Hyderabad : హైదరాబాద్ లో మళ్లీ కుండపోత వాన
హైదరాబాద్ లో మళ్లీ భారీ వర్షం కురుస్తుంది. గంట నుంచి వర్షం పడుతుంది. భారీ వర్షానికి రహదారులన్నీ జలమయమయ్యాయి.
హైదరాబాద్ లో మళ్లీ భారీ వర్షం కురుస్తుంది. గంట నుంచి వర్షం పడుతుంది. భారీ వర్షానికి రహదారులన్నీ జలమయమయ్యాయి. చెరువులను తలపిస్తున్నాయి. మూడు రోజుల నుంచి భారీ వర్షాలు హైదరాబాద్‌ను వదలడం లేదు. ప్రతి రోజూ సాయంత్రం అయ్యేసరికి వర్షం కురిసి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. జనజీవనం అస్తవ్యస్తమయింది. ఉప్పల్, నాగోల్, బండ్లగూడ, సరూర్‌నగర్, ఎల్‌బి నగర్, మలక్‌పేట్, దిల్‌సుఖ్ నగర్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం కావడంతో సొంత వాహనాలతో బయటకు వచ్చిన వారు ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో ఎక్కడి ట్రాఫిక్ అక్కడే స్థంభించి పోయింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ అధికారులు అప్రమత్తం చేశారు. డ్రైనేజీ నీరు రహదారులపై ఉప్పొంగుతుండటంతో దుర్వాసన వెలువడుతోంది.
రేపు అయితే...?
వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించినట్లుగానే భారీ వర్షం కురుస్తుంది. ఎన్నడూ లేనిది హైదరాబాద్ ను వాన వదలడం లేదు. ఈరోజు ఆదివారం కావడంతో సరిపోయింది. రేపు కూడా వర్షం పడితే మాత్రం విధులకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సాప్ట్‌వేర్ కంపెనీల నుంచి కూడా ఉద్యోగులు బయటకు వచ్చే సమయంలోనే వర్షం పడే అవకాశముండటంతో పోలీసులు కూడా ముందు జాగ్రత్తగా కంపెనీలు సమయం వేళలు పాటించాలని కోరుతున్నారు. విడతల వారీగా బయటకు వస్తే మంచిదన్న సూచనలు వెలువడుతున్నాయి. మరోవైపు భారీ వర్షం కురిసిన నేపథ్యంలో ప్రజలు ఎవరూ మ్యాన్‌హోల్ మూతలు తెరిచే ప్రయత్నం చేయవద్దని కోరుతున్నారు. దీంతో పాటు జీహెచ్‌ఎంసీ అధికారులు తమ సిబ్బందిని నగరంలో రోడ్లపైకి పంపి నిలిచిపోయిన నీటిని బయటకు పంపే ప్రయత్నం చేస్తున్నారు.