Allu Arjun : అల్లు అర్జున్ విడుదల ఆలస్యమవ్వడానికి కారణాలేంటి?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చంచలగూడ జైలు నుంచి నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చంచలగూడ జైలు నుంచి నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు. జిల్లా జైలు వెనక గేటు నుంచి అల్లు అర్జున్ ను పంపించివేశారు. గీతా ఆర్ట్స్ కార్యాలయం నుంచి నేరుగా ఆయన ఇంటికి చేరుకోనున్నారు. నిన్న సాయంత్రమే హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసినా ఆయన విడుదల కావడంలో ఆలస్యమయింది. రాత్రంతా ఆయన జైలులోనే ఉండి పోవాల్సి వచ్చింది. సరైన పత్రాలు సమర్పించని కారణంగా జైలు అధికారులు ఆలస్యం చేశారని తెలిసింది.
న్యాయవాదులు ఏమంటున్నారంటే?
అయితే అల్లు అర్జున్ న్యాయవాదులు మాత్రం కావాలనే అల్లు అర్జున్ ను జైలు అధికారులు రాత్రంతా జైలులో ఉంచారని చెబుతున్నారు. వెంటనే అల్లుఅర్జున్ ను విడుదల చేయాలని కోర్టు ఆదేశించినా జైలు అధికారులు నిబంధనల పేరిట ఆలస్యం చేశారని అన్నారు. జైలు అధికారులపై కోర్టు థిక్కారణ కేసు వేసే అవకాశాన్ని పరిశీలిస్తామని అల్లు అర్జున్ న్యాయవాదులు తెలిపారు. అయితే గీతా ఆర్ట్స్ కార్యాలయం, అల్లు అర్జున్ నివాసం వద్ద పెద్దయెత్తున పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు.
ఎవరిది తప్పయినా...?
కానీ జైలు అధికారులు మాత్రం తమకు న్యాయమూర్తి ఇచ్చిన బెయిల్ ఆదేశాలు స్టాంప్ తో లేనివి తొలుత తెచ్చారని, వాటిని తాము పరిగణనలోకి తీసుకోమని చెబుతున్నారు. నేరుగా తమకు న్యాయమూర్తి సంతకంతో ఉన్న బెయిల్ విడుదల పత్రాలు అందాల్సి ఉండగా, వాటిని సమర్పించడంలో అల్లు అర్జున్ లాయర్లు నిబంధనలను పాటించలేదని చెబుతున్నారు. మొత్తం మీద లాయర్ల నిర్వాకమో? జైలు అధికారుల నిబంధనలకు పట్టుబట్టిన కారణం వల్లనో అల్లు అర్జున్ మాత్రం ఈరోజు ఉదయం 6.45 గంటలకు విడుదలయ్యారు.