హైదరాబాద్ లో హై అలర్ట్.. మొదలైన సోదాలు
హైదరాబాద్ హై అలర్ట్ మోడ్ లోకి వెళ్ళింది. పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు;
బెంగుళూరులోని రామేశ్వరం కేఫ్‌లో పేలుడు ఏదో సిలిండర్ పేలుడు కారణంగా సంభవించిందని అందరూ భావించారు. అయితే ఓ వ్యక్తి తీసుకుని వచ్చిన బ్యాగ్ కారణంగా ఈ పేలుడు సంభవించిందని ప్రాథమిక పరిశోధనల్లో తేలింది. అంతేకాకుండా ఐఈడీ కారణంగా ఈ పేలుడు జరిగిందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చెప్పడంతో దేశంలోని పలు నగరాల్లో హై-అలర్ట్ ప్రకటిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.
బెంగళూరులోని బ్రూక్‌ఫీల్డ్‌లోని రామేశ్వరం కేఫ్ యజమాని పేలుడుకు కారణం బ్యాగ్ అని తెలిపారు. అందుకు సంబంధించిన సిసి టీవీ ఫుటేజీ కూడా బయటకు వచ్చింది. కర్ణాటక డీజీపీ కూడా పేలుడుకు బాంబు కారణమని ధృవీకరించారు. ఫోరెన్సిక్ బృందం, బాంబు స్క్వాడ్ నివేదికలను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ), ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబి)కి పంపుతున్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్ లో 2007 సంవత్సరంలో జంట పేలుళ్లుగా పిలువబడే గోకుల్ చాట్, లుంబినీ పార్క్ బాంబు పేలుళ్లకు ఉగ్రవాదులు వదిలివెళ్లిన బ్యాగ్ కారణమని తెలిసిందే!! హైదరాబాద్ నగరం ఇంకా ఆ జంట పేలుళ్ల నుండి కోలుకోలేదు. ఇప్పుడు బెంగళూరులో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్ హై అలర్ట్ మోడ్ లోకి వెళ్ళింది. పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. నగరంలోని పలు ప్రాంతాలలో భద్రతను కట్టుదిట్టం చేశారు. రామేశ్వరం కేఫ్ పేలుడులో ఎటువంటి ప్రాణనష్టం జరగనప్పటికీ, 7-9 మంది గాయపడి ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.