Hyderabad : వామ్మో.. పూలు, పండ్లు నేడు కొనాలంటే బ్యాంక్ బ్యాలన్స్ సరిపోదేమో?

శ్రావణ శుక్రవారం కావడంతో ఒక్కసారిగా పూలు, పండ్లు ధరలు పెరిగిపోయాయి. కొనుగోలుచేయాలంటే పర్సు ఖాళీ అవుతుంది

Update: 2024-08-16 04:22 GMT

నేడు మొదటి శ్రావణ శుక్రవారం కావడంతో మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ శ్రావణ శుక్రవారం ఇంట్లో లక్ష్మీదేవికి పూజలు చేసుకుంటే శుభప్రదమని మహిళలు భావిస్తారు. ఇంట్లోనే అమ్మవారిని పసుపుతో అలంకరించి వరలక్ష్మీ పూజలను నిర్వహిస్తారు. వివిధ రకాల పండ్లు, పూలలతో అలంకరిస్తారు. అరటిపండ్లు, దానిమ్మ, ఆపిల్ వంటి పండ్లతో అమ్మవారిని అలంకరించి ప్రత్యేక పూజలను నిర్వహించడం ఆనవాయితీగా, సంప్రదాయంగా వస్తుంది.

శ్రావణ శుక్రవారం...
అందుకే శ్రావణమాసంలో పూలు, పండ్ల ధరలు విపరీతంగా పెరుగుతాయి. రాజమండ్రి మార్కెట్ నుంచి ఉదయాన్నే హైదరాబాద్ కు అరటి గెలల లోడుతో లారీలు వస్తున్నా ధరలు మాత్రం అందుబాటులోకి రావడం లేదు. నిన్న మొన్నటి వరకూ డజన్ అరటి పండ్లు అరవై నుంచి డెబ్బయి రూపాయలు వరకూ ఉండేది. అయితే ఈరోజు అరటి పండ్లు కొనుగోలు చేయాలంటే డజన్ కు 120 రూపాయలు పెట్టి కొనుగోలుచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాంబూలాల్లో అరటి పండ్లు పెట్టి ిఇచ్చే సంప్రదాయం ఉండటంతో వీటి ధరలు నింగినంటాయి.
పూలు కూడా...
కొత్త వస్త్రాలు ధరించి శ్రీమహాలక్ష్మి అమ్మవారిని ప్రార్థిస్తే అష్టశ్వైర్యాలు, ఆయురోరగ్యం ఫలిస్తుందని నమ్ముతారు. అందుకే శ్రావణ మాసంలో మహిళలు ప్రతి శుక్రవారం ప్రత్యేకంగా లక్ష్మీదేవికి పూజలు నిర్వహిస్తారు. ఇక మహిళలు పూలు ధరించి ఇంటికి తాంబూలాలకు వచ్చిన వారికి కూడా పండ్లు, పూలు ఇవ్వడం మామూలు. సాధారణ రోజుల్లో పావుకిలో 30 రూపాయలు ఉండే పూలు, ఇప్పుడు వంద రూపాయలకు చేరుకున్నాయి. అవి కూడా వాడిపోయి ఉంటున్నాయని మహిళలు వాపోతున్నారు. కడియం మార్కెట్ నుంచి వచ్చిన పూల ధరలకు రెక్కలు రావడంతో శ్రావణ మాసం వేళ మహిళలు పూలను విధిగా కొనాల్సిన రావడంతో ఇబ్బంది పడుతున్నారు.


Tags:    

Similar News