహణం ఏర్పడనుంది. భారత్ తో పాటు ఇతర ఆసియా దేశాలు, యూరప్, ఆఫ్రికా దేశాల్లో పాక్షిక చంద్ర గ్రహణం కనిపించనుంది. ఈ ఖగోళ ఘట్టం నేటి రాత్రి మొదలై అక్టోబరు 29వ తేదీ వేకువ జాము వరకు కొనసాగుతుంది. భారత్ లో ఈ రాత్రి 11.31 గంటలకు చంద్ర గ్రహణం ప్రారంభం కానుంది. అర్ధరాత్రి దాటిన తర్వాత 1.05 గంటల సమయంలో గ్రహణం బాగా కనిపిస్తుందని, 1.44 గంటల సమయంలో చంద్ర గ్రహణాన్ని స్పష్టంగా గుర్తించవచ్చు. 2.23 గంటల సమయానికి చంద్ర గ్రహణం ముగుస్తుంది.
చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం అక్టోబర్ 28 రాత్రికి మూసివేయనున్నారు. అక్టోబర్ 29న తిరిగి తెరుస్తారు. గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆలయం తలుపులు వేయడం ఆనవాయితీ కావడంతో 28 రాత్రి తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తారు. శ్రీవారి ఆలయాన్ని అక్టోబరు 29వ తేదీ తెల్లవారుజామున 3:15 గంటలకు ఏకాంతంలో శుద్ధి, సుప్రభాత సేవ నిర్వహించి ఆలయ తలుపులు తెరుస్తారు. చంద్రగ్రహణం కారణంగా ఏపీలోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆలయంతోపాటు, ఇతర ఉప ఆలయాలను మూసివేయనున్నారు. సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు అమ్మవారికి పంచహారతులు సేవ అనంతరం ఆలయాలను మూసివేయనున్నారు. తెల్లవారుజామున మూడు గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి అమ్మవారికి స్నపనాభిషేకం, నిత్య అలంకరణ పూజలు చేస్తారు. ఉదయం 9 గంటల నుంచి దర్శనానికి అనుమతిస్తారు. శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానాన్ని మూసివేయనున్నారు.