Tankbund: ట్యాంక్ బండ్ పై ఫెన్సింగ్ ను కట్ చేసిన భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి

హైకోర్టు ఆజ్ఞల ప్రకారం ట్యాంక్ బండ్‌పై విగ్రహాల నిమజ్జనం చేయకూడదు

Update: 2024-09-15 08:43 GMT

ట్యాంక్ బండ్ పై గణేష్ విగ్రహాల నిమజ్జనానికి అనుమతించాలని డిమాండ్ చేస్తూ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదివారం అల్టిమేటం జారీ చేసింది. నిమజ్జనం ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తోందని, నిమజ్జనం నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. జీహెచ్‌ఎంసీ, హైదరాబాద్‌ పోలీసులు ఏర్పాటు చేసిన ఫ్లెక్స్‌ బ్యానర్లు, బారికేడ్లను సమితి సభ్యులు తొలగించారు. ట్యాంక్‌బండ్‌పై నిమజ్జనం ఏళ్ల తరబడి ఆనవాయితీగా వస్తున్నదని, కొత్త ఆంక్షలు విధించి భక్తుల మనోభావాలను దెబ్బతీయవద్దని అధికారులను కోరారు. 2022, 2023లో ఇలాంటి నిబంధనలు తీసుకొచ్చినప్పటికీ, చివరికి అనుకున్న ప్రకారం నిమజ్జనం జరిగిందన్నారు.

హైదరాబాద్ పోలీసులు, GHMC ట్యాంక్ బండ్ అనుసంధాన రహదారుల వద్ద "తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఆజ్ఞల ప్రకారం ట్యాంక్ బండ్‌పై విగ్రహాల నిమజ్జనం చేయకూడదు" అనే సందేశంతో కూడిన ఫ్లెక్స్ బ్యానర్‌లను ఉంచారు. విగ్రహాల నిమజ్జనం జరగకుండా ట్యాంక్‌బండ్‌ వెంబడి 10 అడుగుల ఎత్తులో ఫెన్సింగ్‌ ఏర్పాటు చేశారు. ఆ ఫెన్సింగ్ ను భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు కట్ చేసి కొన్ని విగ్రహాల నిమజ్జనాన్ని నిర్వహించారు.

ప్రభుత్వం వెంటనే ట్యాంక్ బండ్ పై గణేష్ నిమజ్జన ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో హైదరాబాద్ లోని అన్ని వినాయక మండపాల నిర్వాహకులకు సమాచారం తెలియజేసి నగర వ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తామన్నారు. ఎక్కడికక్కడ మండపాల్లో వినాయకులను అదే విధంగా ఉంచుతామని, నిమజ్జనం చేయమని భాగ్య నగర్ గణేష్ ఉత్సవ సమితి నేతలు హెచ్చరించారు.


Tags:    

Similar News