బేగం బజార్‌లో శుక్రవారం జరిగిన పరువు హత్యకు పాల్పడ్డ నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడన్న కారణంతో నీరజ్ పన్వార్ అనే యువకుడిని శుక్రవారం బేగం బజార్ పరిధిలోని మచ్చి మార్కెట్‌లో ఐదుగురు వ్యక్తులకు మూకుమ్మడిగా దాడి చేసి హత్య చేశారు. ఈ ఘటనలో మృతుడి భార్య సంజన సోదరుడే ప్రధాన నిందితుడిగా పోలీసులు నిర్ధారించారు. నీరజ్‌ను హత్య చేసిన తర్వాత రెండు బైకులపై పరారైన నిందితులు తెలంగాణ సరిహద్దు రాష్ట్రం కర్ణాటకకు వెళ్లాలని అనుకున్నారు. వీరి కోసం ముమ్మరంగా గాలిస్తూ.. కర్ణాటక పోలీసులను అలెర్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు... కేవలం గంటల వ్యవధిలోనే నిందితులతో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వారిని కర్ణాటక నుంచి హైదరాబాద్ తరలిస్తున్నారు. నీరజ్ హత్యకు పాల్పడ్డ వారిని రోహిత్, రంజిత్, కౌశిక్, విజయ్ గా గుర్తించిన పోలీసులు వారితో కలిసి ఉన్న మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు.
తన భర్తను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని మతుడు నీరజ్ భార్య సంజన కోరారు. నీరజ్ భార్య మాట్లాడుతూ.. 'నేను వివాహం చేసుకున్న తర్వాత నా బిడ్డ చనిపోయిందని వారు నన్ను వదిలేశారు. కానీ వాళ్లు ఇప్పుడిలా చేయడం వల్ల నాకు అన్యాయం జరిగింది' అంటూ సంజన వాపోయింది. తనకు, తన అత్త, మామలకు కూడా ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. నిందితులను ఉరితీయాలని సంజన డిమాండ్ చేసింది. తన సోదరులే నీరజ్ ను చంపారని, ఏడాది కాలంగా చంపుతామంటూ బెదిరిస్తున్నారని ఆమె చెప్పింది. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, ఇప్పుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేసింది. సంజన, ఆమె బంధువులు గంట పాటు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. నిందితులను తమ ముందుకు తీసుకురావాలని డిమాండ్ చేశారు. శిక్షపడేలా చూస్తామంటూ అధికారులు, ఎమ్మెల్యే రాజాసింగ్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. హత్య ఘటనపై సంజన తల్లి, సోదరి స్పందించారు. తన కూతురు జీవితాన్ని నాశనం చేశారని తల్లి మధుభాయి ఆవేదన వ్యక్తం చేసింది. హత్య చేసిన వాళ్లను ఉరి తీయాలని డిమాండ్ చేసింది. తన కుమారులకు హత్యతో ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. తన కూతురు, అల్లుడిని చంపుతామంటూ కొందరు బెదిరించారని, వాళ్లెవరో కూడా తెలియదని చెప్పింది. హత్య సమయంలో తన కొడుకు రితేశ్, తన బావ కుమారులు నలుగురూ ఇంట్లోనే ఉన్నారని పేర్కొంది. సంజనతో ఏడాది నుంచి మాటలు లేవని ఆమె సోదరి మమత చెప్పింది. అమ్మ ఆరోగ్యం బాగా లేకపోవడంతో రెండు నెలలుగా తనతో మాట్లాడుతోందని తెలిపింది. ప్రేమ వివాహం ఇష్టం లేకనే ఆమెను దూరం పెట్టామని, భర్తతో కలిసి సంతోషంగా ఉండాలని కోరుకున్నామని చెప్పింది.