మ్యాచ్ అయిన తర్వాత గుండెను తరలించారు.. ప్రాణాన్ని కాపాడారు

ఆదివారం రాత్రి ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో జరిగిన క్రికెట్‌ మ్యాచ్‌ను వీక్షించి 20వేల మందికి పైగా అభిమానులను

Update: 2022-09-26 11:19 GMT

మెడికల్ ఎమెర్జెన్సీ ఉన్న సమయాల్లో ట్రాఫిక్ ను క్లియర్ చేస్తూ గ్రీన్ ఛానల్ ను ఏర్పాటు చేస్తూ ఉన్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. తాజాగా హైదరాబాద్ నగరంలో మెట్రో ద్వారా గ్రీన్ ఛానల్ ను ఏర్పాటు చేశారు. అర్థరాత్రి తరువాత గుండెను తరలించడానికి గ్రీన్‌ ఛానెల్‌ సృష్టించి హైదరాబాద్‌ మెట్రో సంస్థ ప్రశంసలు అందుకుంటోంది. హైదరాబాద్‌ వాసులకు అవసరమైన సహాయం చేయడానికి తామెప్పుడూ ముందే ఉంటామని మరో మారు ఎల్‌ & టీ హైదరాబాద్‌ మెట్రో రైల్‌ నిరూపించింది.

గతంలో అంటే ఫిబ్రవరి 2021లో ఏ విధంగా అయితే జూబ్లీహిల్స్‌లోని అపోలో హాస్పిటల్‌ నుంచి ఓ ప్రాణం కాపాడటానికి గుండెను తరలించి ప్రాణాలు నిలబెట్టగా.. ఇప్పుడు మరోసారి అలాంటిదే చేసి చూపించింది. సెప్టెంబర్‌ 26 తెల్లవారుజామున గ్రీన్‌ ఛానెల్‌ ఏర్పాటుచేయడంతో పాటుగా నాగోల్‌ నుంచి జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ మెట్రో స్టేషన్‌కు గుండెను రవాణా చేయడం విశేషం.
ఆదివారం రాత్రి ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో జరిగిన క్రికెట్‌ మ్యాచ్‌ను వీక్షించి 20వేల మందికి పైగా అభిమానులను మెట్రో ద్వారా గమ్యస్థానాలకు చేర్చారు. ఆ తర్వాత ఈ గ్రీన్ ఛానల్ ఘటన చోటు చేసుకుంది. ఎల్‌బీనగర్‌లోని కామినేని హాస్పిటల్‌ డాక్టర్లు , ఇతర మెడికోలు అర్ధరాత్రి 1గంటకు నాగోల్‌లోని మెట్రో స్టేషన్‌కు గుండెను తీసుకు వచ్చారు.. తక్షణమే దానిని మెట్రో రైల్‌కు తరలించారు. కేవలం 25 నిమిషాలలో ప్రత్యేక రైలు జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ స్టేషన్‌కు చేరుకుంది. అక్కడ ఉన్న అపోలో హాస్పిటల్‌ అంబులెన్స్‌ దానిని హాస్పిటల్‌కు చేర్చింది. లైన్‌ 3 సెక్యూరిటీ అధికారులతో పాటుగా మెట్రో అధికారులు ఈ ప్రయాణాన్ని ఎలాంటి అవాంతరాలు లేకుండా కొనసాగేలా చేశారు.
ఈ సందర్భంగా ఎల్‌ & టీఎంఆర్‌హెచ్‌ఎల్‌ ఎండీ–సీఈఓ శ్రీ కెవీబీ రెడ్డి మాట్లాడుతూ ''ప్రయాణీకుల సేవకు హైదరాబాద్‌ మెట్రో రైల్‌ కట్టుబడి ఉండటం మాత్రమే కాదు, అవసరమైన పక్షంలో మరిన్ని సేవలను అందించడానికి కట్టుబడి ఉంది. అవసరమైన సమయంలో తోడుండాలనేది మా సిద్ధాంతం. ఈ సారి కూడా మేము గ్రీన్‌ఛానెల్‌ ఏర్పాటు చేయడంతో పాటుగా వీలైనంత త్వరగా గుండెను తరలించి, ఓ ప్రాణం కాపాడాము. ప్రాణంతో ఉన్న అవయవాన్ని తరలించడంలో తోడ్పడిన డాక్టర్లు, హెచ్‌ఎంఆర్‌ సిబ్బందికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము''అని అన్నారు.


Tags:    

Similar News