మంకీపాక్స్ విషయంలో అలర్ట్ అయిన భారత్
ఈ వైరస్ సోకిన వారిలో జ్వరం, శరీరంపై దద్దుర్లు, ఒళ్లు నొప్పులు తదితర లక్షణాలు కనిపిస్తున్నాయి.
కరోనా నుంచి ప్రపంచ దేశాలు కోలుకుంటున్న తరుణంలో.. యూరప్ దేశాలు, అమెరికాలో మంకీపాక్స్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ వైరస్ వివిధ దేశాలకు అత్యంత వేగంగా విస్తరిస్తోంది. స్పెయిన్, పోర్చుగల్, ఇటలీ, స్వీడన్, కెనడా, అమెరికా, బెల్జియం, జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా కూడా ఈ జాబితాలో చేరాయి. అభివృద్ధి చెందిన దేశాల్లోనూ మంకీపాక్స్ కేసులు వెలుగులోకి రావడంపై శాస్త్రవేత్తలు షాకవుతున్నారు. ఆఫ్రికా దేశానికి వెళ్లని వారిలోనూ కేసులు నమోదయ్యాయి. విదేశాల్లో మంకీపాక్స్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. ఆ కేసులు నమోదైన దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను ఐసోలేషన్ లో ఉంచాలని, వారి నుంచి నమూనాలను సేకరించి పూణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలోని బీఎస్ఎల్-4కు పంపాలని ఆదేశించింది. అనేక దేశాల్లో మంకీపాక్స్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, భారత్‌లోకి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులను పరీక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం దేశంలోని అన్ని విమానాశ్రయాలకు హెచ్చరికలు జారీ చేసింది.
భారతదేశంలో ఇప్పటి వరకూ అలాంటి కేసులు నమోదవ్వలేదు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్‌జిఐఎ)లోని మొత్తం సిబ్బందిని మంకీపాక్స్ లక్షణాల గురించి అప్రమత్తం చేస్తామని ఉన్నతాధికారులు చెప్పారు. మంకీపాక్స్ కేసులు ఉన్న దేశాల నుండి వచ్చే ప్రయాణీకులకు సంబంధించి 21 రోజుల ప్రయాణ చరిత్రను సేకరిస్తూ ఉన్నారు. అంతర్జాతీయంగా వచ్చిన వారి ఆరోగ్యాన్ని ట్రాక్ చేయడానికి ప్రణాళికలు ఏవీ లేనప్పటికీ, విమానాశ్రయ సిబ్బంది, అక్కడ మోహరించిన ఆరోగ్య సిబ్బందికి లక్షణాల గురించి హెల్త్ అధికారులు వివరించారు.
ఈ వైరస్ సోకిన వారిలో జ్వరం, శరీరంపై దద్దుర్లు, ఒళ్లు నొప్పులు తదితర లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇవి 2 నుంచి 4 వారాల పాటు ఉంటాయి. మంకీపాక్స్‌లో ప్రధానంగా రెండు జాతులు(స్ట్రెయిన్స్) ఉన్నాయి. ఒకటి కాంగో స్ట్రెయిన్. ఇది కొంత తీవ్రంగా ఉంటుంది. ఈ స్ట్రెయిన్ సోకితే దాదాపు 10 శాతం వరకు మరణాలు సంభవించే అవకాశం ఉంది. మరో స్ట్రెయిన్ పశ్చిమ ఆఫ్రికా దీని మరణాల రేటు కేవలం 1 శాతం కంటే ఎక్కువ. ప్రస్తుతం UK లో నమోదు అవుతున్న కేసుల్లో పశ్చిమ ఆఫ్రికా స్ట్రెయిన్ ఉన్నట్లు గుర్తించారు. మంకీపాక్స్ సోకిన జంతువు కరిచినా, లేదంటే ఆ ఇన్ఫెక్షన్‌కు గురైన వ్యక్తి రక్తం, శరీర స్రావాలను తాకినా ఇది సోకుతుంది. నోటి నుంచి వెలువడే తుంపర్ల ద్వారా కూడా విస్తరిస్తుంది. మంకీపాక్స్ సోకిన జంతువుల మాంసాన్ని సరిగా ఉడికించకుండా తిన్నా ఇది సోకుతుంది. మశూచికి ఇచ్చే టీకాలే దీనిని కూడా నివారిస్తాయి. ఈ ఇన్ఫెక్షన్‌కు గురైన పది మందిలో ఒకరు చనిపోయే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తెలిపింది. మంకీపాక్స్ సోకిన వ్యక్తితో శృంగారంలో పాల్గొనడం వల్ల స్త్రీ, పురుషులు ఇద్దరికీ మంకీపాక్స్ సోకే ప్రమాదం ఉందని నిపుణుల చెబుతున్నారు.