Hydrabad : హైదరాబాద్ లో భారీ వర్షం... నిలిచిపోయిన ట్రాఫిక్
హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తుంది. నగరంలోని అనేక ప్రాంతాల్లో వర్షం కురుస్తుండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తుంది. నగరంలోని అనేక ప్రాంతాల్లో వర్షం కురుస్తుండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నైరుతి రుతుపవాల ప్రభావంతో వర్షం పడుతుందని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికలు నిజమయ్యాయి. దాదాపు తెలంగాణలోని 20 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురుస్తుండటంతో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడ్డాయి. మాదాపూర్, ఐకియా సెంటర్ వద్ద వాహనాలు నిలిచిపోయాయి. సోమవారం కావడంతో ఉద్యోగులు విధులను ముగించుకుని ఇంటికి వచ్చే సమయంలో వర్షం ప్రారంభమయింది. దీంతో రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. డ్రైనేజీ నీరు అనేక చోట్ల ఉప్పొంగి రహదారులపైకి ప్రవహిస్తుండటంతో దుర్గంధ భూరిత మైన వాతావరణం నెలకొంది. ట్రాఫిక్ ను చక్కదిద్దేందుకు పోలీసుఅు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.
అకాల వర్షంతో...
మొన్నటి వరకూ భారీ వర్షాలతో హైదరాబాద్ నగరం తడిసి ముద్దయింది. అయితే కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చిన అనంతరం ఈరోజు భారీ వర్షం కురవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మాదాపూర్, కొండాపూర్, కూకట్ పల్లి, అమీర్ పేట్, ఎల్‌బి నగర్, దిల్ సుఖ్ నగర్, సరూర్ నగర్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఇంకా వర్షం కురుస్తూనే ఉండటంతో చాలా మంది కార్యాలయాలకే పరిమితమయ్యారు. అనేక ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ కార్యాలయం హెచ్చరికలు జారీ చేసింది. వర్షపు నీళ్లు ఇళ్లలోకి రాకుండా మ్యాన్ హోల్స్ మూతలు ఎవరూ తీయవద్దంటూ హెచ్చరించింది. రహదారులపై నీరు పోవడానికి కూడా వ్యాపారులు మ్యాన్ హోల్ మూతలు తొలగించవద్దని కోరింది.